Share News

Murty B.S: మరో 20 ఏళ్ల తర్వాత.. రోడ్డు వేయాలన్నా చైనా ఇంజనీర్లే కావాలి!

ABN , Publish Date - Nov 09 , 2024 | 03:44 AM

ప్రతీ విద్యార్థి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కావాలనే ఆలోచనలతోనే ఉంటున్నారని, అందువల్ల ఒత్తిడి ఎక్కువై సరిగా చదవలేక, అనుకున్న లక్ష్యాలను చేరుకోలేకపోతున్నారని సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ-హైదరాబాద్‌(ఐఐటీ-హెచ్‌) డైరెక్టర్‌ బీఎస్‌ మూర్తి తెలిపారు.

Murty B.S: మరో 20 ఏళ్ల తర్వాత.. రోడ్డు వేయాలన్నా చైనా ఇంజనీర్లే కావాలి!

  • దేశంలో సాఫ్ట్‌వేర్‌పై మక్కువతో సివిల్‌, మెకానికల్‌ కోర్సులకు తగ్గుతున్న ప్రోత్సాహం

  • ప్రతీ విద్యార్థిలో ‘సాఫ్ట్‌వేర్‌’ ఒత్తిడి

  • మానసిక ఒత్తిడిని జయించేలా.. హైదరాబాద్‌

  • ఐఐటీలో నేడు, రేపు జాతీయ స్థాయి సదస్సు

  • ఐఐటీ-హెచ్‌ డైరెక్టర్‌ బీఎస్‌ మూర్తి వెల్లడి

కంది, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): ప్రతీ విద్యార్థి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కావాలనే ఆలోచనలతోనే ఉంటున్నారని, అందువల్ల ఒత్తిడి ఎక్కువై సరిగా చదవలేక, అనుకున్న లక్ష్యాలను చేరుకోలేకపోతున్నారని సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ-హైదరాబాద్‌(ఐఐటీ-హెచ్‌) డైరెక్టర్‌ బీఎస్‌ మూర్తి తెలిపారు. విద్యార్థులకు సాఫ్ట్‌వేర్‌పై ఉన్న మక్కువ నేపథ్యంలో ప్రైవేట్‌ కళాశాలకు సివిల్‌, మెకానికల్‌ లాంటి కోర్సులను ప్రోత్సహించడం లేదన్నారు. దీంతో, రాబోయే 20 ఏళ్లలో మనదేశంలో రోడ్డు వేయాలన్నా కూడా చైనా నుంచి ఇంజనీర్లను దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. విద్యార్థులు మానసిక ఒత్తిడిని జయించేందుకు ఐఐటీ-హైదరాబాదులో శని, ఆది వారాల్లో జాతీయ స్థాయి సదస్సును నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు.


కేంద్ర విద్యాశాఖ ఆదేశాలతో దేశంలోనే తొలిసారిగా ఐఐటీ-హెచ్‌లో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుశుక్రవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి సంజయ్‌మూర్తి హాజరువుతారని, సదస్సులో దేశం నలుమూలల నుంచి వందకు పైగా విద్యాసంస్థలు పాల్గొంటాయని బీఎస్‌ మూర్తి వివరించారు. వారంతా తమ విద్యాసంస్థల్లో పిల్లలు మానసిక ఒత్తిడిని తట్టుకునేందుకు, మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఎలాంటి పద్ధతులను అనుసరిస్తున్నారో ఐఐటీ-హెచ్‌లో స్టాళ్ల ద్వారా ప్రదర్శించనున్నట్లు చెప్పారు. విద్యార్థుల్లో ఒత్తిడిని దూరం చేసేందుకు ఐఐటీ-హెచ్‌లోనూ సన్‌షైన్‌ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టినట్లు మూర్తి ఈ సందర్భంగా తెలిపారు.

Updated Date - Nov 09 , 2024 | 03:44 AM