Palla Rajeshwar Reddy: ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టొద్దు
ABN , Publish Date - Feb 14 , 2024 | 05:58 PM
తెలంగాణ సచివాలయానికి ఎదురుగా ఉన్న స్థలంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని నిర్ణయించి ప్లాన్ చేసిందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి(Palla Rajeshwar Reddy) అన్నారు.
హైదరాబాద్: తెలంగాణ సచివాలయానికి ఎదురుగా ఉన్న స్థలంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని నిర్ణయించి ప్లాన్ చేసిందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి(Palla Rajeshwar Reddy) అన్నారు. ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓ లేఖ రాశారు. ఈలోపు ఎన్నికలు రావడం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని తెలిపారు. కానీ ఇప్పుడు ఆ ప్రదేశంలో దివంగత నేత రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడానికి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని..ఈ నిర్ణయాన్ని తాము ఖండిస్తున్నామని అన్నారు.
తెలంగాణ ఉద్యమ అస్థిత్వాన్ని మరుగుపరిచే విధంగా, తెలంగాణ ఆనవాళ్లు తుడిచివేసే విధంగా కాంగ్రెస్ పలు కార్యక్రమాలు చేస్తోందని మండిపడ్డారు. ఆంధ్ర వలస వాదుల, ప్రవాస ఆంధ్ర మేధావుల సలహాలతో తెలంగాణ తల్లిని కించపరుస్తున్నారని అన్నారు. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన కాకతీయులను, గోల్కొండ నవాబులను ఇప్పటికే కించపరుస్తూ మాట్లాడారని ధ్వజమెత్తారు. సచివాలయంలో ఎదురుగా ఉన్న స్థలంలో వెంటనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని కోరారు. అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విరమించుకోవాలని పల్లా రాజేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.