Share News

Land Records: రెవెన్యూ దస్త్రాలు శిథిలావస్థలో!

ABN , Publish Date - Nov 25 , 2024 | 02:51 AM

రాష్ట్రంలో రెవెన్యూ శాఖలో కీలకమైన భూ దస్త్రాలు అనేకం శిథిలమయ్యాయి. ఇంకా ఆ దశకు చేరుకోనివి శిథిలమయ్యే ప్రక్రియలో ఉన్నాయి. సంరక్షించాల్సిన అధికారులు వాటిని గాలికి వదిలేశారు.

Land Records: రెవెన్యూ దస్త్రాలు శిథిలావస్థలో!

  • అటకెక్కిన డిజిటైజేషన్‌.. పట్టించుకోని అధికారులు

  • రికార్డుల ఆధునికీకరణకు కేంద్రం ప్రత్యేక కార్యక్రమం

  • వ్యయం భరించటానికీ సిద్ధం.. 2014లోనే రూ.83 కోట్లు

  • బీఆర్‌ఎస్‌ హయాంలో సర్వేకు ఉన్నతాధికారుల యత్నాలు

  • సీఎంవోకు ప్రతిపాదనలు.. ముందడుగు పడని వైనం

  • వందేళ్ల నాటి భూ సర్వే కాగితాలే నేటికీ దిక్కు

పక్క ఫొటోలోని కాగితాల ముక్కలను చూస్తే ఏమనిపిస్తుంది.. చిత్తుకాగితాలను తగలబెడితే మిగిలిపోయిన అవశేషాల్లా లేవూ?.. కానీ, ఇవి చిత్తు కాగితాలూ కావు.. వాటిని తగలబెట్టనూ లేదు. ఇవి హయత్‌నగర్‌ మండలం బండరావిర్యాల్‌ భూములకు చెందిన రెవెన్యూ రికార్డులు. రాష్ట్రంలో కీలకమైన భూ దస్త్రాలు ఏ స్థితిలో ఉన్నాయో.. ఈ ఫొటోనే ఓ నిదర్శనం.

హైదరాబాద్‌, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రెవెన్యూ శాఖలో కీలకమైన భూ దస్త్రాలు అనేకం శిథిలమయ్యాయి. ఇంకా ఆ దశకు చేరుకోనివి శిథిలమయ్యే ప్రక్రియలో ఉన్నాయి. సంరక్షించాల్సిన అధికారులు వాటిని గాలికి వదిలేశారు. భూముల రికార్డులను డిజిటలైజ్‌ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టినా దాని అమలు కాగితాలకే పరిమితమైంది. రాష్ట్రంలో దాదాపుగా 1.67 కోట్ల సర్వే నంబర్లు ఉన్నాయి. భూ వివాదాల్లో, వాటికి సంబంధించిన న్యాయ విచారణల్లో రెవెన్యూ రికార్డులే కీలకం. కానీ, వాటి నిర్వహణ గందరగోళంగా మారింది. వాస్తవానికి, భూముల దస్త్రాలను డిజిటలీకరించే ప్రక్రియను కేంద్రం ప్రభుత్వం 2008లోనే ప్రారంభించింది. దీని కోసం ‘జాతీయ భూ రికార్డుల ఆధునికీకరణ కార్యక్రమం’ (ఎన్‌ఎల్‌ఆర్‌ఎంపీ) అనే ప్రాజెక్టుకు ఆ ఏడాది ఆగస్టు 21వ తేదీన నాటి కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం, రికార్డుల ఆధునికీకరణకు అయ్యే ఖర్చు అంతా కేంద్రమే భరిస్తుంది. ఇదే కార్యక్రమాన్ని ప్రధాని మోదీ హయాంలో ‘డిజిటల్‌ ఇండియా ల్యాండ్‌ రికార్డ్స్‌ మోడ్రనైజేషన్‌ ప్రొగ్రామ్‌’ (డీఐఎల్‌ఆర్‌ఎంపీ)గా మార్చారు. ఇది 2016 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ కార్యక్రమాన్ని కేంద్రం 2025-26 వరకు పొడగించింది.


  • సీఎం ఆఫీసులో మురిగిపోయిన ఫైళ్లు

ఎన్‌ఎల్‌ఆర్‌ఎంపీ కింద 2014లోనే తెలంగాణలో భూముల సమగ్ర సర్వేకు కేంద్రం నిధులు మంజూరు చేసింది. రూ.250 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేసి.. తొలుత రూ.83 కోట్లను విడుదల చేసింది. అయితే, ఆ నిధులతో కంప్యూటర్లు, కార్యాలయ ఫర్నీచర్‌ వంటి వాటిని కొనుగోలు చేశారు తప్ప అసలు కార్యక్రమాన్ని చేపట్టలేదు. రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పని చేసిన బీఆర్‌ మీనా.. భూముల సర్వేకు అనుమతినివ్వాలని సీఎం కార్యాలయానికి ఫైలు పంపించారు. కానీ.. ఆ ఫైలుకు సంబంధించి అడుగులు ముందుకు పడలేదు. మీనా పదవీ విరమణ చేసిన రెండేళ్ల దాకా ఆ ఫైలు జాడ కానరాలేదు. 2016లో ఈ విషయంలో మరోసారి కదలిక వచ్చింది. సర్వేకు అవసరమైన సన్నాహకాలు పూర్తి చేసిన అప్పటి సీసీఎల్‌ఏ రేమండ్‌ పీటర్‌.. అనుమతిస్తే రెండేళ్లలో భూముల సమగ్ర సర్వే పూర్తి చేస్తామని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఈ ఫైలు కూడా సీఎం కార్యాలయంలోనే మురిగిపోయింది. రేమండ్‌ పీటర్‌ కూడా పదవీ విరమణ చేశారు. మరోవైపు, భూముల సర్వే చేయకపోతే తాము ఇచ్చిన నిధులను వెనక్కి పంపించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం తాఖీదులు పంపింది.


  • వందేళ్ల నాటి కాగితాలు

నిజాం పాలనలో నాటి హైదరాబాద్‌ రాజ్యంలో వందేళ్ల క్రితం భూ సర్వే ప్రక్రియ ప్రారంభమై కొన్ని ఏళ్లపాటు కొనసాగింది. అయితే, భూ సర్వే జరిపినప్పుడు.. వృథా ఖర్చు ఎందుకనే ఉద్దేశంతో కొండలు, గుట్టలు, ప్రభుత్వ భూములను సర్వే నుంచి మినహాయించారు. పన్ను చెల్లించే భూముల వరకే సర్వే జరిపారు. గ్రామ స్థాయి నుంచి ఎక్కడైనా భూ వివాదాలు తలెత్తినప్పుడు పాత రికార్డులను తిరగేసి సమస్యకు పరిష్కారం చూపేవారు. ఆ తర్వాత అవే రికార్డులను ఓ గుడ్డలో మూట కట్టి పక్కన పెట్టేవారు. దశాబ్దాలుగా ఇదే పరిస్థితి కొనసాగింది. దాంతో కాగితాలు చిరిగిపోయి శిథిలావస్థకు చేరాయి. వాటిలో ఇప్పుడు అనేక రికార్డులు డిజిటలైజ్‌ చేయటానికి కూడా అనుకూలంగా లేనంత పాడైపోయాయి.


  • డీఐఎల్‌ఆర్‌ఎంపీ లక్ష్యం ఇదీ!

భూముల రీ సర్వే చేపట్టి భూ దస్త్రాలను డిజిటలైజ్‌ చేయటం, ఆ వివరాలను కంప్యూటరీకరించటం డీఐఎల్‌ఆర్‌ఎంపీ లక్ష్యం. దీంట్లో భాగంగా రికార్డ్స్‌ ఆఫ్‌ రైట్స్‌ (ఆర్వోఆర్‌), కెడెస్ట్రల్‌ మ్యాప్‌లను డిజిటలైజ్‌ చేయడం, సమీకృత డేటా సెంటర్లను ఏర్పాటు చేయటం, తహసీల్దార్‌ కార్యాలయంలో ఉండే రికార్డులతో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలను అనుసంధానించటం వంటి పనులను చేపట్టాలని కేంద్రం సూచించింది. తహసీల్దారు స్థాయిలో భూ దస్త్రాల నిర్వహణకు ఆధునిక సదుపాయాలతో రికార్డు గదుల ఏర్పాటు, టెక్నాలజీ వినియోగంపై రెవెన్యూ సిబ్బందికి శిక్షణ, భూ దస్త్రాలతో రెవెన్యూ కోర్టుల అనుసంధానం, ఆర్వోఆర్‌తో ఆధార్‌ అనుసంధానం వంటివి చేపట్టాలని ప్రతిపాదించింది. భూములకు ‘యూనిక్‌ ల్యాండ్‌ పార్సిల్‌ ఐడెంటిఫికేషన్‌ నంబర్ల’ను (యూఎల్‌పీఐఎన్‌) ఇవ్వాలని పేర్కొంది. తొలిదశలో భాగంగా డీఐఎల్‌ఆర్‌ఎంపీని 25 రాష్ట్రాల్లో అమలు చేశారు. తెలంగాణలో మాత్రం అడుగు ముందుకు పడలేదు. భూముల రీసర్వే చేపడితే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయోనన్న భయంతో ప్రభుత్వాలు ఆ పని చేపట్టేందుకు ముందుకు రావడం లేదు. దీంతో పాత భూ దస్త్రాలన్నీ శిథిలావస్థకు చేరి భూ సమస్యలను మరింత జఠిలంగా మారుస్తున్నాయి.

Updated Date - Nov 25 , 2024 | 02:51 AM