Share News

Traffic Jam: హుస్సేన్ సాగర్ చుట్టూ భారీ ట్రాఫిక్ జామ్.. 20 నిమిషాల ప్రయాణానికి గంట సమయం

ABN , Publish Date - Sep 16 , 2024 | 07:46 PM

గణేశుడి నిమజ్జనం వేళ ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. సిటీ నలుమూలల నుంచి వస్తున్న వినాయకులతో రోడ్లపై భారీ రద్దీ నెలకొంది. ట్యాంక్‌బండ్‌ చుట్టూ కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

Traffic Jam: హుస్సేన్ సాగర్ చుట్టూ భారీ ట్రాఫిక్ జామ్.. 20 నిమిషాల ప్రయాణానికి గంట సమయం

హైదరాబాద్: గణేశుడి నిమజ్జనం వేళ ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. సిటీ నలుమూలల నుంచి వస్తున్న వినాయకులతో రోడ్లపై భారీ రద్దీ నెలకొంది. ట్యాంక్‌బండ్‌ చుట్టూ కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి బారులు తీరిన విఘ్నేశ్వరుల నిమజ్జనం సోమవారం మధ్యాహ్నానికి పూర్తయింది.

ట్రాఫిక్‌ ఆంక్షలు, దారి మళ్లింపుతో ట్రాఫిక్ స్తంభించింది. సాధారణ రోజుల్లో 20 నిమిషాలపాటు జరిగే ప్రయాణానికి, ఇప్పుడు సుమారు గంట సమయం పడుతోందని వాహనదారులు చెబుతున్నారు. పోలీసుల పర్యవేక్షణ లేక ఇబ్బందులు పడుతున్నారు. ఎంజే మార్కెట్ నుంచి ఖైరతాబాద్‌ వరకు భారీగా వాహనాలు నిలిచిపోయాయి.


ఆదివారం నుంచి బుధవారం వరకు ట్యాంక్‌బండ్‌పై నిమజ్జనం కారణంగా భారీగా ట్రాఫిక్‌ ఉంటుందని పోలీసులు తెలిపారు. ఖైరతాబాద్, లక్డీకాపూల్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో వినాయక నిమజ్జనాలు ఆలస్యం అవుతున్నాయి. హుస్సేన్ సాగర్ చుట్టూ సరిపడా క్రేన్లు లేకపోవడంతో నిమజ్జనం కోసం గణనాథులు బారులు తీరారు. దాదాపు 5 కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. అర్ధరాత్రి నుంచి నిమజ్జనాల కోసం గణనాథులు వెయిటింగ్‌లో ఉన్నాయి. ఖైరతాబాద్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్ మార్గాలను పోలీసులు మూసివేశారు. ట్యాంక్ బండ్‌కు వచ్చే వాహనాలను దారి మళ్లించారు.

For Latest News and National News click here

Updated Date - Sep 16 , 2024 | 07:47 PM