Share News

Lu Cafe: మరుగుదొడ్లు మూసి.. వ్యాపారంపైనే ఆసక్తి

ABN , Publish Date - Oct 21 , 2024 | 07:46 AM

లూ–కెఫే.. పౌరులకు మరుగుదొడ్డి సదుపాయం కల్పించాలన్న ప్రధానోద్దేశంతో చేసిన ఏర్పాటు. దీనితోపాటు కెఫే నిర్వహించుకునే సౌలభ్యం కూడా ఉంటుంది. మరుగుదొడ్ల నిర్వహణ చూస్తున్నందుకుగాను కెఫే స్థలానికి నెలకు నామమాత్రంగా రూ.100 మాత్రమే జీహెచ్‌ఎంసీ అద్దె వసూలు చేస్తోంది.

Lu Cafe: మరుగుదొడ్లు మూసి.. వ్యాపారంపైనే ఆసక్తి

  • ఆహార కేంద్రాలుగా లూ–కెఫేలు

  • నామమాత్రంగా రూ.100 అద్దెతో లీజుకు

  • సామాజిక బాధ్యత నెరవేర్చని సంస్థలు

  • పట్టించుకోని జీహెచ్‌ఎంసీ

  • ఉన్నత స్థాయి ఒత్తిళ్లే కారణం

లూ–కెఫే.. పౌరులకు మరుగుదొడ్డి సదుపాయం కల్పించాలన్న ప్రధానోద్దేశంతో చేసిన ఏర్పాటు. దీనితోపాటు కెఫే నిర్వహించుకునే సౌలభ్యం కూడా ఉంటుంది. మరుగుదొడ్ల నిర్వహణ చూస్తున్నందుకుగాను కెఫే స్థలానికి నెలకు నామమాత్రంగా రూ.100 మాత్రమే జీహెచ్‌ఎంసీ అద్దె వసూలు చేస్తోంది. సామాజిక బాధ్యతలో భాగంగా ముందుకు వచ్చిన సంస్థలు.. లూ–కెఫేలను వ్యాపార కేంద్రాలుగా మార్చాయి. మరుగుదొడ్లను మూసి.. అమ్మకాలకు పరిమితమయ్యాయి. అయినా.. అధికారులు పట్టించుకోవడం లేదు. మరుగుదొడ్లు తెరవాలని కనీసం సూచనలూ చేయడం లేదు.

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): ఓవైపు మరుగుదొడ్లు, మరోవైపు కెఫే.. ఈకాంబినేషన్‌లో ఏర్పాటు చేసినవే లూ–కెఫేలు. మరుగుదొడ్ల నిర్వహణ చూస్తున్నందుకు గాను అద్దె నామమాత్రంగా కేవలం నెలకు రూ. 100. కానీ ఆ లక్ష్యం నెరవేరడం లేదు. మరుగుదొడ్లను మూసేశారు. అగ్గువకు లూ–కెఫేలను లీజుకు తీసుకొని రూ.లక్షల్లో వ్యాపారం చేస్తున్న సంస్థల విషయంలో జీహెచ్‌ఎంసీ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. అందుకు ఉన్నతస్థాయి ఒత్తిళ్లే కారణమని తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో కీలక మంత్రి వద్ద ఉన్న ఓ అధికారి సిఫారసుతో లూ–కెఫేలు ఏర్పాటైనట్టు ప్రచారం. మేం చెప్పినా టెండర్‌ పిలవరా..? ఎందుకు ఆలస్యం చేస్తున్నారని దబాయించి మరీ ఆఘమేఘాల మీద ఓ సంస్థకు అప్పగించేలా సదరు అధికారి ఒత్తిడి తీసుకువచ్చారు. అందుకే గత సర్కారు హయాంలో ఎలాంటి చర్యలు తీసుకునే వారు కాదు. ఇప్పటికీ అదే పరిస్థితి ఉండడం గమనార్హం. వారిపై చర్యలు తీసుకోవాలన్నా.. నోటీసులు ఇవ్వాలన్నా.. అధికారులు జంకుతున్నారు. కెఫేల వద్దకు వెళ్లగానే పై నుంచి ఫోన్‌ వస్తుండడంతో తిరిగి వస్తున్నామని పలువురు అధికారులు తెలిపారు.


తొలుత శేరిలింగంపల్లిలో ఏర్పాటు

ప్రజలకు మెరుగైన నిర్వహణతో కూడిన టాయిలెట్లు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు జీహెచ్‌ఎంసీ లూ–కెఫేల ఏర్పాటుకు అనుమతినిచ్చింది. శేరిలింగంపల్లి జోన్‌లో పైలట్‌ ప్రాజెక్టు సక్సెస్‌ కావడంతో గ్రేటర్‌లోని ఇతర ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేశారు. ఎన్ని లూ– కెఫేలు ఉన్నాయన్న వివరాలనూ అధికారులు చెప్పలేక పోతున్నారు. గత ప్రకటనల ప్రకారం 15 వరకు పెద్దవి, 130కిపైగా చిన్న లూ–కెఫేలు ఉండేవి.

15 ఏళ్ల పాటు లీజుకు..

కొన్ని ప్రాంతాల్లో కెఫేలను తొలగించగా, కొన్ని చోట్ల అక్రమంగా ఏర్పాటు చేశారు. పెద్ద లూ–కెఫేలకు ప్రధాన రహదారుల పక్కన ఫుట్‌పాత్‌లపై 180 నుంచి 320 చదరపు అడుగుల, మినీ లూ–కెఫేలకు 50 నుంచి 100 చదరపు అడుగుల మేర స్థలం కేటాయించారు. నెలకు అద్దె రూ.100 మాత్రమే నిర్ణయించారు. 15 ఏళ్లపాటు లీజుకు అప్పగించారు. కెఫేల కోసం కేటాయించిన స్థలంలో మహిళలు, పురుషులకు వేర్వేరుగా వాష్‌రూమ్‌లు ఏర్పాటు చేయాలి. వీటిని పౌరులు ఉచితంగా వినియోగించుకునే వెసులుబాటు కల్పించాలి. దివ్యాంగులు, వృద్ధులు వినియోగించుకునేందుకు వీలుగా మెట్లు, హ్యాండ్‌ గ్రిల్స్‌, ర్యాంప్‌లు ఉండాలి. వాష్‌ రూమ్‌లు పరిశుభ్రంగా ఉండేలాసంస్థలు చూడాలి. మరి కొంత స్థలంలో కెఫే ఏర్పాటు చేసుకోవాలి. టీ, కాఫీ, సమోసా, స్నాక్స్‌, తాగునీరు విక్రయించే అవకాశం ఉంటుంది.


అదనపు స్థలంలో..

వాష్‌రూమ్‌ల విషయాన్ని విస్మరిస్తోన్న సంస్థలు కేవలం వ్యాపారంపై దృష్టి సారించాయి. కేటాయించిన దాని కంటే అదనపు స్థలంలో వ్యాపారం కొనసాగిస్తున్నారు. వినియోగదారులు కూర్చునేందుకు వీలుగా టెంట్లు, టేబుళ్లు, కుర్చీలు ఏర్పాటుచేసి.. రోడ్డు పక్కనుండే హోటల్‌లా మారుస్తున్నారు. కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, మాదాపూర్‌, గచ్చిబౌలి, కొండాపూర్‌, ఎన్‌టీఆర్‌ మార్గ్‌, కేబీఆర్‌ పార్క్‌ తదితర ప్రాంతాల్లో లూ–కెఫేల వద్ద వాష్‌రూమ్‌లకు తాళాలు వేసి ఉన్నాయి. సాధారణంగా ఆయా ప్రాంతాల్లో 320 చ.అ.లకు దుకాణాల అద్దె రూ.15 వేల నుంచి రూ.30 వేల వరకు ఉంటుంది. కేవలం రూ.100 చెల్లిస్తోన్న నిర్వాహకులు ప్రజా సౌకర్యాలను పట్టించుకోకపోవడం గమనార్హం. హెచ్‌సీయు రోడ్డులో ఓ కెఫే వద్ద ఏకంగా మీల్స్‌ విక్రయిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో కెఫేలను అద్దెకిచ్చి నెలకు రూ.20 నుంచి రూ.25 వేల వరకు వసూలు చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. లూ– కెఫేల తతంగంపై విజిలెన్స్‌ విచారణా జరుగుతోంది.

Updated Date - Oct 21 , 2024 | 07:46 AM