Share News

Jagdish Reddy: మోదీ, రేవంత్‌ ఒక్కటయ్యారు!

ABN , Publish Date - May 10 , 2024 | 06:34 AM

బీఆర్‌ఎస్‌ లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం రేవంత్‌రెడ్డి ఒక్కటయ్యారు. ఇందుకు వంద ఆధారాలున్నాయ్‌.. అసెంబ్లీ ఎన్నికల ముందు కేంద్రం తీసుకున్న నిర్ణయాలు రేవంత్‌కు లబ్ధి చేకూర్చేలా ఉన్నాయి’ అని మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

Jagdish Reddy: మోదీ, రేవంత్‌ ఒక్కటయ్యారు!

  • ఇందుకు వంద ఆధారాలున్నాయ్‌..

  • వారి నడుమ మధ్యవర్తిత్వం రాహుల్‌దే

  • ప్రజల దృష్టి మరల్చేందుకే ‘ట్యాపింగ్‌’ కథనాలు

  • ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సకు డబుల్‌ డిజిట్‌..

  • ‘మీట్‌ ది ప్రెస్‌’లో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి

హైదరాబాద్‌ సిటీ, మే 9 (ఆంధ్రజ్యోతి): ‘బీఆర్‌ఎస్‌ లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం రేవంత్‌రెడ్డి ఒక్కటయ్యారు. ఇందుకు వంద ఆధారాలున్నాయ్‌.. అసెంబ్లీ ఎన్నికల ముందు కేంద్రం తీసుకున్న నిర్ణయాలు రేవంత్‌కు లబ్ధి చేకూర్చేలా ఉన్నాయి’ అని మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. బడే భాయ్‌, చోటే భాయ్‌ల నడుమ మధ్యవర్తిత్వం చేస్తున్నది రాహుల్‌ గాంధీయేనన్నారు. గురువారం హైదరాబాద్‌ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ‘మీట్‌ ది ప్రెస్‌’లో విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ‘ఆర్‌’ ట్యాక్స్‌ వసూలు చేసి ఢిల్లీకి రేవంత్‌ సంచులు మోస్తున్నాడని మోదీ చేసిన ఆరోపణల్లో నిజముంటే కేంద్రం ఆధీనంలోని ఈడీ, సీబీఐలు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు.


ఢిల్లీలో కూర్చొని కాళేశ్వరంపై కేంద్ర నిపుణుల కమిటీ రూపొందించిన నివేదిక బయటపెట్టడం మోదీ, రేవంత్‌ మధ్య అవగాహనలో భాగమేనన్నారు. గోదావరి జలాలను తమిళనాడుకు అప్పగించేందుకు మోదీ కుట్ర చేస్తున్నారని.. కృష్ణా, గోదావరి జలాలపై ఇక్కడి ప్రజల హక్కులను కాపాడేది బీఆర్‌ఎస్‌ మాత్రమేనని చెప్పారు. రిజర్వేషన్ల తొలగింపును సమర్థించే ప్రసక్తే లేదని, ముస్లిం మైనార్టీ రిజర్వేషన్లపై గతంలో మేం చేసిన శాసనసభా తీర్మానానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. కేంద్రం నిధులిస్తేనే గ్యారెంటీల అమలంటూ రేవంత్‌ మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.


‘రాష్ట్ర బడ్జెట్‌ పబ్లిక్‌ డాక్యుమెంట్‌.. నిధుల లభ్యత, కేటాయింపుల వివరాలన్నీ అందులో ఉంటాయి.. అయినా ఇష్టానికి హామీలిచ్చి.. అమలు చేయలేక కేంద్రం మీద నెపం నెట్టేసి చేతులు దులుపుకొనే ప్రయత్నం చేస్తున్నారు’ అని విమర్శించారు. హామీలు అమలు చేయలేక ఫోన్‌ ట్యాపింగ్‌ కథనాలు వండి వారుస్తున్నారని, సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ఇదంతా చేస్తున్నారని దుయ్యబట్టారు.


ప్రజల చూపు బీఆర్‌ఎస్‌ వైపే..

లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ డబుల్‌ డిజిట్‌ స్థానాల్లో గెలుస్తుందని జగదీశ్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ‘కొట్లాడి సాధించుకున్న తెలంగాణ భవిష్యత్తు బీఆర్‌ఎస్‌ చేతుల్లోనే ఉంది.. రాష్ట్రానికి పార్టీ చరిత్రాత్మక అవసరం. కేసీఆర్‌ బస్సు యాత్రతో కాంగ్రెస్‌, బీజేపీల్లో భయం కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో మోసపోయామని భావిస్తున్న ప్రజలు ఇప్పుడు బీఆర్‌ఎస్‌ వైపే చూస్తున్నారు. అధికార పార్టీ నేతల మాటలు ఎక్కడా ప్రజోపయోగకరంగా లేవు. ఇందుకు కోమటిరెడ్డి బ్రదర్స్‌ వ్యాఖ్యలే నిదర్శనం. స్వార్థ ప్రయోజనాలు తప్ప.. వాళ్లకు ప్రజల కోసం ఆలోచించే అలవాటు లేదు. నేనేప్పుడూ వ్యక్తిగత ఆరోపణలు చేయను.. వాళ్లలా చెత్త వాగుడు వాగను..’ అని వ్యాఖ్యానించారు.

Updated Date - May 10 , 2024 | 06:34 AM