Miyapur: ఉఫ్‌ఫ్.. అది చిరుత పులి కాదు.. క్లారిటీ ఇచ్చిన అధికారులు
ABN , Publish Date - Oct 19 , 2024 | 11:03 AM
రాత్రి 7 గంటల ప్రాంతంలో మెట్రో స్టేషన్ వెనుక భాగంలో భవన నిర్మాణ పనులు చేస్తున్న కార్మికులు కొందరు అటుగా వెళ్తున్న ఈ ప్రాణిని చూసి వీడియోలు తీశారు. దీనిపై పోలీసులకు కూడా సమాచారం ఇవ్వడంతో అటవీ శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. పోలీసులతో కలిసి..
హైదరాబాద్: మియాపూర్ మెట్రో స్టేషన్ పరిసరాల్లో చిరుత సంచారం అంటూ వస్తోన్న వార్తలపై అటవీశాఖ అధికారులు క్లారిటీ ఇచ్చారు. నిన్న రాత్రి నుంచి ఇందుకు సంబంధించిన వీడియోలు చూసి నగరవాసులు భాయాందోళనకు గురవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అధికారులు స్పందిస్తూ ఈ వన్య ప్రాణి చిరుత పులి కాదని.. అడవి పిల్లి అని తెలిపారు. ప్రజలు దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
జనారన్యంలోకి ఎలా వచ్చింది?
మియాపూర్ మెట్రో వద్ద చిరుతపులి అంటూ శుక్రవారం రాత్రి నుంచి ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. నిన్న రాత్రి 7 గంటల ప్రాంతంలో మెట్రో స్టేషన్ వెనుక భాగంలో భవన నిర్మాణ పనులు చేస్తున్న కార్మికులు కొందరు అటుగా వెళ్తున్న ఈ ప్రాణిని చూసి వీడియోలు తీశారు. దీనిపై పోలీసులకు కూడా సమాచారం ఇవ్వడంతో అటవీ శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. పోలీసులతో కలిసి వారు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. దీని జాడ కనిపెట్టేందుకు హుటాహుటిన ఏర్పాట్లు చేసుకున్నారు. తాజాగా ఇది పులి కాదని అడవి పిల్లి అంటూ వారు క్లారిటీ ఇచ్చారు. మియాపూర్ మెట్రో స్టేషన్ వెనుక భాగంలో దాదాపు 200 ఎకరాల మేర దట్టమైన చెట్లతో నిర్మానుష్యమైన స్థలం ఉంది. ఈ అటవీ ప్రాణి అక్కడి నుంచే జనారన్యంలోకి వచ్చి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. చిరుత సంచారం అంటూ వస్తోన్న వార్తలతో స్థానికులతో పాటు రోజూ ఈ మార్గం గుండా ప్రయాణించేవారు సైతం బెంబేలెత్తిపోయారు. ఇప్పుడది అడవి పిల్లి అని తెలిసి పెద్ద ప్రమాదమే తప్పిందంటూ అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు.
గతంలోనూ ఇలాంటి ఘటనే..
నగరంలోని కీలక మెట్రో స్టేషన్లలో మియాపూర్ స్టేషన్ కూడా ఒకటి. నిత్యం వేలాది మంది ప్రయాణికులు ఇక్కడి నుంచే రాకపోకలు సాగిస్తుంటారు. ఐటీ ఎంప్లాయిస్ తో పాటుగా స్టూడెంట్స్, ఇతర ఉద్యోగులు ఇలా ఎంతో మందిని నగరంలోని పలు ప్రాంతాలకు మెట్రో తీసుకెళ్తుంది. ఇంత కీలకంగా ఉన్న ఈ మెట్రో స్టేషన్ పరిధిలో చిరుత సంచారం అంటూ సోషల్ మీడియాలో వార్తలు రావడం షాక్ కు గురిచేసింది. అటువైపు వెళ్లడానికి కూడా ప్రయాణికులు జంకారు. గతంలోనూ పటాన్ చెరు ప్రాంతంలో చిరుత పులి కలకలం రేపిందంటూ పలువురు గుర్తుచేసుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ నష్టం జరగకపోవడంతో ఆ విషయాన్ని అంతా మర్చిపోయారు. తాజా వార్తలతో మరోసారి అధికారులు పరుగులు పెట్టారు. మొత్తానికి ఈ అటవీ ప్రాణి అందరినీ ముప్పుతిప్పలు పెట్టింది. ఇది చిరుత కాదని పిల్లి అని అధికారులు నిర్ధారించడంతో ప్రయాణికులు కుదుటపడ్డారు.