Kishan Reddy: మాకు కాంగ్రెస్ సర్టిఫికెట్‌తో పనిలేదు
ABN , Publish Date - Dec 26 , 2024 | 05:04 AM
అంబేడ్కర్, ప్రజాస్వామ్యం గురించి బీజేపీకి కాంగ్రెస్ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన పనిలేదని, అసలు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రె్‌సకు లేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు.
అసలు ప్రజాస్వామ్యంపై మాట్లాడే అర్హత ఆ పార్టీకే లేదు..: కిషన్‌రెడ్డి
కాంగ్రె్‌సకు అబద్ధాల్లో ఆస్కార్: సంజయ్
విలువలున్న వ్యక్తి వాజపేయి: లక్ష్మణ్
హైదరాబాద్, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): అంబేడ్కర్, ప్రజాస్వామ్యం గురించి బీజేపీకి కాంగ్రెస్ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన పనిలేదని, అసలు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రె్‌సకు లేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. అంబేడ్కర్‌ను రెండు పర్యాయాలు ఎన్నికల్లో ఓడించిన పార్టీ కాంగ్రెస్ అని, అంబేడ్కర్‌ను మంత్రిగా రాజీనామా చేయించిన ఘనత నెహ్రూకే దక్కుతుందని విమర్శించారు. మాజీ ప్రధాని వాజపేయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇందిరాగాంధీ లాంటి నేతలకు భారతరత్న ఇచ్చుకున్న కాంగ్రెస్ పెద్దలు, రాజ్యాంగాన్ని రూపకల్పన చేసిన బాబాసాహెబ్ అంబేడ్కర్‌కు భారతరత్న ఇచ్చేందుకు మనసు రాలేదన్నారు. దేశంలో అనేక సామాజిక సంస్థలు వాజపేయి శతాబ్ది ఉత్సవాలను 2025 డిసెంబరు 25 వరకు నిర్వహించుకోవాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ ఉత్సవాల్లో ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరారు.
అంబేడ్కర్‌ను కాంగ్రెస్ అడుగడుగునా అవమానించిందని, ఇప్పుడు ఆయనపై మొసలి కన్నీరు కార్చడం విడ్డూరమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. అబద్ధాల్లో ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సి వస్తే అది కాంగ్రె్‌సకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా వాజపేయి పని చేశారన్నారు. తెలంగాణలో ఆనాడు కేసీఆర్, ఇప్పుడు రేవంత్‌రెడ్డి ప్రజలకు 70 ఎంఎం సినిమాలు, గ్రాఫిక్స్ చూపుతూ హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారన్నారని దుయ్యబట్టారు. అంబేడ్కర్ విషయంలో కాంగ్రెస్ అబద్ధాలను ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ప్రధానిగా వాజపేయి మూడు పర్యాయాలు దేశానికి సేవలందించారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కె.లక్ష్మణ్ అన్నారు. నైతిక విలువలతో కూడిన రాజకీయాలు చేసిన మహోన్నత వ్యక్తి వాజపేయి అని కొనియాడారు. సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టించేలా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ కుట్రలను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. వాజపేయి జీవితం స్ఫూర్తిదాయకమని కేంద్ర మాజీ మంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్ వ్యాఖ్యానించారు. వాజపేయి ఆశయాలను నరేంద్ర మోదీ ముందుకు తీసుకెళుతున్నారని చెప్పారు. వాజపేయి జయంతి వేడుకల్లో భాగంగా 27 కేంద్రాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించినట్లు బీజేపీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ తెలిపారు.