Kishan Reddy: రేవంత్.. ప్రజల్ని ఒప్పించి ప్రక్షాళన చెయ్
ABN , Publish Date - Nov 18 , 2024 | 03:25 AM
మూసీ పరీవాహక ప్రాంతాన్ని ప్రక్షాళన చేసే ముందు అక్కడ ఏళ్లుగా నివసిస్తున్న పేదలను ఒప్పించాలని, వారి అనుమతితో మూసీ సుందరీకరణ ప్రాజెక్టు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సూచించారు.
అలాగైతే మూసీ ప్రాజెక్టుకు మేం శ్రమదానం చేస్తాం
పేదల ఇళ్లను కూల్చివేయడమే ఇందిరమ్మ రాజ్యమా?
తీవ్ర మనోవేదనతో ఇప్పటికే 9 మంది మృతిచెందారు
బుల్డోజర్లు వచ్చినా ప్రజల వెంటే ఉంటాం: కిషన్‌రెడ్డి
రేవంత్‌రెడ్డి, కేటీఆర్.. ఇద్దరూ ముఖ్యమంత్రులే..
వారి కుటుంబాల మధ్య వ్యాపార సంబంధాలు రుజువు చేయలేకపోతే పదవి నుంచి తప్పుకొంటా: బండి
హైదరాబాద్ సిటీ, గోల్నాక, దిల్‌సుఖ్‌నగర్, చాదర్‌ఘాట్, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): మూసీ పరీవాహక ప్రాంతాన్ని ప్రక్షాళన చేసే ముందు అక్కడ ఏళ్లుగా నివసిస్తున్న పేదలను ఒప్పించాలని, వారి అనుమతితో మూసీ సుందరీకరణ ప్రాజెక్టు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సూచించారు. పేద ప్రజలకు ఇబ్బంది లేకుండా మూసీ ప్రాజెక్టు చేపడితే బీజేపీ శ్రేణులమందరమూ శ్రమదానం చేస్తామన్నారు. మూసీ పరీవాహక ప్రాంతాల్లోని బస్తీల్లో సీఎం పాదయాత్ర చేయాలని, తాను కూడా పాదయాత్ర చేస్తానని చెప్పారు. బీజేపీ మూసీ నిద్ర కార్యక్రమంలో భాగంగా శనివారం రాత్రి అంబర్‌పేట తులసీరాం నగర్‌లో బస చేసిన కిషన్‌రెడ్డి.. ఆదివారం ఉదయం అక్కడే అల్పాహారం చేసి బస్తీవాసులతో ముచ్చటించారు. ఎన్ని బుల్డోజర్లు వచ్చినా పేద ప్రజల ఇళ్లకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. పేద ప్రజలపైన రాష్ట్ర ప్రభుత్వం యుద్ధం ప్రకటించి ఇళ్లను కూల్చుతోందన్నారు. ఇండ్లు కూల్చుతామని సీఎం రేవంత్ ప్రకటించిన తర్వాత.. భయం, ఆవేదన కారణంగా 9 మంది గుండెపోటుతో మరణించారన్నారు. ఇళ్లను కూల్చడమే ఇందిరమ్మ రాజ్యామా అని నిలదీశారు.
మూసీ సుందరీకరణ ప్రాజెక్టు పూర్తి కావాలంటే రూ.1.50 లక్షల కోట్ల నిధులు కావాలని, వాటిని ప్రభుత్వం ఎక్కడి నుంచి తెస్తుందని ప్రశ్నించారు. మూసీలో పెద్ద ఎత్తున పరిశ్రమల కాలుష్యం, అనేక కాలనీల డ్రైనేజీ నీళ్లు కలుస్తున్నాయని, ముందు దానిని నివారించాలని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇళ్లను కూల్చడం సరికాదన్నారు. మూసీ నిద్ర చేశామని, ఇక్కడ ఎటువంటి దుర్గంధం రావడం లేదని కిషన్‌రెడ్డి తెలిపారు. ఏ ఒక్కరు కూడా ఇక్కడున్న ఇల్లు ఖాళీ చేస్తామని చెప్పలేదని, మరోచోట తమకు ఇల్లు ఇవ్వాలని అడగలేదని పేర్కొన్నారు. ఏళ్ల తరబడి కూలీ చేసుకుంటూ కష్టపడి కట్టుకున్న ఇండ్లను కూలగొడితే ఎక్కడికిపోవాలంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. గతంలో కేసీఆర్ కూడా మూసీని కొబ్బరినీళ్లలా మారుస్తామని, ట్యాంక్‌బండ్ చుట్టూ ఆకాశ హర్మ్యాలు నిర్మిస్తామని చెప్పి గులాబీ గ్రాఫిక్స్ చూపించారని చివరికి ఫాంహౌ్‌సకు వెళ్లిపోయారని కిషన్‌రెడ్డి విమర్శించారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి ఇళ్లను కూల్చుతూ కొత్త పల్లవి ఎత్తుకున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా, మహారాష్ట్ర ఎన్నికల్లో మాత్రం అన్నీ అమలు చేశామంటూ అబద్ధాలను ప్రచారం చేస్తోందన్నారు.
భవిష్యత్తు ఉద్యమానికి సమాయత్తం: లక్ష్మణ్
ముసారాంబాగ్ డివిజన్‌లోని శాలివాహననగర్ కాలనీలో శనివారం రాత్రి బస చేసిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్.. కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్లుగా కాంగ్రె్‌సకు అధికారం లభించిందన్నారు. ఎన్నికల ముందు మూసీ ప్రక్షాళన ప్రస్తావనే కాంగ్రెస్ చేయలేదని, అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ల జేబులు నింపడంలో భాగంగానే మూసీ ప్రక్షాళన అంటున్నారని ఆరోపించారు. రైతులకు, మహిళలకు ఇచ్చిన హమీలను అమలుపరిచేలా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మెడలు వంచుతామని, అవసరమైతే ప్రజా ఉద్యమాన్ని ప్రారంభిస్తామని హెచ్చరించారు. ఇది మొదటి విడత బస్తీ నిద్ర మాత్రమేని, రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి నిద్ర లేకుండా చేస్తామన్నారు.
పేదలతో గోక్కున్నోడు బాగుపడలేదు
ఎల్‌బీనగర్ నియోజకవర్గం పరిధిలోని ఫణిగిరి కాలనీలో బస చేసిన బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ, పేదలతో గోక్కున్నోడు ఎవడూ బాగు పడలేదని మండిపడ్డారు. నోటీసులు ఇవ్వకుండా, కనీసం ఇంట్లో ఉన్న వాటిని తీసుకునే సమయం కూడా ఇవ్వకుండా ఇళ్లు కూల్చడం రేవంత్‌రెడ్డి పాశవిక పాలనకు నిదర్శనమని దుయ్యబట్టారు. మూసీ పక్కన ఉన్న దేవాలయాలకు కూడ నోటీసులు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విలువైన భూమలు కాబట్టే చైతన్యపురి మూసీపరివాహక ప్రాంతం మీద రేవంత్‌రెడ్డి కన్నుపడిందన్నారు. పలువురు బాధితులు ఈ సందర్బంగా ఈటలతో తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఇల్లు కూల్చేస్తారన్న ఆందోళనతో యాసిడ్ తాగానని రాము అనే ఆటోడ్రైవర్ బోరున విలపించారు. ఆరోగ్యం పూర్తిగా నయంకాక ఆటో నడపటం లేదని, ఇల్లు కూడా గడవడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని రూ.400 ఛార్జీలు పెట్టుకుని వరంగల్ పోయి ఓటు వేసి వచ్చానని, ఆ విశ్వాసంతోనైనా తమ ఇళ్లను కూలగొట్టకండి అని ఆయన ప్రాధేయపడ్డాడు. నరకం ఎక్కడో లేదు..రేవంత్‌రెడ్డి రూపంలో తెలంగాణ రాష్ట్రానికి పట్టిందని ఓ బాధిత మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది.
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై నేడు బీజేపీ వర్క్‌షాప్
ఆరుగ్యారంటీల అమలులో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ సోమవారం వర్క్‌షాప్ నిర్వహించనుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం ఉదయం 11.30 గంటలకు బొంగులూరు గేట్ వద్ద ఉన్న వేద కన్వెన్షన్‌లో జరుగనుంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేలా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్రలపై ఈ వర్క్‌షా్‌పలో కార్యాచరణ రూపొందించనున్నట్లు పార్టీవర్గాలు తెలిపాయి.