Share News

IIT Hyderabad: ఐఐటీహెచ్‌లో ఆవిష్కరణల సందడి

ABN , Publish Date - Dec 23 , 2024 | 03:15 AM

సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఐఐటీ హైదరాబాద్‌ (ఐఐటీహెచ్‌) వినూత్న ఆవిష్కరణల ప్రదర్శనకు వేదికైంది.

IIT Hyderabad: ఐఐటీహెచ్‌లో ఆవిష్కరణల సందడి

  • వినూత్న ప్రాజెక్టులు ప్రదర్శించిన ప్రముఖ విద్యాసంస్థల విద్యార్థులు

కంది, డిసెంబరు22 (ఆంధ్రజ్యోతి): సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఐఐటీ హైదరాబాద్‌ (ఐఐటీహెచ్‌) వినూత్న ఆవిష్కరణల ప్రదర్శనకు వేదికైంది. మేకర్‌ భవన్‌ ఫౌండేషన్‌, ఐఐటీ హైదరాబాద్‌ స్టార్టప్‌ సంస్థ ఐటీఐసీ ఇంక్యుబేటర్‌ సంయుక్తంగా విశ్వకర్మ అవార్డ్స్‌-2024 అందజేసేందుకు నిర్వహించిన పోటీల్లో దేశవ్యాప్తంగా ప్రముఖ విద్యా సంస్థలకు చెందిన యువవిద్యార్థి ఆవిష్కర్తలు పాల్గొన్నారు. నీరు-పారిశుధ్యం, గ్రీన్‌-టెక్నాలజీ, స్మార్ట్‌-మొబిలిటీలపై తాము అభివృద్ధి చేసిన ప్రాజెక్టులను ఆదివారం ప్రదర్శించడంతో ఐఐటీహెచ్‌ ప్రాంగణం సందడిగా మారింది.


ఇంటిలోపలే కూరగాయలు పండించొచ్చు..

ఇంటి పరిసరాలు, కార్యాలయాల్లో ఎక్కడైనా కూరగాయలు పండించే హైడ్రోపోనిక్‌ హార్వెస్టర్‌ను చండీగఢ్‌కు చెందిన చిట్కార యూనివర్సిటీ కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థులు హేమంత్‌, సర్దార్‌, కృషిన్‌లు రూపొందించారు. తక్కువ నీరు వినియోగించి ఎక్కువగా కూరగాయలు పండించేలా దీన్ని తయారుచేశారు. 10 గజాల స్థలంలో 100 కిలోల కూరగాయలు, ఆకుకూరలు పండేలా ప్లాంటేషన్‌ ప్రాజెక్టును రూపొందించారు. ప్లాస్టిక్‌ పైపులకు రంధ్రాలు చేసి వాటిలో మొక్కలునాటారు. పొలాల్లో కూరగాయల సాగుకు వినియోగించే నీటిలో 20శాతం మాత్రమే ఈ హైడ్రో పోనిక్‌ పద్ధతికి సరిపోతుందని వారు తెలిపారు. వంటింట్లో, బట్టలుతికిన తర్వాత పారబోసే మురికి నీటిని మళ్లీ వాడేలా శుద్ధి చేసే వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ను ఒడిసా యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీలో సివిల్‌ ఇంజనీరింగ్‌ చదువుతున్న హరీష్‌ పండా, సరస్వాల్‌ దాస్‌లు అభివృద్ధి చేశారు. ఇది రోజుకు 2,400 లీటర్ల మురికి నీటిని శుద్ధి చేస్తుంది. దీని ధర రూ.15వేలు. ప్రస్తుతానికి ఇది ప్రయోగదశలో ఉంద ని, త్వరలోనే మార్కెట్లోకి తెస్తామన్నారు.


మనుషుల అవసరంలేకుండా గోదాములు, ఇతర ప్రదేశాల్లో సామాన్లు, బరువైన వస్తువులను తీసుకెళ్లడానికి బ్యాటరీతో నడిచే ఆటోమెటిక్‌ అటానమస్‌ మొబైల్‌ రోబోను ఐఐటీ బాంబేలో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చదివే విద్యార్థులు ఐశ్వర్య, సానీ రూపొందించారు. ఇది ఒక్కసారి 100కిలోల వరకు బరువు మోయగలదు. ఇది రైతులకు పొలాల్లో ఎంతో ఉపయోగపడుతుందని విద్యార్థులు తెలిపారు. అపార్ట్‌మెంట్లలో ఏదైనా ప్రమాదం సంభవిస్తే అంతా భయపడుతుంటారు. లోపల ఏం జరుగుతుందో తెలియని, లోపలికి వెళ్లలేని పరిస్థితి నెలకొంటుంది. ఇలాంటప్పుడు మెట్లు ఎక్కుతూ ఫొటోలు తీస్తూ సమాచారాన్ని సేకరించే మినీ రోబోను కోయంబత్తూరుకు చెంది న అమృత విశ్వవిద్యాపీఠం మెకానికల్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థులు శ్రావణ్‌, కీర్తి రూపొందించారు. జీపీఎస్‌ ఆధారంగా అడవుల్లో, ఎత్తైన కొండల్లో ఫొటోలు తీస్తూ సమాచారాన్ని సేకరించే జియో విజన్‌ డ్రోన్‌ను హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన జేపీ యూనివర్సిటీ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ కంప్యూటర్‌ సైన్స్‌ విద్యార్థులు సౌరవ్‌కుమార్‌, యష్‌త్రిపాఠి రూపొందించారు. 12మీటర్ల ఎత్తు నుంచి కూడా స్పష్టంగా ఫొటోలను తీయడం దీని ప్రత్యేకత. ప్రస్తుతం ఇది ప్రయోగ దశలో ఉంది. తుఫాన్లు, వరదలు సంభవించినప్పుడు సాయం చేసేలా ఐఐటీ బాంబేలో సివిల్‌, ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌ చదువుతున్న విద్యార్థులు తహకచ్‌వాలా, ప్రణవ్‌ రాథీ, వర శ్రీనివా్‌సలు ఎయిర్‌షిప్‌ డ్రోన్‌ రూపొందించారు.

Updated Date - Dec 23 , 2024 | 03:15 AM