Share News

Governor: హైడ్రా ఆర్డినెన్స్‌కు గవర్నర్ గ్రీన్ సిగ్నల్..

ABN , Publish Date - Oct 02 , 2024 | 09:55 AM

హైడ్రాకు ప్రత్యేక చట్టం కల్పించారు. మున్సిపల్ చట్టంలో 374 - బీ సెక్షన్ చేరుస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. హైడ్రాకు ఎదురవుతున్న ఆటంకాలు తొలగిస్తూ ప్రత్యేక ఆర్డినెన్స్ రూపకల్పన చేసింది. ఈ ఆర్డినెన్స్‌ను కేబినెట్ ఆమోదం తెలపడంతో ఫైల్‌ను రాజ్ భవన్‌కు పంపింది. ఈ ఆర్డినెన్స్‌కు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆమోదం తెలిపారు.

Governor: హైడ్రా ఆర్డినెన్స్‌కు గవర్నర్ గ్రీన్ సిగ్నల్..

హైదరాబాద్: హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఎసెట్‌ ప్రొటెక్షన్‌ (Hydra) హైడ్రాకు హై పవర్స్ (High powers) వచ్చాయి. హైడ్రా ఆర్డినెన్స్‌కు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ (Green Signal) ఇచ్చారు. ఇకపై హైడ్రాకు ప్రత్యేక చట్టం కల్పించారు. మున్సిపల్ చట్టంలో 374 - బీ సెక్షన్ (B Section) చేరుస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ (Ordinance of Govt) జారీ చేసింది. హైడ్రాకు ఎదురవుతున్న ఆటంకాలు తొలగిస్తూ ప్రత్యేక ఆర్డినెన్స్ రూపకల్పన చేసింది. ఈ ఆర్డినెన్స్‌ను కేబినెట్ (Cabinet) ఆమోదం తెలపడంతో ఫైల్‌ను రాజ్ భవన్‌కు పంపింది. ఈ ఆర్డినెన్స్‌కు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ (Governor Jishnu Dev Verma) ఆమోదం తెలిపారు. గవర్నర్ వ్యక్తం చేసిన పలు సందేహాలకు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ (Dana Kishore) వివరణ ఇచ్చారు. ప్రభుత్వ వివరణలతో సంతృప్తి చెందిన గవర్నర్ హైడ్రా ఆర్డినెన్స్‌ ఫైల్‌పై సంతకం చేశారు. దీన్ని రాజ్ భవన్ వర్గాలు అధికారికంగా వెల్లడించాయి. జీహెచ్ఎంసీ చట్టం 1955లో 374 బీ సెక్షన్ చేరుస్తూ ఆర్డినెన్స్ జారీ చేశారు. ఓఆర్ఆర్ పరిధి వరకు ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, నాలాలు పరిరక్షిస్తూ సర్వాధికారాలు ఇచ్చేలా చట్టం రూపొందించారు. జిల్లా కలెక్టర్, ఎమ్మార్వో, వాల్టాయాలోని అధికారాలు హైడ్రాకు బదలాయించారు.


ఖాళీ చేసిన ఇళ్ల కూల్చివేత

కాగా మూసీ సుందరీకరణలో మరో అడుగుపడింది. డ్రోన్‌ సర్వే ద్వారా గుర్తించిన నదీ గర్భం (రివర్‌ బెడ్‌)లో ఉన్న ఇళ్ల కూల్చివేత మొదలైంది. స్వచ్ఛందంగా తరలివెళ్లినవారి నివాసాలను తొలగిస్తున్నారు. వీరికి డబుల్‌బెడ్‌ రూం ఇళ్ల తాళాలు అప్పగించాకనే.. మూసీలో ఖాళీ చేసిన ఇళ్లను పడగొడుతున్నారు. ప్రజలు నివసిస్తున్న వాటి జోలికి వెళ్లడం లేదు. మంగళవారం రెవెన్యూ అధికారులు, పోలీసుల పర్యవేక్షణలో హైదరాబాద్‌లోని నాంపల్లి, సైదాబాద్‌, హిమాయత్‌నగర్‌ మండలాల పరిధి శంకర్‌నగర్‌, వినాయక వీధిలో ఇళ్ల కూల్చివేత చేపట్టారు. ఈ ప్రాంతాల్లో 333 నిర్మాణాలుండగా 300 ఇళ్లకు రివర్‌ బెడ్‌ మార్కింగ్‌ పెట్టారు. 83 ఇళ్లను పడగొట్టినట్లు అధికారులు తెలిపారు. వీటిలో ఎక్కువగా రేకుల షెడ్లు ఉన్నాయి. ఇరుకు గల్లీల్లో ఉండడంతో పొక్లెయిన్లు లేకుండా కూలీలను ఏర్పాటు చేసి నెమ్మదిగా పడగొడుతున్నారు. ఇంటి సామగ్రిని తీసుకెళ్లేందుకు నిర్వాసితులకు అవకాశం కల్పించారు.


ప్రత్యేక వాహనాలు

వస్తువుల తరలింపునకు ప్రత్యేక వాహనాలను అందుబాటులో ఉంచారు. నిర్వాసితులను మలక్‌పేట్‌లోని పిల్లి గుడిసెలు, ఉప్పల్‌లోని ప్రతాప సింగారంలో ఉన్న డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల సముదాయానికి తరలిస్తున్నారు. కాగా, శంకర్‌నగర్‌లో కొందరు నిరసన వ్యక్తం చేశారు. చిన్న డబుల్‌ బెడ్‌ రూంలలో పెద్ద కుటుంబాలు ఎలా ఉంటాయని వాపోయారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయగా పోలీసులు సముదాయించారు. మూసీతో తలెత్తే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని చాలామంది ఖాళీ చేసేందుకు ముందుకొస్తున్నారు. ఇద్దరు, ముగ్గురు పిల్లలున్న కుటుంబాలు సంతోషంగా వెళ్తుండగా, 6 నుంచి 10 మంది ఉన్నవారు భావోద్వేగానికి గురవుతున్నారు. శనివారం నుంచి 148 మంది వెళ్లినట్లు హైదరాబాద్‌ ఆర్డీవో మహిపాల్‌ తెలిపారు. నాంపల్లి నుంచి జియాగూడలోని డబుల్‌ బెడ్‌రూంలకు 24 మందిని తరలించినట్లు చెప్పారు.


అందరికీ ఒకే విధంగానా..

మూసీ సుందీకరణ ప్రాజెక్టులో.. హైదరాబాద్‌, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో డ్రోన్‌ సర్వే ద్వారా 2,166 నిర్మాణాలను గుర్తించారు. 1,478 ఇళ్లకు రివర్‌ బెడ్‌ మార్కింగ్‌ వేశారు. హైదరాబాద్‌ జిల్లాలో 1,595 నిర్మాణాలకు గాను 1,333కు మార్కింగ్‌ పెట్టారు. అధికారులు కౌన్సెలింగ్‌ ఇస్తూ డబుల్‌ బెడ్‌రూమ్‌లకు తరలించే చర్యలు తీసుకుంటున్నారు. నిర్వాసితుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు మూసీ ఇబ్బందులు తీరినట్లేనని భావిస్తుండగా.. మరికొందరు తమకు తీరని అన్యాయం చేస్తున్నారని విలపిస్తున్నారు. 30, 40 గజాల్లో ఉంటున్నవారికి, 100-150 గజాల్లో రూ.లక్షలతో ఇల్లు కట్టుకున్నవారికి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లకు వెళ్లినవారిలో కొందరు సౌకర్యాలు లేవని ఆరోపిస్తున్నారు. అప్పటికే ఆ ఇళ్లలో ఉన్నవారు సహకరించడం లేదని.. ఈ సమస్య నివారణకు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్పారు. మూసీ నిర్వాసితుల సమస్యలు తెలుసుకునేందుకు కలెక్టరేట్‌లో గ్రీవెన్స్‌ సెల్‌ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి ఒక ప్రకటనలో తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గాంధీజీ జయంతి సందర్భంగా మంత్రి లోకేష్ నివాళి..

హూక్కా సెంటర్‌పై పోలీసుల దాడులు..

అరసవిల్లిలో భక్తులకు కనువిందు చేసిన అద్భుత దృశ్యం

సూపర్ 6 అమలు చేస్తాం

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 02 , 2024 | 09:55 AM