Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు అల్లు అర్జున్ కౌంటర్ ఇస్తారా.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న ప్రెస్ మీట్..
ABN , Publish Date - Dec 21 , 2024 | 06:11 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో ఇవాళ (శనివారం) సాయంత్రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. అసెంబ్లీ వేదికగా సంధ్య థియేటర్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. అల్లు అర్జున్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బన్నీ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారంటూ సీఎం మండిపడ్డారు.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇవాళ (శనివారం) సాయంత్రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. అసెంబ్లీ వేదికగా సంధ్య థియేటర్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌పై రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. బన్నీ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారంటూ ఆయన మండిపడ్డారు. పోలీసులు చెప్పినా వినకుండా ర్యాలీ నిర్వహించి ఓ మహిళ ప్రాణాలు పోవడానికి కారణం అయ్యాడని, ఆమె కుమారుడు సైతం చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడని రేవంత్ రెడ్డి ఆగ్రహించారు. అతన్ని అరెస్టు చేస్తే నానా హంగామా చేశారని మండిపడ్డారు.
అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలైన తర్వాత పెద్దఎత్తున సినీ, రాజకీయ ప్రముఖులు పరామర్శించేందుకు వెళ్లారని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కానీ బాధిత కుటుంబాన్ని మాత్రం ఏ ఒక్కరూ కలవలేదని ఆగ్రహించారు. అతన్ని అరెస్టు చేస్తే కొన్ని రాజకీయ పార్టీల నేతలు సైతం తనను విమర్శించారని సీఎం చెప్పుకొచ్చారు. అల్లు అర్జున్ ఏమైనా దేవుడా?, అతనికి ఏమైనా కాళ్లు, చేతులు విరిగాయా?, జైలు నుంచి వచ్చిన తర్వాత ప్రముఖులు పరామర్శిస్తూ ఎందుకంత హంగామా చేస్తున్నారని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం 7 గంటలకు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు అల్లు అర్జున్ కౌంటర్ ఇస్తారా? మరేదైనా వివరణ ఇస్తారా? అని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కాగా, ఈ ప్రెస్ మీట్ సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.