AV Ranganath: త్వరలో హైడ్రా పోలీస్‌స్టేషన్
ABN , Publish Date - Dec 01 , 2024 | 04:53 AM
‘త్వరలో హైడ్రా పోలీ్‌సస్టేషన్‌ను ఏర్పాటు చేస్తాం. చెరువులు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు, రహదారుల ఆక్రమణలపై ఫిర్యాదులను స్వీకరిస్తాం. వెంటనే పరిశీలించి చర్యలు తీసుకుంటాం.
ఫిర్యాదుల స్వీకరణ.. పరిశీలన.. చర్యలు.. ఆక్రమణలకు పాల్పడితే ఏ ఒక్కరినీ వదలం
సంపన్నులు, నాయకుల కబ్జాలే అధికం
పట్టణ జీవవైవిధ్య సదస్సులో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
ప్రతి నగరంలో హైడ్రా ఉండేలా సిఫారసు
జాతీయ జీవవైవిధ్య సంస్థ చైర్మన్ అచలేందర్
హైదరాబాద్ సిటీ, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): ‘త్వరలో హైడ్రా పోలీ్‌సస్టేషన్‌ను ఏర్పాటు చేస్తాం. చెరువులు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు, రహదారుల ఆక్రమణలపై ఫిర్యాదులను స్వీకరిస్తాం. వెంటనే పరిశీలించి చర్యలు తీసుకుంటాం. చెరువుల, పార్కులు, నాలాలు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు అనేక చట్టాలున్నాయి. వాటిని నిక్కచ్చిగా అమలయ్యేలా హైడ్రా చర్యలు తీసుకుంటుంది’ అని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వ్యాఖ్యానించారు. జాతీయ జీవవైవిధ్య ప్రాధికార సంస్థ, ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ లోకల్ ఎన్విరాన్మెంటల్ ఇనీషియేటివ్ ఆధ్వర్యంలో పట్టణ జీవవైవిధ్యంపై నగరంలో నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని, ప్రసంగించారు. జీవకోటికి ప్రాణాధారమైన జల వనరులను పరిరక్షించి, జీవవైవిధ్యాన్ని కాపాడేందుకు హైడ్రా కృషిచేస్తోందన్నారు. ‘ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడడంతోపాటు.. చెరువుల పరిరక్షణ, వాటి పునరుద్దరణ, ప్రజల అవసరాలకు కేటాయించిన స్థలాలు, పార్కులు, రహదారులు, నాలాలు, ప్రభుత్వ స్థలాలను రక్షించడమే హైడ్రా విధి. హైడ్రా ఆవిర్భావం తర్వాత చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్లపై ప్రజల్లో చర్చలు జరుగుతున్నాయి.
తాము కొనే ఇల్లు బఫర్ జోన్‌లో ఉందా? ప్రభుత్వ స్థలమా? అని ప్రజలు ఆరా తీస్తున్నారు. ఇది మంచి పరిణామం’’ అని వ్యాఖ్యానించారు. ఆక్రమణలకు పాల్పడితే ఏ ఒక్కరినీ వదలబోమని, జూబ్లీహిల్స్ లోట్‌సపాండ్‌లో ఏకంగా ఎకరం స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నాలు జరగ్గా.. హైడ్రా అడ్డుకుందని గుర్తుచేశారు. నగరంలోని చెరువులు ఇప్పటికే 61ు ఆక్రమణలకు గురయ్యాయని, ఇప్పటికైనా పటిష్ఠ చర్యలు చేపట్టకపోతే.. మిగిలిన 39ు చెరువులు కూడా 15 ఏళ్లలో కనుమరుగయ్యే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్‌ఆర్‌ఎ్‌సఏ, సర్వే ఆఫ్ ఇండియా, సర్వే ఆఫ్ తెలంగాణ, నీటిపారుదల శాఖ, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ తదితర విభాగాల సహకారంతో చెరువుల లెక్క తేలుస్తామన్నారు. ‘హైడ్రా అంటే కూల్చడం కాదు. చెరువులను పునరుద్దరించి, చక్కటి వాతావరణాన్ని ఏర్పాటు చేయడం. ఇటీవల కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ)తో సమావేశమై.. చెరువుల కలుషితం కాకుండా చూడాలని కోరాం. పారిశ్రామిక వ్యర్థాలను చెరువుల్లోకి రాకుండా చూస్తామని పీసీబీ అధికారులు తెలిపారు. గేటెడ్ కమ్యూనిటీలు సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తాం’ అని పేర్కొన్నారు. జాతీయ జీవవైవిధ్య ప్రాధికార సంస్థ చైర్మన్ అచలేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి నగరంలో హైడ్రాలాంటి వ్యవస్థ ఉండేలా కేంద్రానికి సిఫారసు చేస్తామన్నారు.