Share News

Hydra Operation: ఒక్కో విల్లాకు వేర్వేరుగా..

ABN , Publish Date - Sep 10 , 2024 | 04:45 AM

చెరువుల ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్ల పరిధిలో ఆక్రమణలు తొలగిస్తున్న హైడ్రా.. ఆ నిర్మాణాల అనుమతుల జారీపైనా దృష్టి సారించింది. పర్మిషన్లు ఎవరిచ్చారు?

Hydra Operation: ఒక్కో విల్లాకు వేర్వేరుగా..

  • అనుమతుల్లో కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ మాయాజాలం.. గృహ సముదాయంగా కాకుండా ఒక్కొక్కటిగా పర్మిషన్‌

  • సంస్థతో అధికారుల కుమ్మక్కు..

  • మునిసిపాలిటీగా ఏర్పడినా పాత తేదీలతో సంతకాలు

  • మల్లంపేట విల్లాల నిర్మాణంలో విస్తుగొలిపే పరిణామాలు

  • సున్నం చెరువు ఆక్రమణలపై మరో ఇద్దరిపై కేసు?

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): చెరువుల ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్ల పరిధిలో ఆక్రమణలు తొలగిస్తున్న హైడ్రా.. ఆ నిర్మాణాల అనుమతుల జారీపైనా దృష్టి సారించింది. పర్మిషన్లు ఎవరిచ్చారు? ప్రతిపాదిక ఏమిటి? వారికా అధికారం ఉందా? తెర వెనుక ఏం జరిగిందన్నది ఆరా తీస్తోంది. మల్లంపేట కత్వ చెరువులో విల్లాల అనుమతులు తీసుకోవడంలో శ్రీ లక్ష్మి కన్‌స్ట్రక్షన్స్‌ మాయాజాలం చేసింది. పంచాయతీ నిబంధనల్లో లొసుగులను ఆసరాగా చేసుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరించింది. 30 ఎకరాలకుపైగా స్థలంలో ఆ సంస్థ విల్లాలు నిర్మించింది. ఇందులో ఐదెకరాల్లో 65 విల్లాలకు హెచ్‌ఎండీఏ పర్మిషన్‌ ఇవ్వగా ఇతర నిర్మాణాలకు గ్రామ పంచాయతీ నుంచి అనుమతి తీసుకున్నారు. ఈ క్రమంలోనే కత్వ చెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లో 18 విల్లాలకు పర్మిషన్‌ ఇచ్చారని హైడ్రా గుర్తించింది.


పంచాయతీ కార్యదర్శిని నిర్మాణ సంస్థ యజమాని విజయలక్ష్మి మెనేజ్‌ చేయడంతోపాటు తప్పుడు పత్రాలు సమర్పించినట్లు ఆధారాలు సేకరించారు. మునిసిపాలిటీ ఏర్పాటు అనంతరమూ పాత తేదీలతో పంచాయతీ కార్యదర్శులు పర్మిషన్‌ పత్రాలపై సంతకాలు చేసినట్టు అంచనాకొచ్చారు. పట్టణ ప్రణాళికా విభాగం నిబంధనల ప్రకారం గృహ సముదాయాలకు నిర్మాణ అనుమతులిచ్చే అధికారం పంచాయతీలకు లేదు. అయితే 65 విల్లాలకు హెచ్‌ఎండీఏ పర్మిషన్‌ తీసుకున్న నిర్మాణ సంస్థ.. మరో 260 విల్లాలను పంచాయతీ అనుమతితో నిర్మించింది. ఇక్కడే వ్యవస్థను వారు తప్పుదోవ పట్టించారు. గృహ సముదాయంగా కాకుండా.. ఒక్కో విల్లాకు ఒక్కో అనుమతి తీసుకున్నారు. నిబంధనలకు ఇది విరుద్ధమైనా ఎవరూ పట్టించుకోలేదు. ఈ వ్యవహారంలో స్థానిక ప్రజాప్రతినిధులతోపాటు అధికారులకూ రూ.కోట్లు ముట్టినట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు వారంతా గప్‌చుప్‌ అవగా కొనుగోలుదారులు బాధితులయ్యారు. విల్లాలకు అనుమతులిచ్చిన కార్యదర్శుల వివరాలను హైడ్రా సేకరిస్తోంది. ఒకరిద్దరిపై గతంలోనే చర్యలు తీసుకున్నట్టు గుర్తించారు. ఇతరులపై చర్యలకూ సిఫారసు చేసే అవకాశముంది. వారిపై క్రిమినల్‌ కేసు నమోదుకూ రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది.


  • రంగనాథ్‌ దగ్గరకు మల్లంపేట విల్లా వాసులు

మల్లంపేట కత్వ చెరువు బాధితులు హైడ్రా కార్యాలయంలో కమిషనర్‌ రంగనాథ్‌ను కలిశారు. మరిన్ని నిర్మాణాలపైనా చర్యలుంటాయన్న హెచ్చరికల నేపథ్యంలో కాలనీ అసోసియేషన్‌ ప్రతినిధులు ఆయన వద్ద గోడు వెల్లబోసుకున్నారు. ’మాకూ మీ ఇళ్లు కూల్చాలని ఉండదు. చెరువుల ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లో ఉన్నందుకే చర్యలు తీసుకున్నాం. గతంలో విల్లాల కూల్చివేయడంతోపాటు విజయలక్ష్మిపై కేసులూ నమోదయ్యాయి. అయినా మీరు ఎలా కొనుగోలు చేశారు?’ అని రంగనాథ్‌ వారితో పేర్కొన్నట్లు తెలిసింది. ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లో ఉన్నవి మినహ ఇతర విల్లాల జోలికి వెళ్లబోమని ఆయన స్పష్టం చేశారు.


సున్నం చెరువు వద్ద కూల్చివేతల సమయంలో కిరోసిన్‌ పోసుకొని హడావుడి చేసిన వ్యక్తి వివరాలను హైడ్రా సేకరించింది. వెంకటేశ్‌ అనే వ్యక్తి చెరువు చుట్టూ బోర్లు వేసి 20 నుంచి 25 ట్యాంకర్లతో నీటి వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అక్కడి ఐటీ కంపెనీలు, కళాశాలల వసతి గృహాలు, అపార్ట్‌మెంట్‌లకు నీటిని సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఆయన రోజు సంపాదన రూ. లక్షల వరకు ఉంటుందని తెలిసిందని హైడ్రా వర్గాలు పేర్కొన్నాయి. భూమిని గోపాల్‌ ఆక్రమించగా ఆయన వద్ద చంద్రశేఖర్‌ యాదవ్‌ అనే వ్యక్తి కొనుగోలు చేశాడు. అక్కడ షెడ్లు వేసుకున్న వారి నుంచి చంద్రశేఖర్‌ అద్దె వసూలు చేస్తున్నట్టు నిర్ధారణకు వచ్చారు.


ఈ నేపథ్యంలో ముగ్గురిపై కేసులు నమోదు చేయాలని మాదాపూర్‌ పోలీసులతో హైడ్రా అధికారులు మాట్లాడినట్టు సమాచారం. మరోవైపు.. నాలాల ఆక్రమణలపై హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం పలు ప్రాంతాల నుంచి పౌరులు కార్యాలయానికొచ్చి ఫిర్యాదు చేశారు. ఇంకొందరు ఆన్‌లైన్‌లో వివరాలను అధికారుల దృష్టికి తెచ్చారు. చెరువులు, నాలాలకు సంబంధించిన ఫిర్యాదులను వేరు చేస్తున్న ఏజెన్సీ.. ముందుగా నాలాల ఆక్రమణల తొలగింపుపై దృష్టి సారించాలని నిర్ణయించింది. కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి జోన్ల పరిధిలో నాలాలపై చేపట్టిన నిర్మాణాలను మొదట తొలగించనున్నారు. హుస్సేన్‌సాగర్‌ సర్‌ప్లస్‌ నాలా ప్రవహించే ముషీరాబాద్‌,అంబర్‌పేట నియోజకవర్గాల పరిధిలోని నాలాల ఆక్రమణలపై దృష్టి సారిస్తామని చెబుతున్నారు. నాలాల విషయంలో ఏం చేయాలన్న దానిపై అధికారులకు రంగనాథ్‌ సోమవారం దిశానిర్దేశం చేశారు.

Updated Date - Sep 10 , 2024 | 04:45 AM