TTD: శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇకపై టీటీడీ అన్ని ఆలయాల్లో నిత్యం తిరుపతి లడ్డూలు
ABN , Publish Date - Sep 06 , 2024 | 07:40 AM
తిరుమల శ్రీవారి ప్రసాదమైన లడ్డులంటే భక్తులకూ ఎంతో ఇష్టం. అయితే భక్తుల ఇష్టాన్ని సొమ్ము చేసుకునేందుకు కొందరు దళారీలు అడ్డదారి తొక్కుతున్నారు.
హైదరాబాద్: తిరుమల శ్రీవారి ప్రసాదమైన లడ్డులంటే భక్తులకూ ఎంతో ఇష్టం. అయితే భక్తుల ఇష్టాన్ని సొమ్ము చేసుకునేందుకు కొందరు దళారీలు అడ్డదారి తొక్కుతున్నారు. వీరికి అడ్డుకట్ట వేయడంతోపాటు, భాగ్యనగరంలోని అందరి భక్తులకు లడ్డూను అందుబాటులోకి తెచ్చేలా.. తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లు వారంలో ఒకరోజే అందుబాటులో ఉండే తిరుపతి లడ్డూ ఇకపై అన్ని రోజులు అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని హిమాయత్నగర్టీటీడీ దేవాలయం ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్ ప్రభు, నిరంజన్ తెలిపారు.
ఇక నుంచి ప్రతిరోజూ హైదరాబాద్నగర భక్తులకు శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అందించనున్నట్లు చెప్పారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు హిమాయత్‌నగర్, జూబ్లీహిల్స్‌లోని వేంకటేశ్వరస్వామి ఆలయాలు(టీటీడీ)లో రూ.50కే లడ్డూ ప్రసాదం అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. ఇప్పటివరకు కేవలం శని, ఆదివారాల్లో మాత్రమే లడ్డూలు విక్రయించేవారు. ఇక నుంచి ప్రతిరోజూ భక్తులకు లడ్డూ ప్రసాదం అందుబాటులో ఉండనుంది.
భక్తులకు అందుబాటులో
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కావాలనే భక్తులు దళారులను ఆశ్రయించకుండా ఉండేందుకు టీటీడీ స్థానిక ఆలయాలతోపాటు సమాచార కేంద్రాల్లో లడ్డూల విక్రయాలు ప్రారంభమైంది. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతి లోని కోదండరామ స్వామి ఆలయం, గోవిందరాజస్వామి ఆలయం, శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయం, అప్పలయాగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, ఒంటిమిట్ట లోని కోదండరామ స్వామి ఆలయం, దేవుని కడప, హైదరాబాద్ లోని హిమాయత్ నగర్, జూబ్లిహిల్స్ టీటీడీ దేవాలయం, విజయవాడ, రాజమండ్రి, పిఠాపురం, విశాఖపట్నం, అమరావతి,రంపచోడవరం, చెన్నైలోని శ్రీవారి ఆలయాల్లో లడ్డూలు విక్రయాలు ప్రారంభమయ్యాయి. దీంతో స్వామివారి ప్రసాదం భక్తులకు మరింత చేరువైనట్లైంది.
For Latest News click here