Kaleshwaram Project: 20 నుంచి కాళేశ్వరంపై విచారణ పునఃప్రారంభం!
ABN , Publish Date - Nov 15 , 2024 | 04:54 AM
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ విచారణ ఈ నెల 20 నుంచి పునఃప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. విచారణలో భాగంగా జస్టిస్ పీసీ ఘోష్ రెండు వారాలపాటు హైదరాబాద్‌లోనే ఉండనున్నారు.
2 వారాలు హైదరాబాద్‌లోనే ఉండనున్న జస్టిస్ పీసీ ఘోష్
ఐఏఎస్, మాజీ ఐఏఎ్‌సల విచారణ.. ఇద్దరు నేతలకూ సమన్లు ?
హైదరాబాద్, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ విచారణ ఈ నెల 20 నుంచి పునఃప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. విచారణలో భాగంగా జస్టిస్ పీసీ ఘోష్ రెండు వారాలపాటు హైదరాబాద్‌లోనే ఉండనున్నారు. ఈనెల 20 నుంచి ఐఏఎ్‌సలు, మాజీ ఐఏఎ్‌సలను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. కమిషన్ విచారణ పూర్తిచేసి నివేదిక ఇచ్చేందుకు డిసెంబరు ఆఖరు వరకు గడువు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం జీవో జారీ చేయడంలో జాప్యం కారణంగా విచారణ రెండు వారాలు ఆలస్యమైంది. ఈ నెల 12 నుంచి క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియ చేపట్టాలని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నిర్ణయించగా... ప్రభుత్వం మాత్రం కమిషన్ గడువును పెంచే జీవోను ఈనెల 13న విడుదల చేసింది.
జీవో కోసం 13 రోజులుగా వేచిచూసిన జస్టిస్ పీసీ ఘోష్ ప్రభుత్వ తీరుపై కాస్తా నారాజ్ అయినట్లు సమాచారం. ఇక ఇప్పటికే నీటిపారుదల శాఖ ఈఎన్‌సీలు, మాజీ ఈఎన్‌సీలు, చీఫ్ ఇంజనీర్లు, ఎస్‌ఈల క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయింది. ఐఏఎ్‌స/మాజీ ఐఏఎ్‌సలను విచారించిన అనంతరం...మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ఇద్దరు మాజీ కీలక ప్రజాప్రతినిధులను విచారణకు రావాలని సమన్లు పంపనుంది. వీరి విచారణకుఅవసరమైన సాక్ష్యాలను ఇప్పటికే కమిషన్ సేకరించింది. ఈనెలాఖరున లేదా డిసెంబరు తొలివారంలో ఇద్దరికి సమన్లు పంపే అవకాశాలున్నాయి. డి సెంబరులో నివేదికకు తుదిరూపునిచ్చి నెలాఖరులో ప్రభుత్వానికి సమర్పించేందుకు కమిషన్ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.