Sridhar Babu: తెలంగాణలో పెట్టుబడులు, సహకారం కోసం 117 ఒప్పందాలు
ABN , Publish Date - Dec 01 , 2024 | 04:58 AM
ఆవిష్కరణలను ప్రోత్సహించేలా వివిధ దేశాల నుంచి తెలంగాణకు పెట్టుబడులు వస్తున్నాయని, అందులో టీ కన్సల్ట్ కీలక పాత్ర పోషిస్తుందని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
టీ కన్సల్ట్ కృషిని ప్రశంసించిన మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్ సిటీ/కందుకూరు, నవంబరు30(ఆంధ్రజ్యోతి): ఆవిష్కరణలను ప్రోత్సహించేలా వివిధ దేశాల నుంచి తెలంగాణకు పెట్టుబడులు వస్తున్నాయని, అందులో టీ కన్సల్ట్ కీలక పాత్ర పోషిస్తుందని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. టీ హబ్‌లో రెండు రోజుల పాటు నిర్వహించే టీ కన్సల్ట్ కొలాబరేషన్ కాన్‌క్లేవ్ 2024ను ఆయన ప్రారంభించారు. తెలంగాణలో పెట్టుబడులు, సహకారం కోసం 117 ఒప్పందాలు కుదరడం అభినందనీయమని మంత్రి చెప్పారు. ఐటీతో పాటు ఐటీఈఎస్, హెల్త్‌కేర్, హెచ్‌ఆర్, ట్రేడింగ్, కెపాసిటీ బిల్డింగ్ తదితర అంశాల్లో వివిధ దేశాల్లో ఉన్న సంస్థలతో ఈ ఎంఓయూలు కుదిరాయి. ఆయా సంస్థలు తెలంగాణలో ఆవిష్కరణలు, అభివృద్ధికి పెట్టుబడులు పెట్టడం, సహకారమందించడం ద్వారా ఉద్యోగాల కల్పన జరుగుతుందని మంత్రి చెప్పారు. టీ కన్సల్ట్ వ్యవస్థాపకుడు సందీప్ మక్తాల ఆధ్వర్యంలో టీ కన్సల్ట్ బృందం దాదాపు 63 దేశాల్లో పనిచేస్తున్న తెలంగాణ ఐటీ నిపుణులను, సంస్థలను ఒకతాటిపైకి తెచ్చిందని శ్రీధర్‌బాబు ప్రశంసించారు.
ఎన్ని అడ్డంకులు సృష్టించినా హామీలన్నీ నెరవేరుస్తాం
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులకు ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. శనివారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని కందుకూరు, మహేశ్వరం, బడంగ్‌పేటలలో రూ.69 కోట్ల నిధులతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఫోర్త్‌సిటీ ఏర్పాటుతో ఈ ప్రాంతానికి మహర్దశ కలగనుందన్నారు. రావిరాల ఓఆర్‌ఆర్-ఎగ్జిట్-13 నుంచి ఫోర్త్‌సిటీ వరకు 330 అడుగుల వెడల్పుతో నిర్మించే రోడ్డుకు ప్రజల సమ్మతితోనే భూసేకరణ చేస్తున్నట్లు తెలిపారు.