Share News

Telangana: బీఆర్ఎస్ నేతల దుమ్ము దులిపిన సీఎం రేవంత్..

ABN , Publish Date - Dec 20 , 2024 | 03:29 PM

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తనపై దారుణంగా ప్రవర్తించినా స్పీకర్ గడ్డం ప్రసాద్ మాత్రం సహనాన్ని ప్రదర్శించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రతిపక్షం అహంభావంతో వ్యవహరిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రతి సమస్య భూమితో ముడిపడి ఉందని ముఖ్యమంత్రి అన్నారు.

Telangana: బీఆర్ఎస్ నేతల దుమ్ము దులిపిన సీఎం రేవంత్..
CM Revanth Reddy

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly)లో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సహనం కోల్పోయి స్పీకర్ గడ్డం ప్రసాద్ (Gaddam Prasad) పట్ల దారుణంగా వ్యవహరించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. అమర్యాదగా ప్రవర్తించి సభాపతిపైనే పేపర్లు విసిరారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శాసనసభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ప్రతిపక్షం వ్యవహార శైలి, ధరణి పోర్టల్‌, కేసీఆర్, ఫార్ములా-ఈ కార్ రేసుపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన విషయాలు బయటపెట్టారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తనపై దారుణంగా ప్రవర్తించినా స్పీకర్ గడ్డం ప్రసాద్ మాత్రం సహనాన్ని ప్రదర్శించారని ఆయన అన్నారు. ప్రతిపక్షం అహంభావంతో వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.


కేసీఆర్‌పై ఆగ్రహం..

తెలంగాణలో ప్రతి సమస్య భూమితో ముడిపడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మల్లు స్వరాజ్యం వంటివారు భూపోరాటాలు చేశారని ఆయన గుర్తు చేశారు. భూ పోరాటంలో దొడ్డి కొమురయ్య ప్రాణాలు సైతం కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆత్మగౌరవం నిలబెట్టేదే భూమని, పేదల భూములు పరిరక్షించేందుకే పటేల్‌, పట్వారీ వ్యవస్థలను సైతం రద్దు చేశారని రేవంత్‌ రెడ్డి చెప్పుకొచ్చారు. అద్భుతమంటూ ధరణి పోర్టల్‌ తీసుకొచ్చారని, ధరణి గురించి గత ప్రభుత్వం ఎన్నో గొప్పలు చెప్పిందని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి పోర్టల్ ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయన్నారని, కానీ వాస్తవాలు మరోలా ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఆ పోర్టల్‌‌ను కేసీఆర్‌ కనిపెట్టలేదని, 2010లోనే ఒడిశా ప్రభుత్వం ఈ-ధరణిని తీసుకొచ్చిందని సీఎం వెల్లడించారు. ఒడిశా తెచ్చిన ధరణిలో లోపాలు ఉన్నాయని కాగ్‌ చెప్పిందని, కాగ్‌ తప్పుబట్టిన ధరణిని తెలంగాణలో ఎందుకు పెట్టారని అసెంబ్లీ వేదికగా కేసీఆర్‌ను రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్‌ తనకంటే గొప్పోళ్లు లేరని అనుకుంటారని, అందుకే ఆయన అలా ప్రవర్తిస్తారని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.


ధరణి- సంచలన విషయాలు..

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. "కేటీఆర్‌కు అత్యంత సన్నిహితులకే ధరణి టెండర్లు కేటాయించారు. సత్యం రామలింగరాజు సంస్థలతో ఉన్న బంధంతోనే ధరణి పోర్టల్‌ తీసుకొచ్చారు. టెండర్లను రామలింగరాజు కుటుంబ సభ్యులు దక్కించుకున్నారు. మూడు కంపెనీలు సంయుక్తంగా టెండర్లు వేశాయి. ఆయా కంపెనీలపై క్రిమినల్‌ ఆరోపణలు ఉన్నాయి. ఐఎల్ఎఫ్ఎస్(ILFS)కు చెందిన టెరాసిస్‌ కంపెనీకి ధరణి పోర్టల్‌ అప్పగించారు. ఈ టెరాసిస్‌ కంపెనీని ఫిలిప్పీన్స్‌ సంస్థ కొనుగోలు చేసింది. ఈ కంపెనీలోకి సింగపూర్‌ కంపెనీ కూడా వచ్చింది. ఒక శాతం వాటా ఉన్న గాదె శ్రీధర్‌రాజు సీఈవో అయ్యారు. రకరకాల కంపెనీలకు ఇందులో వాటాలు ఉన్నాయి. ఈ వాటాలు అనేక చేతులు మారాయి.


ధరణిపై తెలంగాణ అగ్రిమెంటు పలు దేశాలకు మారింది. ఫిలిప్పీన్స్‌, సింగపూర్‌, అమెరికా నుంచి ఐలాండ్‌ వరకూ వెళ్లింది. ఆర్థిక నేరాలకు పాల్పడే కంపెనీలు ఉన్న దేశాల్లో ధరణి కంపెనీ ఉంది. దాని నిర్వహణలో మన రాష్ట్ర పౌరులు ఎవరూ లేరు. కనీసం పక్క రాష్ట్రాలకు చెందిన వారూ లేరు. టీఎస్‌టీఎస్‌ ఆధ్వర్యంలోనే ధరణి టెండర్లు వేశారు. ఐటీ శాఖ పరిధిలోనే టీఎస్‌టీఎస్‌ ఉంటుంది. ఆర్థిక నేరాలు చేసిన కంపెనీల ద్వారా డేటాను దేశం దాటించారు. ప్రజలను మోసం చేసి సమాచారాన్ని క్రిమినల్స్‌కు అందించారు. ఈ నేరాలకు ఏం శిక్ష విధించాలో తెలియాలంటే చట్టాలన్నీ చదవాలి. ధరణిలోకి డజన్ల కొద్దీ కంపెనీలు ఎందుకు వచ్చాయి?. మన భూముల సమాచారం మొత్తం విదేశాల్లో ఉంది.


రెవెన్యూ శాఖ, సీఎం దగ్గర ఉండాల్సిన సమాచారం విదేశాలకు వెళ్లింది. ఇన్ని అవకతవకలు ఉన్నా అద్భుతమంటూ ఎన్నికల్లో మాట్లాడారు. ఇవన్నీ మేము గత ఎన్నికల ముందే చెప్పాం. ధరణిలో మార్పులు చేయాలంటే ప్రభుత్వ అనుమతి ఉండాలి. నిబంధనలు ఉల్లంఘించి కంపెనీలు ఒప్పందం చేసుకున్నాయి. ధరణి పేరుతో వాళ్ల అరాచం, దుర్మార్గం చెప్పలేని స్థాయికి చేరింది. అనుమతి లేకుండా వ్యక్తిగత సమాచార సేకరణ నేరం. గాదె శ్రీధర్‌రావు ద్వారా విదేశాలకు సమాచారం పంపించారు. వాళ్లు ఒక్క క్లిక్‌ కొడితే సమాచారం మొత్తం నాశనమవుతుంది. మన దగ్గర ఉన్న సర్వర్లూ క్రాష్‌ అవుతాయి. అందుకే విచారణకు ఇవ్వడంపై ఇంతకాలం ఆలోచన చేశాం. విదేశాలకు వెళ్లి వివరాలు ఇవ్వాలని కోరినా సహకరించలేదు.


ఫార్ములా- అసలు విషయం ఇదే..

ఫార్ములా ఈ-కార్‌ రేసుపై చర్చకు బీఏసీలో బీఆర్ఎస్ నేతలు ఎందుకు కోరలేదు. మూడు నెలల నుంచే దీనిపై చర్చ జరుగుతోంది. మేము ప్రమాణ స్వీకారం చేసినప్పుడే FEO కంపెనీ ప్రతినిధులు నన్ను కలిశారు. కేటీఆర్‌తో చీకటి ఒప్పందం ఉందని వాళ్లే మాకు చెప్పారు. మీరూ సహకరించాలని మమ్మల్ని వారు కోరారు. ఫార్ములా ఈ-కార్‌ రేస్‌లో అసలు ఏం జరిగిందో తెలుసుకుందామనే ప్రయత్నంలోనే స్కామ్ మెుత్తం బయటపడిందని" తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Rangareddy: దారుణం.. సినిమా రేంజ్‌లో బ్లాస్టింగ్.. పరుగులు తీసిన ప్రజలు..

ED: కేటీఆర్‌కు బిగుస్తున్న ఉచ్చు.. రంగంలోకి ఈడీ

Updated Date - Dec 20 , 2024 | 04:31 PM