MMTS: ఎంఎంటీఎస్ సర్వీసుల్లో భారీ కోత.. నాడు 175.. నేడు 70
ABN , Publish Date - Oct 14 , 2024 | 07:08 AM
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మల్టీ మోడల్ ట్రాన్స్పోర్టు సిస్టమ్ (ఎంఎంటీఎస్) ప్రాజెక్టును ఓ వైపు విస్తరిస్తూనే, మరోవైపు ఆయా ప్రాజెక్టులను ప్రయాణికులకు దూరమయ్యేలా దక్షిణమధ్య రైల్వే వ్యవహరిస్తోంది.
ఉద్యోగులకు తప్పని వెతలు
ప్రయాణికులకు దూరమవుతున్న చవక ప్రయాణం
ఇష్టానుసార వేళలతో తప్పని పడిగాపులు
తక్కువ చార్జీతో ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశమున్న ఎంఎంటీఎస్ ప్రయాణికులకు దూరం అవుతోంది. నానాటికీ సర్వీసులు తగ్గిపోతున్నాయి. దీంతో ఉద్యోగులకు ప్రయాణ తిప్పలు తప్పడం లేదు.
హైదరాబాద్ అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మల్టీ మోడల్ ట్రాన్స్పోర్టు సిస్టమ్ (ఎంఎంటీఎస్) ప్రాజెక్టును ఓ వైపు విస్తరిస్తూనే, మరోవైపు ఆయా ప్రాజెక్టులను ప్రయాణికులకు దూరమయ్యేలా దక్షిణమధ్య రైల్వే వ్యవహరిస్తోంది. దాదాపు రెండు దశాబ్దాల క్రితం ప్రారంభమైన ఎంఎంటీ ఎస్ రైళ్లు అతితక్కువ కాలంలోనే ప్రయాణికుల ఆదరణను చూరగొన్నాయి. తక్కువ చార్జీలతో, ఎక్కువ దూరం ప్రయాణించే వీలుండడమే ఇందుకు ప్రధాన కారణం. కరోనాకు ముందు రోజూ 175 సర్వీసులతో రెండున్నర లక్షలమందికి పైగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చిన ఎంఎంటీఎస్ రైళ్లు.. కొన్నాళ్లుగా ప్రయాణికులను తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురిచేస్తున్నాయి.సుమారు వంద సర్వీసులకు పైగా తగ్గి ప్రస్తుతం 70 వరకు నడుపుతూ సుమారు 50 వేల మందికి ప్రయాణ సేవలను అందిస్తున్నాయి.
పలురూట్లలో ఎంఎంటీఎస్ సర్వీసుల సంఖ్యను సగానికి సగం తగ్గించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. మరోవైపు తిప్పుతున్న సర్వీసులను కూడా ఆలస్యంగా నడుపుతుండడంతో ప్రయాణికులు వారంతట వారే దూరమయ్యేందుకు దక్షిణ మధ్య రైల్వే కారణమవుతోంది. ఇదిలా ఉంటే, ఐదేళ్ల కిందట ప్రారంభమైన మెట్రోరైల్.. సర్వీసుల (ఫ్రీక్వెన్సీ) పెంపుతో ప్రయాణికులకు చేరువ అవుతుంటే, చవకైన ప్రయాణానికి చిరునామాగా ఉన్న ఎంఎంటీఎస్ సర్వీసులను కుదిస్తూ రైల్వే అధికారులు వీటిని ప్రయాణికులకు దూరం చేస్తున్నారు.
గంటల కొద్దీ ఆలస్యంతో..
మెట్రోరైళ్లు సకాలంలో ప్రయాణికులను గమ్య స్థానానికి చేరుస్తుండగా, ఎంఎంటీఎస్ రైళ్లు ఎప్పుడు వస్తాయో, ఎప్పటికి గమ్యానికి చేరుకుంటాయో తెలియక ప్రయాణికులు గందరగోళానికి గురువుతున్నారు. ఫ్రీక్వెన్సీ తగ్గింపు, ప్రయాణంలో తీవ్రమైన జాప్యంతో కొందరు ప్రయాణికులు ప్రత్యామ్నాయం చూసుకుంటుండగా, మరికొం దరు మెట్రోరైళ్లు, ఆటోలను ఆశ్రయిస్తూ జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. ఎంఎంటీఎస్ రూట్లలో ప్రధానమైన ఫలక్నుమా-లింగంపల్లి మార్గంలో ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5 గంటలవరకు ప్రయాణికులకు ఎంఎంటీఎస్ లు అందు బాటులో లేవు.
దీంతో మధ్యాహ్నం షిప్లకు వెళ్లాల్సిన ఉద్యోగులు ఉదయం షిఫ్టు పూర్తయ్యాక ఇళ్లకు పోవాల్సిన వారు గంటల తరబడి స్టేషన్ల లోనే పడిగాపులు కాయాల్సి వస్తోంది. సికింద్రాబాద్, చందానగర్.వంటి కొన్ని స్టేషన్లలో గంటల తరబడి ఎంఎంటీఎస్ ను నిలిపి వేస్తుండడం ప్రయాణికుల సహనానికి పరీక్ష పెట్టినట్లుగా తయారైంది. చందానగర్ నుంచి లింగంపల్లికి ఐదు నిమిషాల్లో చేరుకునే అవకాశం ఉన్నా. 35 నిమిషాలు వెయిటింగ్ టైమ్ ఇవ్వడమే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది.
రూ.5కే ఎంఎంటీఎస్ ఉంటే.. ప్రత్యామ్నాయాల వైపు ఎందుకు చూస్తాం
మెట్రోరైల్ కారణంగా ఎంఎంటీఎస్ కు ప్రయాణికుల ఆదరణ తగ్గిందంటూ రైల్వే అధికారులు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని ప్రయాణికులు అంటున్నారు. రూ.5తో ఎంఎంటీఎస్‌లో చవకగా ప్రయాణం అందుబాట్లో ఉంటే, అదే దూరానికి మెట్రోరైల్లో రూ.50 వెచ్చించాల్సిన అవసరం తమకేంటని ప్రశ్నిస్తున్నారు. పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలకు తగినట్లుగా ముఖ్యమైన స్టేషన్లలో ప్లాట్‌ఫారాలను పెంచాలని, ఎంఎంటీఎస్‌ల సంఖ్యను పెంచి సామాన్యులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సామాన్యులకు చవక ప్రయాణాన్ని దూరం చేయొద్దని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
Hyderabad: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. కేబీఆర్ పార్కు వద్ద అతిపెద్ద అండర్‌పాస్
For Latest News and National News click here