Hyderabad: అమ్మవారి వెండి కాయిన్స్ కోసం భక్తుల క్యూ.. రేపు కూడా పంపిణీ
ABN , Publish Date - Nov 02 , 2024 | 06:58 PM
అమ్మవారి ప్రతిమ ఉన్న కాయిన్స్‌తో పాటు కుబేర పూజ చేసిన కాయిన్స్‌ను ప్రసాదంగా పంపిణీ చేస్తుండటంతో భారీగా భక్తులు తరలివస్తున్నారు. అమ్మవారి కాయిన్ లభిస్తే తమకు సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. గురువారం కాయిన్స్ పంపిణీ ప్రారంభం కాగా.. రేపటి వరకు కొనసాగనుంది. భారీగా తరలివస్తున్న భక్తులతో ..
చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. దీపావళి నుంచి మూడు రోజులపాటు అమ్మవారి ఖజానా నుంచి కాయిన్స్‌ను భక్తులకు పంచడం ఆనవాయితీగా వస్తోంది. అమ్మవారి ప్రతిమ ఉన్న కాయిన్స్‌తో పాటు కుబేర పూజ చేసిన కాయిన్స్‌ను ప్రసాదంగా పంపిణీ చేస్తుండటంతో భారీగా భక్తులు తరలివస్తున్నారు. అమ్మవారి కాయిన్ లభిస్తే తమకు సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. గురువారం కాయిన్స్ పంపిణీ ప్రారంభం కాగా.. రేపటి వరకు కొనసాగనుంది. భారీగా తరలివస్తున్న భక్తులతో చార్మినార్ పరిసరాల్లో కిలోమేటర్ల క్యూలో భక్తులు నిల్చుని ఉన్నారు. దీపావళి పండుగ రోజు నుంచి మూడు నుంచి నాలుగు రోజుల పాటు అమ్మవారి కాయిన్స్ ప్రసాదంగా భక్తులకు ఇవ్వడం ఓ సంప్రదాయంగా వస్తోంది. ఈ కాయిన్‌ను తీసుకెళ్లి చాలామంది భక్తులు పూజగదిలో పెట్టుకుంటారు. ఈ కాయిన్ తమకు దక్కితే.. అమ్మవారి కృప తమపై ఉంటుందనేది భక్తుల విశ్వాసం.
వెండి కాయిన్స్ పంపిణీ
ఎంతో చరిత్ర కలిగిన చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో దీపావళి పండుగ నేపథ్యంలో వెండి కాయిన్స్ పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తోంది. గురువారం ప్రారంభమైన కార్యక్రమం ఆదివారం కూడా కొనసాగనుంది. రేపు సెలవు దినం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. ఆలయానికి వచ్చిన వెండి కానుకలతో వెండి కాయిన్స్ తయారు చేయించి పంపిణీ చేస్తారు. భాగ్యలక్ష్మి అమ్మవారి కాయిన్స్ కోసం హైదరాబాద్ నగరానికి చెందిన ప్రజలే కాకుండా.. తెలంగాణ జిల్లాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. భక్తుల రాకతో చార్మినార్ పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది. అమ్మవారి వెండి కాయిన్ దక్కడం తమ అదృష్టంగా భక్తులు భావిస్తున్నారు. అమ్మవారి రూపంలో వెండి కాయిన్స్ ఉండటంతో తమ ఇంటికి వీటిని తీసుకెళ్తే అదృష్టం కలిసొస్తుందనే నమ్మకంతో భక్తులు ఈ కాయిన్స్ కోసం క్యూ కట్టారు.
ప్రతి ఏడాది
హైదరాబాద్‌లోని చార్మినార్ పక్కన ఉండే భాగ్యలక్ష్మి ఆలయానికి ప్రతిరోజు భారీ సంఖ్యలో భక్తులు వస్తుంటారు. చార్మినార్ చూసేందుకు వచ్చే వారిలో ఎక్కువమంది భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటారు. కొందరైతే ప్రత్యేకంగా భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని సందర్శించి అమ్మవారి దర్శనం కోసం వస్తారు. దీపావళి పండుగ నేపథ్యంలో భక్తులకు ప్రసాదంగా వెండి కాయిన్స్ పంచిపెట్టడం కొన్ని సంవత్సరాలుగా జరుగుతోంది. ఈ సంప్రదాయాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఎటువంటి డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా ఈ కాయిన్ అందిస్తారు. రేపు (ఆదివారం) సెలవు కావడంతో భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అవసరమైన వెండి నాణేలను ఆలయ కమిటీ అందుబాటులో ఉంచింది.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here