Share News

Hyderabad: హైడ్రా కూల్చివేతలపై భయం భయం

ABN , Publish Date - Sep 29 , 2024 | 11:22 AM

హైదరాబాద్ శివారు ప్రజలు ఆదివారం అంటే చాలు వణికిపోతున్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్నారు. శివారు ప్రజలు సండేను ఫండేలా ఎందుకు చూడటం లేదు. ఎందుకంత భయ పడుతున్నారు.

Hyderabad: హైడ్రా కూల్చివేతలపై భయం భయం
Hydra

ఆందోళనలో మూసీ పరీవాహక నివాసితులు

మా ఇళ్లు కూల్చొద్దంటూ పలుచోట్ల నిరసనలు

తమ ప్రాంతానికి రావొద్దంటూ ప్లకార్డుల ప్రదర్శన

బెంగళూరు హైవేపై బహదూర్‌పురా వద్ద బైఠాయింపు

రెడ్‌ మార్కింగ్‌ పనులకు తాత్కాలిక విరామం

ఇళ్లు, షెడ్ల వద్ద పగలు, రాత్రిళ్లు కాపలా

పలు కుటుంబాలకు ‘డబుల్‌’ ఇళ్ల కేటాయింపు


దిల్‌సుఖ్‌నగర్‌/మదీన, సెప్టెంబర్‌ 28 (ఆంధ్రజ్యోతి): చెరువులు, కుంటలు, మూసీ పరీవాహక నివాసితులకు ‘ఆదివారం’ భయం పట్టుకున్నది. అధికారులు ఎక్కడ తమ ఇళ్లను కూల్చివేస్తారోనని ఆందోళన చెందుతున్నారు. ఆదివారం సెలవుదినం కావడంతో ఆక్రమణలను కూల్చివేసే ప్రమాదం ఉన్నదని భయభయంగా గడుపుతున్నారు. మూసీ పరీవాహక ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. తమ ఇళ్లను కూల్చొద్దంటూ శనివారం పలుచోట్ల నిరసన వ్యక్తం చేశారు. బహదూర్‌పురాలో పలు ఇళ్లకు రెండురోజుల క్రితం రివర్‌బెడ్‌ (ఆర్‌బీ ఎక్స్‌) మార్క్‌ వేశారు. దీంతో బాధితులు బహదూర్‌పురా వద్ద బెంగళూరు హైవేపై బైఠాయించడంతో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. రెండు గంటలపాటు ఆందోళన నిర్వహించడంతోపాటు సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రె్‌సకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మజ్లిస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీ బయటకు రావాలని, తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. దశాబ్దాల కాలం నుంచి ఇక్కడ ఉంటున్నామని, అకస్మాతుగా ఇప్పుడు ఎక్కడికెళ్లాలని ప్రశ్నించారు. తాము ఆక్రమించి ఇళ్లు నిర్మించుకోలేదని, డబ్బులు పెట్టి కొన్న స్థలాలని తెలిపారు. బహదూర్‌పురా పోలీసులు, రెవెన్యూ అధికారులు వచ్చి నచ్చజెప్పినా నివాసితులు వినలేదు. చైతన్యపురి డివిజన్‌ పరిధిలోని మూసీ పరీవాహక నివాసితులు ప్లకార్డులు చేతపట్టి నిరసన చేపట్టారు. కార్పొరేటర్‌ రంగా నర్సింహగుప్తా ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ఈ ప్రాంతంలో సర్వే,మార్కింగ్‌ చేపట్టొద్దని నినదించారు.


Hydraa.jpg


మార్కింగ్‌ పనులకు బ్రేక్‌ !

చైతన్యపురి, కొత్తపేట డివిజన్ల పరిధిలోని మూసీ పరివాహక ప్రాంతాల్లో శనివారం సర్వే, మార్కింగ్‌ పనులకు విరామం ఇవ్వడంతో నివాసితులు కొంచెం ఊపిరిపీల్చుకున్నారు. అయితే తిరిగి మార్కింగ్‌ పనులు, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లకు తరలించే పనులు ఎప్పుడు చేపడతారోనని ఆందోళన చెందుతున్నారు.


ఆందోళన చెందాల్సిన అవసరం లేదు : ఎమ్మెల్యే మహ్మద్‌ ముబీన్‌

బహదూర్‌పురా ఎమ్మెల్యే మహ్మద్‌ ముబిన్‌ స్థానిక కార్పొరేటర్‌ హుసేనీపాషాతో కలిసి కిషన్‌బాగ్‌, అసద్‌ బాబానగర్‌, షరీ్‌ఫనగర్‌, మహమూద్‌నగర్‌లలో రెడ్‌మార్క్‌ చేసిన ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కూల్చివేతలు ఇప్పుడే జరగవని తెలిపారు. నివాసితులకు నష్టపరిహారం, ఇతర సదుపాయాలు కల్పించి బాధితుల్లో నమ్మకం కల్పించిన తర్వాతే కూల్చివేతలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని బాధితులకు భరోసా ఇచ్చారు.


ప్రాణత్యాగాలకైనా సిద్ధం

మూసీ పరీవాహక ప్రాంతాలైన ద్వారకాపురి కాలనీ, విద్యుత్‌నగర్‌ కాలనీ, భవానీనగర్‌ కాలనీవాసులు శనివారం ఒకేచోట సమావేశమయ్యారు. ఓ వైపు న్యాయ పోరాటం చేస్తునే, ఇళ్లకు మార్కింగ్‌ చేయకుండా ఏ విధంగా రక్షించుకోవాలనే అంశాలను చర్చించారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి ఇళ్లు నిర్మించుకోలేదని, రెక్కల కష్టంతో స్థలాలు కొనుగోలు చేసి రిజిస్ర్టేషన్‌ చేసుకొని నిర్మించుకున్నామని చెప్పారు. గూడు కోసం ప్రాణత్యాగాలకైనా సిద్ధమని పేర్కొన్నారు. ప్రభుత్వం మానవతా ధృక్పథంతో వ్యవహరించాలని వేడుకున్నారు.


పిల్లల చదువుకు ఇబ్బంది

చాలా ఏళ్లుగా ఇక్కడే నివసిస్తున్నాం. ఇక్కడి నుంచి వెళ్లాలంటే చాలా బాధగా ఉంది. పిల్లల చదువు, వ్యాపారం అన్నీ ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. ప్రభుత్వం మమ్మల్ని అన్నివిధాలా ఆదుకోవాలి.

- షహనాజ్‌బేగం, స్థానికురాలు

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

Updated Date - Sep 29 , 2024 | 11:22 AM