Share News

సబ్‌ రిజిస్ట్రార్‌ అరెస్ట్‌

ABN , Publish Date - Oct 30 , 2024 | 03:32 AM

నకిలీ రిజిస్ట్రేషన్‌ కేసులో కుత్బుల్లాపూర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌గా పని చేసిన వుజ్జిని జ్యోతిని జీడిమెట్ల పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచారు.

సబ్‌ రిజిస్ట్రార్‌ అరెస్ట్‌

  • నకిలీలలు

  • నకిలీ రిజిస్ట్రేషన్‌ కేసులో 14 రోజుల రిమాండ్‌

  • తప్పుడు మరణ ధ్రువీకరణ పత్రంతో భూ రిజిస్ట్రేషన్‌

  • యజమాని బతికుండగానే మరొకరికి బదలాయింపు

జీడిమెట్ల, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): నకిలీ రిజిస్ట్రేషన్‌ కేసులో కుత్బుల్లాపూర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌గా పని చేసిన వుజ్జిని జ్యోతిని జీడిమెట్ల పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచారు. మేడ్చల్‌ జడ్జి ఆమెకు 14 రోజుల రిమాండ్‌ విధించారు. హైదరాబాద్‌లోని ఉప్పుగూడ ప్రాంతంలోని హనుమాన్‌నగర్‌కు చెందిన లెంద్యాల సురేశ్‌కు జీడిమెట్ల పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని సుభాష్‌నగర్‌ వెంకటాద్రినగర్‌లో 200 గజాల స్ధలం ఉంది. ఆ స్ధలం ఖాళీగా ఉండటంతో స్థానిక బీఆర్‌ఎస్‌ నేత పద్మజారెడ్డి మరో ఆరుగురు వ్యక్తులతో కలిసి స్థల యజమాని బతికుండగానే మృతి చెందినట్టు మరణ ధ్రువీకరణ పత్రం, నకిలీ పాన్‌కార్డు, ఆధార్‌కార్డులను సృష్టించారు. 2023 ఫిబ్రవరిలో అప్పటి కుత్బుల్లాపూర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌గా ఉన్న జ్యోతి ఆ స్థలాన్ని పద్మాజారెడ్డి పేరుమీద రిజిస్ట్రేషన్‌ చేశారు. దీనికి సంబంధించిన ఫిర్యాదు అందడంతో ఈ నెల 4న పద్మాజారెడ్డితో పాటు ఐదుగురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

విచారణ నిమిత్తం తిరిగి పద్మాజారెడ్డిని అదుపులోకి తీసుకున్న జీడిమెట్ల పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. తనకు సబ్‌ రిజిస్ట్రార్‌ జ్యోతితో పాటు మరి కొందరు వ్యక్తులు ఈ నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్‌కు సహకరించినట్టు ఆమె వెల్లడించడంతో.. ప్రస్తుతం నాంపల్లిలోని చిట్స్‌ అండ్‌ ఫైనాన్స్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న జ్యోతిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు మంగళవారం రిమాండ్‌కు తరలించినట్టు జీడిమెట్ల సీఐ గడ్డం మల్లేశ్‌ తెలిపారు. అదేవిధంగా ఈ నకిలీ రిజిస్ట్రేషన్‌కు సహకరించిన మరికొందరు ప్రజాప్రతినిధులపై కూడా విచారణ చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు.

Updated Date - Oct 30 , 2024 | 03:32 AM