Share News

Nirmal: బాసరలో అక్రమాలు బట్టబయలు

ABN , Publish Date - Jun 29 , 2024 | 04:20 AM

నిర్మల్‌ జిల్లా బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో ప్రసాదాల విక్రయాల్లో అక్రమాలు మరోసారి బట్టబయలయ్యాయి. బాసర గ్రామస్థుల చొరవతో ఆలయ సిబ్బంది అవినీతి బాగోతం బట్టబయలైంది. గ్రామస్థుల ముందస్తు సమాచారం మేరకు అధికారులు ప్రసాదాల విక్రయ కేంద్రం వద్ద శుక్రవారం తనిఖీలు చేపట్టారు.

Nirmal: బాసరలో అక్రమాలు బట్టబయలు

  • ప్రసాద విక్రయాల్లో చేతివాటం

  • రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న గ్రామస్థులు

  • ఇద్దరు ఉద్యోగులు, నలుగురు ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందిపై వేటు

  • అక్రమాలను గతంలోనే వెలుగులోకి తెచ్చిన ‘ఆంధ్రజ్యోతి’

బాసర, జూన్‌ 28 : నిర్మల్‌ జిల్లా బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో ప్రసాదాల విక్రయాల్లో అక్రమాలు మరోసారి బట్టబయలయ్యాయి. బాసర గ్రామస్థుల చొరవతో ఆలయ సిబ్బంది అవినీతి బాగోతం బట్టబయలైంది. గ్రామస్థుల ముందస్తు సమాచారం మేరకు అధికారులు ప్రసాదాల విక్రయ కేంద్రం వద్ద శుక్రవారం తనిఖీలు చేపట్టారు. తయారీ కేంద్రం నుంచి ఆటోలో ప్రసాదాలను విక్రయ కేంద్రాలకు తీసుకెళుతున్న సమయంలో లెక్కించగా.. లెక్క తప్పినట్లు గుర్తించారు. ఒక్కో డబ్బాలో 100 ప్రసాదాలు ఉన్నట్లు రికార్డుల్లో ఉండగా.. డబ్బాల్లో మాత్రం 150 నుంచి 170 వరకు ఉన్నట్లు తనిఖీల్లో తేలింది. అధికంగా ఉన్న ప్రసాదాలను సిబ్బంది అనధికారికంగా విక్రయిస్తూ అవినీతికి పాల్పడుతున్నట్లు అర్థమవుతోంది. భక్తులకు విక్రయించిన టికెట్లు చించకుండా వాటినే తిరిగి విక్రయిస్తూ ఆలయ సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు.


గ్రామస్థులు ఆలయ ఈవో విజయ రామారావుకు సమాచారం అందించి.. ఆయన సమక్షంలోనే తనిఖీలు చేయగా ఈ అక్రమం వెలుగుచూసింది. ఽఅధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించడం వల్ల ఆలయ సిబ్బంది అవినీతికి అడ్డు లేకుండాపోయింది. ప్రసాదాల విక్రయాల్లో అవకతవకలపై ఆలయ సూపరింటెండెంట్‌ శివరాజ్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ లక్ష్మణ్‌ను సస్పెండ్‌ చేసినట్లు ఆలయ ఈవో విజయ రామారావు తెలిపారు. మరో నలుగురు ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని సైతం విధుల్లో నుంచి తొలగించినట్లు ఈవో చెప్పారు. 2 నెలల క్రితమే ‘ఆంధ్రజ్యోతి’ బాసరలో ప్రసాద విక్రయాల్లో అక్రమాలను వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే.

Updated Date - Jun 29 , 2024 | 04:20 AM