Minister Ponnam: అదానీ ఆస్తులపై సమగ్ర విచారణ జరిపించాలి
ABN , Publish Date - Aug 22 , 2024 | 11:49 AM
అదానీ అప్రజాస్వామికంగా దేశ సంపదను కొల్లగొడుతున్నారని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. అదానీ అక్రమ ఆస్తులపై జాయింట్ పార్లమెంట్ కమిటీ వేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్: అదానీ అప్రజాస్వామికంగా దేశ సంపదను కొల్లగొడుతున్నారని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) ఆరోపించారు. అదానీ అక్రమ ఆస్తులపై జాయింట్ పార్లమెంట్ కమిటీ వేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గన్ పార్క్ నుంచి కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు ఈడీ ఆఫీసు వద్దకు కాసేపట్లో భారీగా ర్యాలీ తీయనున్నారు. అదానీ అక్రమాలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు.
ఈడీ ఆఫీసు వద్దకు బయలు దేరారు. అక్కడ ధర్నా చేయనున్నారు. ఈ ధర్నాకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. గన్ పార్కు వద్దకు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, పొన్నం ప్రభాకర్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేరుకున్నారు. పార్లమెంట్‌లో తమ నాయకుడు రాహుల్ గాంధీ అదానీ అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారని గుర్తుచేశారు. అతని అక్రమాలపై జేపీసీ వేస్తే ఇబ్బంది ఏముందని మోదీ ప్రభుత్వాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.
అదానీ ఆస్తులపై సమగ్ర విచారణ జరిపించాలని.. లేదంటే ఆర్థిక వ్యవస్థ కుప్పకులుతుందని హెచ్చరించారు. అవినీతికి పెద్దన్నగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యవహరిస్తున్నారని విమర్శలు చేశారు. ఎప్పటి నుంచే అదానీ , మోదీ స్నేహాన్ని రాహుల్ గాంధీ బయట పెట్టారని చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలు జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తున్నాయని అన్నారు. చాలా ప్రభుత్వ రంగ సంస్థలను అదానీకి అప్పగిస్తున్నారని చెప్పారు. అదానీకి వ్యతిరేకంగా మాట్లాడితే సీబీఐ, ఈడీతో దాడులు చేపిస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు.
తెలంగాణ రాష్ట్రానికి చెందిన జీవీకే లాంటి సంస్థలను కూడా అదానీ వేధించారని ఆరోపించారు. ఆయనపై జాయింట్ పార్లమెంట్ కమిటీ వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అన్నారు. అతను లక్షల కోట్లు దోచుకునే కుట్ర వెనుక ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉన్నారని ఆరోపించారు. ఈరోజు ఈడీ కార్యాలయాల ముందు ఆందోళనలో భాగంగా కాంగ్రెస్ నేతలంతా గన్ పార్క్ అమరవీరుల స్థూపం నుంచి ఈడీ కార్యాలయం వరకు నిరసనగా ర్యాలీగా వెళ్లి అక్కడ ధర్నా చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
అదానీ అంశంపై జేపీసీ వేయాలి: మంత్రి జూపల్లి కృష్ణారావు
దేశ సంపదను కార్పొరేట్ కంపెనీలను దోచి పెడుతున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శలు చేశారు. తప్పుడు విధానాల ద్వారా అదానీకి లక్షల కోట్ల లాభాన్ని తెచ్చిపెడుతున్నారని ఆరోపించారు. అదానీ అంశంపై జేపీసీ వేయాలని డిమాండ్ చేశారు. ఆయన దోచుకున్న సొమ్మును దేశానికి అప్పచెప్పాలని డిమాండ్ చేశారు. అతని అక్రమాలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తూ గన్ పార్క్ వద్ద నిరసన చేపట్టామని మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు.