Share News

Hyderabad: సీఎం రేవంత్‌తో టాలీవుడ్ ప్రముఖుల భేటీ.. చర్చిస్తున్న అంశాలు ఇవే..

ABN , Publish Date - Dec 26 , 2024 | 11:30 AM

తెలంగాణ: బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌ (సీసీసీ)లో సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు సమావేశం అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యేందుకు సినీ ప్రముఖులు నాగార్జున, వెంకటేశ్, నితిన్ , కిరణ్ అబ్బవరం, సిద్ధూ జొన్నలగడ్డ సీసీసీకి చేరుకున్నారు.

Hyderabad: సీఎం రేవంత్‌తో టాలీవుడ్ ప్రముఖుల భేటీ.. చర్చిస్తున్న అంశాలు ఇవే..
CM Revanth Reddy

హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌(సీసీసీ)లో సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు సమావేశం అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యేందుకు సినీ ప్రముఖులు నాగార్జున, వెంకటేశ్, నితిన్, కిరణ్ అబ్బవరం, సిద్ధూ జొన్నలగడ్డ సీసీసీకి చేరుకున్నారు. అలాగే దర్శకులు త్రివిక్రమ్, కొరటాల శివ, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, బోయపాటి శీను, వీరశంకర్, హరీశ్ శంకర్, ప్రశాంత్ వర్మ, సాయి రాజేశ్, వశిష్ట సైతం వచ్చారు. నిర్మాతలు అల్లు అరవింద్, సురేశ్ బాబు, సుధాకర్ రెడ్డి, సి.కల్యాణ్, గోపి ఆచంట, శ్యాంప్రసాద్ రెడ్డి, బీవీఎస్ ప్రసాద్, కె.ఎల్. నారాయణ, మైత్రీ రవి, నవీన్ సీసీసీకి చేరుకున్నారు. దిల్ రాజు నేతృత్వంలో మెుత్తం 36 మంది సభ్యులు రేవంత్‌తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డితో సినీ పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలపై చర్చిస్తున్నారు.

Revanth-5.jpg


ప్రధానంగా చర్చించే అంశాలు ఇవే..

సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమైన టాలీవుడ్ ప్రముఖులు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ఆయనతో ప్రధానంగా చర్చిస్తున్నారు. తెలంగాణలో చిత్ర పరిశ్రమ అభివృద్ధితోపాటు పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై రేవంత్‌తో మాట్లాడుతున్నారు. గద్దర్ అవార్డుల పరిశీలన, చిన్న, మధ్య స్థాయి సినిమాలకు థియేటర్స్ కేటాయింపు వంటి అంశాలపైనా చర్చసాగుతోంది. అలాగే తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు పెద్ద పీటవేసే సినిమాలకు ప్రోత్సాహకాలపైనా చర్చిస్తున్నారు. ఇటీవల జరిగిన సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన, టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోల రద్దు అంశంపైనా ప్రధానంగా చర్చ సాగుతోంది.

Revanth-1.jpg


రేవంత్ రెడ్డి ప్రతిపాదనలు ఇవే..

టాలీవుడ్‌ ప్రముఖులతో చర్చల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున కొన్ని ప్రతిపాదనలు చేశారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా జరిగే ప్రచారంలో సినీ పరిశ్రమ సహకరించాలని ఆయన కోరారు. సినిమా టికెట్లపై విధించే సెస్సును ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌ నిర్మాణానికి వెచ్చించనున్నట్లు ఆయన తెలిపారు. ఇటీవల తెలంగాణ చేపట్టిన కులగణన సర్వేలోనూ సినీ హీరోలు పాల్గొనాలని ఆయన చెప్పారు. సినిమా టికెట్ల రేట్ల పెంపు ఉండకపోవచ్చని, బెనిఫిట్‌ షోలు, స్పెషల్ టికెట్ల రేట్ల పెంపు ఉండకపోవచ్చని చెప్పినట్లు తెలుస్తోంది.

Revanth-2.jpg


ఘటనపై విచారం..

ఈ సమావేశంలో సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్‌లను చిక్కడపల్లి పోలీసులు తెరపై ప్రదర్శించారు. పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతిచెందగా.. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియోలను ప్రదర్శించగా.. ఘటనపై సీఎం వద్ద సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు.

Revanth-3.jpg


డీజీపీ ఏం చెప్పారంటే..

సినీ ప్రముఖులు, సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన సమావేశంలో తెలంగాణ డీజీపీ జితేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సినీనటుల ప్రవర్తనపై అసహనం వ్యక్తం చేశారు. సినిమా ప్రమోషన్స్ సమయంలో పోలీసులు అనుమతి నిరాకరిస్తే దాన్ని వారు పాటించాల్సిందే అని డీజీపీ తేల్చి చెప్పారు. పోలీసులు అన్ని రకాలుగా ఆలోచించే అనుమతి ఇవ్వలా, వద్దా అనే నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. పోలీసుల నిర్ణయాన్ని సినీ పరిశ్రమ గౌరవించాలని డీజీపీ కోరారు. బౌన్సర్లను నియమించుకున్నప్పుడు న్యాయ సమ్మతం ఉండాలని చెప్పారు. ఇటీవల వారి ప్రవర్తన బాగోలేదని వెల్లడించారు. ఏ ఈవెంట్ నిర్వహించినా ముందస్తు అనుమతులు తీసుకోవాలని చెప్పారు. అన్ని పరిశీలించిన తర్వాతే పోలీసులు నిర్ణయం తీసుకుంటారని డీజీపీ జితేందర్ చెప్పుకొచ్చారు.

Revanth-4.jpg


యువకుడు హల్‌చల్..

మరోవైపు సీసీసీ వద్ద ఓ యువకుడు హల్‌చల్ చేశాడు. సినిమా రేట్లు పెంచవద్దన్ని ప్లకార్డులతో నిరసన తెలిపాడు. వాళ్లు సినిమా పెద్దలు కాదు గద్దలు అంటూ నినాదాలు చేశాడు. దీంతో పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. యువకుడి వివరాలు తెలియాల్సి ఉంది.

Updated Date - Dec 26 , 2024 | 12:07 PM