K. Srinivas: వామపక్షాల వైఫల్యం వల్లే మతోన్మాదం
ABN , Publish Date - Aug 01 , 2024 | 03:22 AM
మతోన్మాద శక్తులు సమాజంలో ఇంతలా ప్రబలడానికి వామపక్ష, ప్రజాస్వామిక, ప్రగతిశీల శక్తుల వైఫల్యమే కారణమని ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.
ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్
కమ్యూనిస్టుల ధోరణి మారాలి: కె.నాగేశ్వర్
‘మతోన్మాదం-సెక్యులరిజం’పై వామపక్షాల రాష్ట్ర సదస్సు
హైదరాబాద్ సిటీ, జూలై 31(ఆంధ్రజ్యోతి): మతోన్మాద శక్తులు సమాజంలో ఇంతలా ప్రబలడానికి వామపక్ష, ప్రజాస్వామిక, ప్రగతిశీల శక్తుల వైఫల్యమే కారణమని ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. మరీ ముఖ్యంగా ‘మత జాతీయవాదం’ వ్యాప్తికి కమ్యూనిస్టులు చాలా దోహదం చేశారని విమర్శించారు. జాతీయవాదంలోని సమస్యలను గుర్తించకుండా 1960ల్లో కమ్యూనిస్టులు తాము అందరి కంటే ఎక్కువ జాతీయవాదులమని నిరూపించుకోవడానికి ప్రయత్నించారన్నారు.
ఇన్నాళ్లుగా సెక్యులరిజం పేరుతో చేస్తున్న వాదనలు, ఆచరణ సక్రమమైనవి కాదన్నారు. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో బుధవారం సుందరయ్య కళా నిలయంలో ‘మతోన్మాదం-సెక్యులరిజం’ అంశంపై సదస్సు జరిగింది. తెలంగాణ చరిత్రను మతతత్వ శక్తులు పూర్తిగా వక్రీకరించి, ప్రచారం చేస్తుంటే కమ్యూనిస్టు పార్టీలు మొదట ఎందుకు మౌనంగా ఉన్నాయని కె. శ్రీనివాస్ నిలదీశారు. బీజేపీకి లోక్‌సభ సీట్లు తగ్గినా భావజాలపరంగా వాళ్లు మరింత దూకుడుగా వెళ్లే ప్రమాదం లేకపోలేదన్నారు.
అందుకు యూపీలోని కావడి యాత్ర పేరుతో సాగుతున్న రభసే నిదర్శనమన్నారు. మరో ముఖ్య వక్త ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ మాట్లాడుతూ మత ఛాందస వాదుల్లాగే కమ్యూనిస్టుల్లోనూ తాము చెప్పిందే సత్యమని వాదించే వారున్నారని, ఆ ధోరణి మార్చుకోవాలని హితవు పలికారు. దేవుడు, మతం విషయాల్లో వామపక్షవాదులు నాస్తికుల్లా వ్యవహరించడం సరికాదన్నారు. మెజారిటీ మతమైనంత మాత్రాన, వారి విశ్వాసాలను అవహేళన చేయకూడదన్నారు. బీజేపీని ఎదుర్కోవాలంటే పోరాడాల్సింది దేవుడిపై కాదన్నారు. సీపీఐ, సీపీఎం, ఇతర వామపక్షాల నాయకులు పాల్గొన్నారు.