Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో ఓవర్సీస్ స్కాలర్ షిప్‌ల రగడ
ABN , Publish Date - Dec 18 , 2024 | 12:04 PM
Telangana: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌ల విషయంలో రగడ చోటు చేసుకుంది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వివేకానంద వ్యాఖ్యలను మంత్రి శ్రీధర్ బాబు తీవ్రంగా తప్పు బట్టారు. సీనియర్ సభ్యుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు.
హైదరాబాద్, డిసెంబర్ 18: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Session) నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు ఉదయం సభ మొదలైన వెంటనే స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఓవర్సీస్ స్కాలర్ షిప్‌లపై అసెంబ్లీలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య మాటల తూటాలు పేలాయి. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు పెండింగ్‌లో పెట్టారని, లంచం లేకుండా బిల్లులు క్లియర్ చేయడం లేదంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వివేకానంద (MLA Vivekananda) వ్యాఖ్యలు చేశారు. అయితే వివేకా వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridharbabu) అభ్యంతరం వ్యక్తం చేశారు. సీనియర్ సభ్యుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు. వివేకానందకు అసెంబ్లీ రూల్స్ పై అవగాహన ఉందన్నారు. ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం తగదన్నారు. ఇక్కడ కూర్చుప్పుడు ఒక వేషం.. అక్కడ కూర్చున్నప్పుడు మరొక వేషం వేస్తున్నారని మంత్రి మండిపడ్డారు.
నిన్న అయ్యప్ప డ్రెస్సులు వేసుకొని వచ్చి భక్తితో ఉంటారని అనుకున్నామని.. అయ్యప్ప డ్రెస్సులు ధరించి కూడా లొల్లి లొల్లి చేశారన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా ఆటోలకు పన్నులు పెంచారని.. బీఆర్‌ఎస్ ఆటోవాళ్ల గురించి మాట్లాడటం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానం నెరవేర్చుతామని.. ఒక్కొక్కటి నేరవేర్చుతామని స్పష్టం చేశారు. ఓవర్సీస్ స్కాలర్షిప్స్ తాము ఆపలేదని... అది ప్రాసెస్లో ఉందన్నారు. అది తెలుసుకోకుండా ప్రభుత్వంపై నిందలు మోపడం మంచిది కాదన్నారు. సభలో అడ్డగోలుగా మాట్లాడొద్దంటూ మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యలు చేశారు.
అన్నింట్లో కమిషన్లే: ఆది శ్రీనివాస్
రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వంలో విధ్వంసం చేశారని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ విమర్శించారు. దళిత బంధు, ఈ రేస్, మిషన్ కాకతీయ అన్నిట్లో కమిషన్లు దండుకున్నారని ఆరోపించారు. వేలకోట్లకు పడగలెత్తారని.. ప్రతి దాంట్లో కమీషన్లకు అలవాటు పడ్డారని వ్యాఖ్యలు చేశారు. వారు చేసినట్లే తాము చేస్తున్నామని అనుకుంటున్నారన్నారు. తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని.. బీఆర్ఎస్ విధానాలు ప్రజలు తిరస్కరిస్తున్నారని ఆది శ్రీనివాస్ అన్నారు.
మీరు చేసి.. మాపై నిందలా: సీతక్క
‘‘రూ.4500 కోట్ల స్కాలర్షిప్‌లు మీరు పెండింగ్ పెట్టి వెళ్లారు... దానికి మమ్మల్ని నిందిస్తే ఎలా. మీరు పెట్టిన పెండింగ్లో మేం చెల్లిస్తూ వస్తున్నాం. రూ.140.74కోట్ల ఓవర్సీస్ స్కాలర్షిప్ మేము చెల్లించాం. ఇంకా రూ.104 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఓవర్సీస్ స్కాలర్షిప్స్ కోసం 3480 దరఖాస్తులు వచ్చాయి. 1310మంది విద్యార్థులను ఎంపిక చేయాల్సి ఉంది. వచ్చే మార్చ్ వరకు గడువుంది. డిసెంబర్ నెల ఆఖరి వరకే ఎంపిక పూర్తి చేసి చెల్లింపులు చేస్తాం. ఈ స్కీంను మరింత పకడ్బందీగా అమలు చేస్తాం. మీ పాలనలో మహబూబ్‌నగర్‌లో లావణ్య అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. ఫీజు చెల్లించలేక మరణించినట్లు లేఖ రాసింది. మీరు గొప్పగా చేశామని చెబితే ఎలా. ఆటో వాళ్లకు పదేళ్లలో మీరు ఏం చేశారు. వారిని ఆర్థికంగా బలవంతం చేయడం కోసం మీరేం చేశారు. మహిళలకు మేం ఫ్రీగా బస్ సౌకర్యం కల్పించడం తప్పా’’ అంటూ బీఆర్‌ఎస్‌పై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు.
బీఆర్‌ఎస్ సభ్యులపై స్పీకర్ ఫైర్
మరోవైపు బీఆర్ఎస్ సభ్యులపై స్పీకర్ గడ్డం ప్రసాద్ సీరియస్ అయ్యారు. కొత్త సభ్యులకు మీరేం నేర్పిస్తున్నారని ప్రశ్నించారు. అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని.. ‘‘రాజశేఖర్ రెడ్డి నిన్ను సభ నుండి సస్పెండ్ చేస్తాను’’ అంటూ స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఎమ్మెల్యే వివేకానంద చేసిన వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అలాగే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కోరిన మేరకు ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మాట్లాడిన మాటలను కూడా రికార్డుల నుంచి తొలగించామని స్పీకర్ గడ్డం ప్రసాద్ తెలిపారు.
ఇవి కూడా చదవండి...
వాళ్ల పెన్షన్లు రద్దు.. నోటీసులు జారీ
Kishan Reddy: మాతృభాషను చిన్నతనంగా చూడొద్దు...
Read Latest Telangana News And Telugu News