భక్తి మత్తెక్కిన అమోఘ ఘట్టమే పురాణపండ ‘ఉగ్రం ... వీరం’.. కేసీఆర్, పొన్నాలపై ప్రశంసలు
ABN , Publish Date - May 21 , 2024 | 12:01 AM
తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రధాన సాంస్కృతిక, భక్తి కేంద్రాల్లో రచయిత పురాణపండ శ్రీనివాస్ అమోఘ రచనా సంకలనం ‘ఉగ్రం... వీరం’ పవిత్ర గ్రంధాన్ని ఏడుగురు ప్రముఖులచే...
హైదరాబాద్, మే 20: భాగవతంలోని నృసింహావిర్భావఘట్టం చదివినప్పుడు... ఒక అభయహస్తం మనల్ని రక్షిస్తున్న అనుభూతి కలుగుతుందని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ ఉపకులపతి, ప్రముఖ సాహితీవేత్త ఆచార్య కొలకనూరి ఇనాక్ (Kolakaluri Enoch) పేర్కొన్నారు. ప్రముఖ రచయిత, శ్రీశైలదేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ (Puranapanda Srinivas) అపురూప రచనా సంకలనం ‘ఉగ్రం ... వీరం’ పరమాద్భుత గ్రంధాన్ని సోమవారం సాయంకాలం త్యాగరాయగానసభ (Tyagarayagana Sabha)లో ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఇనాక్ మాట్లాడుతూ.. పురాణపండ శ్రీనివాస్ భక్తి మత్తెక్కిన అమోఘ ఘట్టాల అపురూప రచనలు ఆత్మాన్వేషణ, సత్యాన్వేషణల వైపు ప్రయాణింపచేస్తాయని పేర్కొంటూ.. ఈ గ్రంధం అత్యంత ఆకర్షణీయంగా ప్రచురించిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ఆంధ్రప్రదేశ్ పూర్వ ఐటి శాఖామంత్రి పొన్నాల లక్ష్మయ్య (Ponnala Lakshmaiah) అంకితభావాన్ని అభినందించారు.
సభకు అధ్యక్షత వహించిన త్యాగరాయగానసభ అధ్యక్షులు కళా జనార్ధన మూర్తి మాట్లాడుతూ.. ప్రహ్లాద నృసింహుల రసాత్మక గాథ పురాణపండ శ్రీనివాస్ ఎంతో కమనీయంగా, రమణీయంగా అందించారని ఈ గ్రంధంలో శైలి చెరకు పానకంలా హాయిగా ఉందని, ఆబాలగోపాలం చదవాల్సిన అందమైన, అద్భుతమైన గ్రంథమిదని చెప్పారు. కేసీఆర్ (KCR) అంకితభావం యాదాద్రి సౌందర్యంలో అడుగడుగునా దర్శనమిస్తోందని జనార్ధనమూర్తి ప్రశంసించారు.
విశిష్ట అతిధిగా పాల్గొన్న ప్రముఖ సాహితీవేత్త ఆచార్య శ్రీమతి శరత్ జ్యోత్స్నారాణి మాట్లాడుతూ.. అహంకారపు పొరని తొలగించి, వాత్సల్య భక్తికి తెరతీసిన ‘ఉగ్రం .. వీరం’ గ్రంధం మహాద్భుతమని చెప్పారు. ఈ గ్రంథ సౌందర్యం శ్రీవైష్ణవ తేజస్సుతో అలరారుతోందన్నారు.
ఇదిలా ఉండగా ఇప్పటికే యాదాద్రిలో ప్రారంభమైన శ్రీ లక్ష్మీనృసింహ స్వామి జయంతి మహోత్సవాలకు, ఈ ఉత్సవ శోభలో పాల్గొనే ప్రముఖులకు, దాతలకు ఈ ఉన్నత గ్రంధాన్ని బహుకరించేందుకు పొన్నాల లక్ష్మయ్య అనుచరులు ఈ ‘ఉగ్రం... వీరం’ వేలకొలది ప్రతులను ఆలయ కార్యాలయానికి చేర్చారని యాదాద్రి దేవస్థానం ఉన్నతోద్యోగులు మీడియా ప్రముఖులతో అన్నారు. ఈ చక్కని గ్రంధం వెనుక తెలంగాణ పూర్వ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు క్షేమాన్ని పొన్నాల ఆకాంక్షిస్తూ ఈ పవిత్ర గ్రంథ ఉద్యమం నడిపిస్తున్నట్లు తెలంగాణా భారాస శ్రేణుల సమాచారం. ఈ కార్యక్రమానికి సంగీత అధ్యాపకురాలు శ్రీమతి అపర్ణ స్వాగతం పలికారు.