Share News

CM Revanth Reddy: నేడు ఢిల్లీ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి

ABN , Publish Date - Jul 21 , 2024 | 07:23 AM

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఉదయం మహంకాళి అమ్మవారి దర్శనం చేసుకున్న అనంతరం మధ్యాహ్నం ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళతారు. ఆదివారం రాత్రి గానీ, సోమవారం గానీ ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీతో భేటీ కానున్నారు.

CM Revanth Reddy: నేడు ఢిల్లీ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఆదివారం ఢిల్లీ (Delhi) పర్యటనకు వెళ్లనున్నారు. ఉదయం మహంకాళి అమ్మవారి దర్శనం చేసుకున్న అనంతరం మధ్యాహ్నం ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళతారు. ఆదివారం రాత్రి గానీ, సోమవారం గానీ ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi)తో భేటీ కానున్నారు. ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని రైతులకు రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల రుణమాఫీ అమలును సీఎం రేవంత్‌ ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనిని పురస్కరించుకుని వరంగల్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించాలని రేవంత్‌ నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి రాహుల్‌గాంధీని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించనున్నారు.


అయితే అటు పార్లమెంటు, ఇటు అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ఏకకాలంలో జరగనున్న నేపథ్యంలో రాహుల్‌గాంధీ వెసులబాటును బట్టి బహిరంగ సభ తేదీని నిర్ణయించనున్నారు. ఇక ఢిల్లీ పర్యటనలో భాగంగా రేవంత్‌.. ఇతర కాంగ్రెస్‌ అధిష్ఠానం పెద్దలను కూడా కలిసి మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్‌ పదవుల నియామకాలపైనా సంప్రదింపులు జరిపే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతోపాటు సీఎం పలువురు కేంద్ర మంత్రులనూ కలిసి.. రాష్ట్రంలో అభివృద్ధి పనులకు నిధులు కోరనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.


కాగా తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. మంగళవారం ఉదయం 11 గంటలకు శాసనసభ సమావేశం కానుంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను గవర్నర్ జారీ చేశారు. మొదటి రోజున అసెంబ్లీలో కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే లాస్య నందితకు సంతాపం ఉంటుంది. 25న రాష్ట్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది రుణ మాఫీ, ఆరు గ్యారెంటీలు సహా అన్ని పథకాలను పరిగణనలోకి తీసుకుని రూ.2.90 లక్షల కోట్లతో బడ్జెట్‌ను రూపొందించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఏప్రిల్‌ నుంచి జూలై వరకు నాలుగు నెలల కోసం ప్రవేశపెట్టిన ‘ఓట్‌-ఆన్‌-అకౌంట్‌’ బడ్జెట్‌ గడువు ఈ నెల 31తో ముగియనుండడంతో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టాల్సిన అనివార్యత ఏర్పడింది. ఈ మేరకు శాఖలవారీగా బడ్జెట్‌ ప్రతిపాదనలను డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఇప్పటికే సమీక్షించారు. ఆయా శాఖలు తమ ప్రాధమ్యాలను వివరించగా.. ప్రభుత్వం కూడా బడ్జెట్‌పై ఒక అంచనాకు వచ్చింది.

Updated Date - Jul 21 , 2024 | 07:25 AM