Kishan Reddy: హైడ్రా పేరుతో హైడ్రామా.. కిషన్ రెడ్డి విమర్శలు
ABN , Publish Date - Aug 24 , 2024 | 06:21 PM
రాష్ట్రంలో హైడ్రా(HYDRA) పేరుతో హైడ్రామా నడుస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) విమర్శించారు. గతంలో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన ప్రభుత్వమే ఇప్పుడు కూల్చివేతలు చేస్తోందని ఆరోపించారు.
హైదరాబాద్: రాష్ట్రంలో హైడ్రా(HYDRA) పేరుతో హైడ్రామా నడుస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) విమర్శించారు. గతంలో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన ప్రభుత్వమే ఇప్పుడు కూల్చివేతలు చేస్తోందని ఆరోపించారు.
మీడియాతో ఆయన మాట్లాడుతూ.. "హైడ్రామాకు భాగ్యనగరం కేరాఫ్‌గా మారింది. నిర్మాణాలు కట్టుకోవడానికి అనుమతులు ఇచ్చిన వారే నేడు అక్రమ కట్టడాలని కూల్చేస్తూ డ్రామాలాడుతున్నారు. అప్పుడు ఎలా అనుమతులు ఇచ్చారు? విద్యుత్, నీరు, రోడ్ల సదుపాయాలు ఎలా కల్పించారు? ఇప్పుడు అవన్నీ కూడా లోతుగా చర్చించాల్సిందే. ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయమైనా అందరికీ సమానంగా వర్తింపజేయాలి. ఇష్టం వచ్చినట్లు చేస్తామనడం సరికాదు. గతంలో అనుమతులు ఇచ్చిన అధికారులపై కూడా కాంగ్రెస్ సర్కార్ చర్యలు తీసుకోవాలి" అని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
రాజకీయ డ్రామాలు..
హైడ్రా కూల్చివేతలపై బీఆర్ఎస్(BRS), కాంగ్రెస్(Congress) నేతల డ్రామాలు రక్తికట్టించేలా ఉన్నాయని మెదక్ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. మంచి ఉద్దేశంతో హైడ్రా ఏర్పాటు చేసినట్లు కాంగ్రెస్ చెబుతోందని.. అదే నిజం అయితే ముందు బీఆర్ఎస్ నేతలు ఆక్రమించి కట్టిన భవనాలను కూల్చివేయాలంటూ ఎంపీ డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ కవిత, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫామ్ హౌస్‌లు కూల్చడానికి ఎందుకు వెనకాడుతున్నారో చెప్పాలంటూ సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని అన్నారు.
వాళ్లంటే భయం..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీకి భయపడుతున్నారని ఎంపీ రఘునందన్ విమర్శించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కబ్జాలు పెరిగాయని, కేసీఆర్ హయాంలో ఆక్రమణలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ముందుగా జన్వాడలో కేటీఆర్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఫామ్ హౌస్ కూల్చివేయాలంటూ ఆయన కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. కబ్జాలు చేసిన నేతలపై కేసులు పెట్టామని అధికార పార్టీ నేతలు చెప్తున్నారని, అదే నిజమైతే వారిని ఎందుకు అరెస్టు చేయడం లేదని ఎంపీ ప్రశ్నించారు.