రెరా అప్పిలేట్ ట్రైబ్యునల్ ఉన్నట్టేనా?
ABN , Publish Date - Oct 14 , 2024 | 03:31 AM
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ నియంత్రణ సంస్థ (రెరా) వివిధ ప్రాజెక్టుల విషయంలో తీసుకునే నిర్ణయాలను సవాలు చేసేందుకు అప్పిలేట్ ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేసినా.. దాని కార్యాచరణ మాత్రం ప్రారంభం కావడంలేదు.
నాలుగు నెలల క్రితం ఏర్పడిన ట్రైబ్యునల్
ఇంతవరకు నోటిఫై చేస్తూ రాని ప్రకటన
సిబ్బంది కేటాయింపులూ చేయని సర్కారు
విచారణలు ప్రారంభించలేని పరిస్థితి
40కి పైగా పెండింగ్‌లో ఉన్న కేసులు
హైదరాబాద్, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ నియంత్రణ సంస్థ (రెరా) వివిధ ప్రాజెక్టుల విషయంలో తీసుకునే నిర్ణయాలను సవాలు చేసేందుకు అప్పిలేట్ ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేసినా.. దాని కార్యాచరణ మాత్రం ప్రారంభం కావడంలేదు. ట్రైబ్యునల్ ఏర్పాటై నాలుగు నెలల గడుస్తున్నా సిబ్బంది కొరత వల్ల పని ప్రారంభించలేదు. దీంతో రెరా విధించిన జరిమానాలపై అప్పిలేట్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించిన వారికి పరిష్కారం దొరకడంలేదు. సాధారణంగా రెరా తీసుకున్న నిర్ణయాల్లో రుసుముల గురించి గానీ, లేదా ప్రాజెక్టుల ప్రకటనలు, ప్రీ లాంచింగ్ అమ్మకాలు, రెరా రిజిస్ట్రేషన్ లేకుండా విక్రయాలు తదితర అంశాలపై అభ్యంతరాలున్న వారు అప్పిలేట్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయిస్తుంటారు. ఈ అవసరమైన
కార్యాలయాన్ని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల శిక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసినా.. దీనిని నోటిఫై చేస్తూ ఇంతవరకు ప్రకటన ఇవ్వలేదు. దీంతో విచారణలు కూడా జరగకపోవడంతో 40కిపైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిపై ట్రైబ్యునల్ ఇచ్చే ఆదేశాల కోసం సంబంధిత ప్రాజెక్టుల నిర్వాహకులు ఎదురుచూస్తున్నారు. గతంలో వ్యాట్ ట్రైబ్యునల్ ద్వారా రెరా ప్రాంగణంలోనే కొన్ని కేసులు పరిష్కారమయ్యేవి. అప్పిలేట్ ట్రైబ్యునల్ ఏర్పాటయ్యాక వ్యాట్ ట్రైబ్యునల్ విచారణ ఆగిపోయింది. వ్యాట్ ట్రైబ్యునల్‌లో ఉన్న 28 కేసులు, అప్పిలేట్ ట్రైబ్యునల్ ఏర్పాటయ్యాక వచ్చిన 12 కేసులు కలిపి మొత్తం 40 వరకు పెండింగ్‌లో ఉన్నాయి.
సిబ్బంది కొరత వల్లనే జాప్యం..
సిబ్బంది కేటాయింపులు లేకపోవడం వల్లే అప్పిలేట్ ట్రైబ్యునల్ విచారణలు ప్రారంభించలేని పరిస్థితి నెలకొంది. ట్రైబ్యునల్‌కు సంబంధించి 33 మంది సిబ్బంది కావాలని ప్రభుత్వానికి రెరా ప్రతిపాదించింది. రిజిస్ర్టార్, డిప్యూటీ రిజిస్ర్టార్, అసిస్టెంట్ రిజిస్ర్టార్, పరిపాలనా అధికారి(ఏవో), ఫైనాన్స్ అధికారి, డిప్యూటీ డైరెక్టర్ టెక్నికల్, అసిస్టెంట్ అకౌంట్ అధికారి, ఐటీ మేనేజర్, సూపరింటెండెంట్, లైబ్రేరియన్, సీనియర్ స్టెనోగ్రాఫర్, లీగల్ ఎగ్జిక్యూటివ్, లా క్లర్క్, జ్యుడీషియల్ సభ్యుడికి పీఎస్, జూనియర్ అసిస్టెంట్స్, డాటా ఎంట్రీ ఆపరేటర్లు వంటి పోస్టులను భర్తీ చేయాలని రెరా కోరింది.
దీనిపై ప్రభుత్వం నుంచి నిర్ణయం వెలువడకపోవడం, అధికారికంగా సిబ్బంది కేటాయింపులు లేకపోవడం వల్ల అప్పిలేట్ ట్రైబ్యునల్ తన విచారణలు చేపట్టడంలో జాప్యం జరుగుతోంది. సిబ్బంది కేటాయింపులు జరిగిన వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసి విచారణలు ప్రారంభించే అవకాశం ఉంది. అయితే ఇందు కోసం ఎంత సమయం పడుతుందో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొనడంతో అప్పిలేట్ ట్రైబ్యునల్‌కు వెళ్లిన వారికి సుదీర్ఘ నిరీక్షణ తప్పడం లేదు.