Share News

BRS: ఆంధ్ర సెటిలర్లను కంటికి రెప్పలా చూసుకుంది కేసీఆరే.. వివాదంపై కౌశిక్ క్లారిటీ

ABN , Publish Date - Sep 13 , 2024 | 04:06 PM

సెటిలర్లను తమ నుంచి దూరం చేసేందుకు కాంగ్రెస్ కుట్రపన్నుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న 10 ఏళ్ల కాలంలో ఏనాడు సెటిలర్లకు ఇబ్బందులు కలగలేదని గుర్తు చేశారు.

BRS: ఆంధ్ర సెటిలర్లను కంటికి రెప్పలా చూసుకుంది కేసీఆరే.. వివాదంపై కౌశిక్ క్లారిటీ

హైదరాబాద్: సెటిలర్లను తమ నుంచి దూరం చేసేందుకు కాంగ్రెస్ కుట్రపన్నుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న 10 ఏళ్ల కాలంలో ఏనాడు సెటిలర్లకు ఇబ్బందులు కలగలేదని గుర్తు చేశారు. ఏపీ వాళ్లంటే బీఆర్ఎస్‌కు గౌరవమని.. సీఎం రేవంత్ రెడ్డి చేసే నీచ రాజకీయాల వల్ల ప్రస్తుతం వాళ్లు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు.


"ఆంధ్రా వాళ్లంటే మాకు గౌరవం ఉంది. నేను సెటిలర్స్ అనే పదం ఎక్కడా వాడలేదు. ఎక్కడైనా ఆంధ్రా అనే పదం వాడితే అది నాకు, గాంధీకి వ్యక్తిగతం మాత్రమే. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఆంధ్రా సెటిలర్స్‌ను కంటికి రెప్పలా చూసుకున్నారు. అందుకే జీహెచ్ఎంసీలోని అన్ని ప్రాంతాల్లో ఏపీ సెటిలర్లంతా బీఆర్ఎస్ వెంటే ఉన్నారు. ఓర్వలేని కాంగ్రెస్ నేతలు సెటిలర్స్‌ను మా నుంచి దూరం చేయాలని ప్రయత్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి రోజురోజుకూ దిగజారుతున్నారు. కాంగ్రెస్ మంత్రులు కూడా నా స్థాయికి దిగజారిపోయారు. రేవంత్‌కు ఇక నుంచి కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు అవసరం లేదు. రేవంత్ రెడ్డిని చూసి నేను భయపడట్లేదు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చే వరకు పోరాటం ఆపేది లేదు. కేసీఆర్ హయాంలో హైదరాబాద్‌లో ఇలాంటి పరిస్థితులు వచ్చాయా? కేసీఆర్, తెలంగాణ లేకపోతే రేవంత్ రెడ్డి సీఎం కుర్చీలో కూర్చునేవారా? రేవంత్ సర్కార్ రౌడీయిజాన్ని ప్రజలు కళ్లారా చూస్తున్నారు. గురువారం హరీశ్ రావును అరెస్టు చేసి షాద్‌నగర్ తీసుకువెళ్లారు. బీఆర్ఎస్ పార్టీ నేతలపై ప్రభుత్వం దౌర్జన్యం చేస్తోంది. పోలీసు రాజ్యంతో ప్రభుత్వాన్ని నడపలేరు. ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ నేతలు రోడ్ల మీద తిరిగలేరు. నాకు అండగా నిలిచిన మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, బీఆర్ఎస్ కార్యకర్తలకు ధన్యవాదాలు" అని కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు.


వణుకుతున్న ఎమ్మెల్యేలు..

హైకోర్టు తీర్పు తర్వాత బీఆర్ఎస్‌లోంచి కాంగ్రెస్‌లోకి జంప్ అయిన ఎమ్మెల్యేలు గజగజ వణుకుతున్నారని కౌశిక్ రెడ్డి విమర్శించారు. వారందరిపై సస్పెన్షన్ వేటు పడటం ఖాయమని.. 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు కూడా పక్కా అని కౌశిక్ జోస్యం చెప్పారు. "కేసీఆర్ పెట్టిన భిక్షతో పార్టీ మారిన పది మంది.. ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. వాళ్లకు ఇంగితం ఉంటే వెంటనే రాజీనామా చేయాలి. నేను అడిగిన ప్రశ్నలకు అరికెపూడి గాంధీకి ఎందుకు భయం. పీఏసీ చైర్మన్ గా బీఆర్ఎస్ హరీశ్ రావు పేరును ఇచ్చింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను కాపాడుకునేందుకు మేము ప్రతిదాడులు చేయడం లేదు. దానం నాగేందర్‌కు కూడా శృతి మించుతున్నారు. ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు సిద్ధం కావాలి" అని కౌశిక్ సవాల్ విసిరారు.

For Latest News and National News click here

Updated Date - Sep 13 , 2024 | 04:17 PM