Share News

Komatireddy Raj Gopal Reddy: ఎన్టీఆర్‌ ఘాట్‌ను తొలగించాలనలేదు

ABN , Publish Date - Dec 19 , 2024 | 03:42 AM

ఎన్టీఆర్‌ ఘాట్‌ను తొలగించాలని తాను అనలేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. సచివాలయం పక్కన కొత్త అసెంబ్లీ కడితే బాగుంటుందని మాత్రమే అన్నానని చెప్పారు.

Komatireddy Raj Gopal Reddy: ఎన్టీఆర్‌ ఘాట్‌ను తొలగించాలనలేదు

  • సచివాలయం పక్కన అసెంబ్లీ కట్టాలని మాత్రమే అన్నాను

  • ఎన్టీఆర్‌ ఓ లెజండరీ.. ఆయనంటే నాకు అభిమానం

  • ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’తో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

హైదరాబాద్‌, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్‌ ఘాట్‌ను తొలగించాలని తాను అనలేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. సచివాలయం పక్కన కొత్త అసెంబ్లీ కడితే బాగుంటుందని మాత్రమే అన్నానని చెప్పారు. తాను అనని మాటలను కొందరు కావాలని ప్రచారం చేస్తున్నారని తప్పుబట్టారు. ఎన్టీఆర్‌ అంటే తనకు ఎంతో అభిమానమని, ఆయన ఓ లెజండరీ పర్సనాలిటీ అని అన్నారు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన వ్యక్తి అని కొనియాడారు. రాజగోపాల్‌రెడ్డి మంగళవారం అసెంబ్లీ లాబీల్లో మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ సచివాలయం పక్కన కొత్త అసెంబ్లీ కడితే బాగుంటుందని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.


అయితే ఎన్టీఆర్‌ ఘాట్‌ను తొలగించి అక్కడ అసెంబ్లీ కట్టాలంటూ రాజగోపాల్‌రెడ్డి అన్నట్లుగా కొన్ని ప్రసార మాధ్యమాల్లో వచ్చింది. దీంతో ఆయన వ్యాఖ్యల పట్ల సోషల్‌ మీడియాలో విమర్శలు వచ్చాయి. మరోవైపు రాష్ట్రంలోని పలు జిల్లాలతోపాటు హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఎన్టీఆర్‌ అభిమానులు నిరసన తెలిపారు. ఖమ్మంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ అంశంపై కాంగ్రెస్‌ పార్టీలోనూ అంతర్గతంగా చర్చ జరిగినట్లు తెలిసింది. తెలంగాణలో పెద్దసంఖ్యలో ఎన్టీఆర్‌కు అభిమానులు ఉన్నారని, రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలతో పార్టీకి నష్టం జరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమైనట్టు సమాచారం. ఈ నేపథ్యంలో రాజగోపాల్‌రెడ్డి తన వ్యాఖ్యలపై బుధవారం ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ వివరణ ఇచ్చారు.

Updated Date - Dec 19 , 2024 | 03:42 AM