Share News

Telangana Talli: విగ్రహంపై వివాదం.. అప్పుడు.. ఇప్పుడు అసలు తేడాలివే..

ABN , Publish Date - Dec 06 , 2024 | 04:45 PM

తెలంగాణ తల్లి విగ్రహాన్ని దొరసానిలా రూపొందించారని కాంగ్రెస్ విమర్శిస్తుంటే.. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని, దీనిలో భాగంగా తెలంగాణ తల్లి రూపాన్ని మార్చాలనే ప్రయత్నం చేస్తోందని బీఆర్‌ఎస్ ఆరోపిస్తోంది. ఓ సాధారణ మహిళలా తెలంగాణ తల్లిని రూపొందిస్తున్నామని కాంగ్రెస్ చెబుతుండగా.. ..

Telangana Talli: విగ్రహంపై వివాదం.. అప్పుడు.. ఇప్పుడు అసలు తేడాలివే..
Telangana Talli

తెలంగాణ తల్లి విగ్రహంపై రాజకీయ వివాదం నడుస్తోంది. ప్రస్తుతం ఉన్న విగ్రహం రూపాన్ని మారుస్తూ.. కొత్త విగ్రహాన్ని ఈనెల9వ తేదీన ఆవిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య కొద్దిరోజులుగా మాటల యుద్ధం నడుస్తోంది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని దొరసానిలా రూపొందించారని కాంగ్రెస్ విమర్శిస్తుంటే.. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని, దీనిలో భాగంగా తెలంగాణ తల్లి రూపాన్ని మార్చాలనే ప్రయత్నం చేస్తోందని బీఆర్‌ఎస్ ఆరోపిస్తోంది. ఓ సాధారణ మహిళలా తెలంగాణ తల్లిని రూపొందిస్తున్నామని కాంగ్రెస్ చెబుతుండగా.. తెలంగాణ తల్లి రూపం ధనిక మహిళగా ఉంటే వచ్చే నష్టం ఏమిటని బీఆర్‌ఎస్ ప్రశ్నిస్తోంది. మరో మూడు రోజుల్లో కొత్త తెలంగాణ తల్లి రూపాన్ని ఆవిష్కరించనున్న నేపథ్యంలో కొత్త విగ్రహానికి సంబంధించిన రూపం బయటకు వచ్చింది. ఓ సాధారణ మహిళను తలపించేలా విగ్రహం ఉండగా.. గత విగ్రహానికి ప్రస్తుత విగ్రహానికి పోలికల్లో ఎన్నో తేడాలు ఉన్నాయి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా విగ్రహం రూపాలను మార్చడం సరికాదని బీజేపీ అంటోంది. ఇటీవల తెలంగాణ గేయం విషయంలోనూ వివాదం నెలకొన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం పాత గేయం స్థానంలో కొత్త గేయాన్ని తీసుకొచ్చింది. తాజాగా తెలంగాణ తల్లి విగ్రహం విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం గత రూపాన్ని మారుస్తూ ఓ సాధారణ మహిళ రూపాన్ని తలపించేలా కొత్త రూపాన్ని రూపొందించింది.


అప్పటికీ.. ఇప్పటికీ తేడాలివే..

పాత తెలంగాణ తల్లి విగ్రహంలో తెలంగాణ తల్లి జరీ అంచు పట్టు చీర ధరించగా.. కొత్త విగ్రహంలో పసుపు పచ్చ అంచుతో ఆకుపచ్చ చీర ధరించి ఉంది. పాత విగ్రహంలో తలకు కిరీటం, చేతిలో బతుకమ్మ ఉండగా.. కొత్త విగ్రహంలో కిరీటం, చేతిలో బతుకమ్మ లేదు. గత విగ్రహంలో తెలంగాణ తల్లి చేతికి బంగారు గాజులు ఉండగా, ప్రస్తుతం మట్టి గాజులు ధరించి తెలంగాణ తల్లి విగ్రహం కనిపిస్తోంది. గత విగ్రహం రాజమాతలా ఉందనే విమర్శలు రాగా.. కొత్త విగ్రహం సాధారణ మహిళ రూపాన్ని తలపిస్తోంది. పాత విగ్రహంలో వెండి మెట్టెలు, నగలు కిరీటం ఉండగా.. కొత్త విగ్రహంలో మెడలో కంటి ఆభరణం మాత్రమే కనిపిస్తోంది. పాత విగ్రహంలో కుడి చేతిలో మక్క కంకులు ఉండగా.. కొత్త విగ్రహం కుడి చేతిలో అభయ హస్తం కనిపిస్తోంది. పాత విగ్రహంలో ఎడమ చేతిలో బతుకమ్మ ఉండగా.. కొత్త విగ్రహంలో ఎడమ చేతిలో వరి, జొన్న, సజ్జ కంకులు ఉన్నాయి. రెండు విగ్రహాల రూపాలకు స్పష్టమైన తేడా కనిపిస్తోంది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Dec 06 , 2024 | 05:09 PM