Share News

Manne Subramanyam: ప్రముఖ పారిశ్రామికవేత్త మన్నె సుబ్రమణ్యం కన్నుమూత

ABN , Publish Date - Dec 26 , 2024 | 05:49 PM

Manne Subramanyam: ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రగతి ఇండస్ట్రీస్ అధినేత, సమాజ సేవకులు మన్నె సుబ్రమణ్యం ఇక లేరు. ఈ నెల 24వ తేదీన అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఈసీఐఎల్‌ ఎక్స్‌రోడ్‌లో ఉన్న గ్జేనియా ఆస్పత్రికి ..

Manne Subramanyam: ప్రముఖ పారిశ్రామికవేత్త మన్నె సుబ్రమణ్యం కన్నుమూత
Manne Subramanyam

హైదరాబాద్, డిసెంబర్ 26: ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రగతి ఇండస్ట్రీస్ అధినేత, సమాజ సేవకులు మన్నె సుబ్రమణ్యం ఇక లేరు. ఈ నెల 24వ తేదీన అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఈసీఐఎల్‌ ఎక్స్‌రోడ్‌లో ఉన్న గ్జేనియా ఆస్పత్రికి తరలించారు. కార్డియాక్ అరెస్ట్ అయిందని.. పల్స్ పడిపోవడంతో సీపీఆర్ చేశారు వైద్యులు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. సుబ్రమణ్యం ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఆస్పత్రి నుంచి సుబ్రమణ్యం పార్థీవదేహాన్ని తీసుకువచ్చిన కుటుంబ సభ్యులు బోగారంలోని వారి వ్యవసాయ భూమిలో అంత్యక్రియలు నిర్వహించారు. సుబ్రమణ్యం మృతిపై రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. పలువురు నేతలు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.


ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి, ఉప్పల్ కార్పొరేటర్ మందుముల రజితపరమేశ్వర్ రెడ్డి.. మన్నె సుబ్రమణ్యం పార్థివదేహానికి నివాళి అర్పించారు. సుబ్రమణ్యం అకాల మరణవార్త తెలియగానే పరమేశ్వర్ రెడ్డి, రజితాపరమేశ్వర్ రెడ్డి ఏఎస్ రావునగర్‌కు చేరుకున్నారు. కాంగ్రెస్ నాయకులు సీతారాం రెడ్డి, ప్రసాద్, విట్టల్ నాయక్, అజీజ్, పెద్ది శ్రీనివాస్, ప్రవీణ్, నర్సింహా కార్యకర్తలతో కలిసి సుబ్రమణ్యం పార్థివదేహానికి నివాళులు అర్పించారు. సుబ్రమణ్యం మృతి సమాజానికి తీరని లోటని, వారి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యం కల్పించాలని కోరారు.


తెలుగుదేశం పార్టీ వీరాభిమాని మన్నే సుబ్రహ్మణ్యం మృతి తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామంటూ టీడీపీ తరఫున ఒక ప్రకటన విడుదల చేశారు.


భీమవరం నుంచి హైదరాబాద్‌ షిఫ్ట్ అయిన సుబ్రమణ్యం.. 1996లో ప్రగతి ఇండస్ట్రీస్‌ను స్థాపించారు. ఆ తరువాత మన్నె ఇంజనీర్స్, ఎంపవర్ ఇన్‌ఫ్రాటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ స్థాపించారు. ఈ సంస్థలకు ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. తెలుగుదేశం పార్టీలోనూ క్రియాశీలకంగా వ్యవహరించేవారు సుబ్రమణ్యం. కాప్రా, నాగారం, దమ్మాయిగూడ కమ్మ సంఘానికి పెద్దగా ఉన్నారు. సుబ్రమణ్యం.. సామాజిక సేవా కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొనేవారు.

Updated Date - Dec 26 , 2024 | 05:50 PM