Share News

Sircilla Collector: కేటీఆర్‌ క్షమాపణ చెప్పాలి

ABN , Publish Date - Nov 29 , 2024 | 04:07 AM

సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌పై కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను ఐఏఎస్‌ అధికారుల సంఘం నిరసించింది. ఇలాంటి ఆధారరహిత ఆరోపణలను ఖండిస్తున్నామని గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది.

Sircilla Collector: కేటీఆర్‌ క్షమాపణ చెప్పాలి

  • ఐఏఎస్‌ అధికారుల సంఘం

  • కేటీఆర్‌ తీరు ప్రజాస్వామ్యానికి విఘాతం: ఐపీఎ్‌సల సంఘం

  • కేటీఆర్‌ది బెదిరింపు ధోరణి.. పోలీసు అధికారుల సంఘం

హైదరాబాద్‌, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌పై కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను ఐఏఎస్‌ అధికారుల సంఘం నిరసించింది. ఇలాంటి ఆధారరహిత ఆరోపణలను ఖండిస్తున్నామని గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఒక సివిల్‌ సర్వీసు అధికారిని లక్ష్యంగా చేసుకుని అవమానించినట్లుగా, గౌరవాన్ని దెబ్బతీసినట్లుగా కేటీఆర్‌ వ్యాఖ్యలు ఉన్నాయని పేర్కొంది. కేటీఆర్‌ కలెక్టర్‌పై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని, వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేసింది. సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌పై కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యల్ని తెలంగాణ ఐపీఎస్‌ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. రాజ్యాంగ నిబద్ధత ఆధారంగా సివిల్‌ సర్వెంట్స్‌ నిర్వహించే బాధ్యతలకు విరుద్ధంగా కేటీఆర్‌ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు.


ప్రజాసేవలో అధికారి విధులు నిష్పక్షపాతంగా, న్యాయబద్ధంగా, ఎలాంటి భయాందోళనలు లేకుండా నిర్వహించాల్సి ఉంటుందని, కానీ ఇలాంటి నిరాధార ఆరోపణలు బాధ్యతారహితమైనవని, ఇవి ప్రజాస్వామ్య వ్యవస్థలపై చెడు ప్రభావం చూపిస్తాయని పేర్కొంది. అలాగే, కేటీఆర్‌ పోలీసు శాఖపై చేసిన వ్యాఖ్యల్ని పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. కేటీఆర్‌ చేసిన అనుచిత వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపిరెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. కేటీఆర్‌ బెదిరింపు ధోరణిలో మాట్లాడటం వాంఛనీయం కాదన్నారు. పోలీసులను చులకన చేస్తూ, బెదిరిస్తూ మాట్లాడటం ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్‌కు సముచితం కాదన్నారు. తక్షణం కేటీఆర్‌ తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Nov 29 , 2024 | 04:07 AM