Share News

Khammam: కుమారులకు ఆస్తి పంపకంలో వివాదం..

ABN , Publish Date - Dec 03 , 2024 | 04:26 AM

ఇద్దరు కుమారులకు ఆస్తి పంపకానికి సంబంధించిన వివాదంలో ఖమ్మం నగరానికి చెందిన వ్యాపారవేత్త చేకూరి సత్యంబాబు(79) ఆత్మహత్యకు పాల్పడ్డారు. సోమవారం తెల్లవారుజామున తన నివాసంలోనే విషం తీసుకొని చనిపోయారు. చనిపోయే ముందు సూసైడ్‌ నోట్‌ రాశారు.

Khammam: కుమారులకు ఆస్తి పంపకంలో వివాదం..

  • ఖమ్మం వ్యాపార వేత్త ఆత్మహత్య

ఖమ్మం, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఇద్దరు కుమారులకు ఆస్తి పంపకానికి సంబంధించిన వివాదంలో ఖమ్మం నగరానికి చెందిన వ్యాపారవేత్త చేకూరి సత్యంబాబు(79) ఆత్మహత్యకు పాల్పడ్డారు. సోమవారం తెల్లవారుజామున తన నివాసంలోనే విషం తీసుకొని చనిపోయారు. చనిపోయే ముందు సూసైడ్‌ నోట్‌ రాశారు. ఐదుగురి కారణంగా తాను చనిపోతున్నట్లు అందులో పేర్కొన్నారు. ‘‘మీరు ఐదుగురంటే ప్రాణం. మీకు ఏదైనా జరిగితే నేను బతకలేను. నేను చనిపోతేనే మీరు బతుకుతారని ఆలోచించి చనిపోవడానికి నిర్ణయం తీసుకున్నాను’’ అని అందులో రాశారు. తన చిన్న కుమారుడు శేఖర్‌, అతని భార్య సుజాతను తన మృతదేహం వద్దకు, అంత్యక్రియలకు రానివ్వవద్దని కూడా లేఖలో పేర్కొన్నారు. సత్యంబాబుకు ఖమ్మం జిల్లాలో కోల్డ్‌ స్టోరేజీలు, జిన్నింగ్‌ మిల్లు ఉన్నాయి. చిట్‌ఫండ్స్‌ కూడా నిర్వహిస్తున్నారు.


ఆయనకు భార్య నాగేంద్రమ్మ, కుమారులు శ్రీధర్‌, శేఖర్‌ ఉన్నారు. కొద్ది కాలంగా చిన్న కుమారుడు శేఖర్‌తో ఆస్తికి సంబంధించిన వివాదం నడుస్తోంది. పలుమార్లు పంచాయితీలు జరిగాయి. మరోవైపు, శ్రీధర్‌ తనకు అప్పు ఉన్నాడంటూ ఓ మహిళతో పాటు మరికొందరు గత శుక్రవారం అతని ఇంటివద్ద ఆందోళనకు దిగారు. దీంతో శనివారం, సత్యంబాబుతో పాటు శ్రీధర్‌ను పోలీసులు స్టేషన్‌కు పిలిపించినట్టు తెలిసింది. మనోవేదనకు లోనైన సత్యంబాబు సోమవారం తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడ్డారు. సత్యంబాబు ఆత్మహత్య చేసుకున్న గదిలో కుటుంబ సభ్యుల పేర్లతో రాసిన ఆరుపేజీల సూసైడ్‌ నోట్‌ ఖమ్మం పోలీస్‌ కమిషనర్‌కు లభించింది. తనకు ఎక్కువ ఆస్తి కావాలని శేఖర్‌ పేచీ పెడుతున్నాడని, శేఖర్‌ అతడి భార్య సుజాత, బావమరిది గంగాధర్‌ కలిసి... శ్రీధర్‌తో పాటు ఆరుగురు కుటుంబ సభ్యులను చంపడానికి ప్రయత్నించారని ఆ లేఖలో ఉంది. తాము అప్పు ఉన్న డాక్టర్‌ మహేంద్ర, పరుచూరి క్రిష్ణమోహన్‌లతో కలిసి తమ పరువుతీశారని సూసైడ్‌ నోట్‌లో సత్యంబాబు ఆరోపించారు.

Updated Date - Dec 03 , 2024 | 04:26 AM