Share News

Venkat Reddy: పత్రికలు నిజాలు తెలుసుకొని వార్తలు రాయాలి

ABN , Publish Date - Oct 18 , 2024 | 03:37 AM

పత్రికలు నిజ నిజాలు తెలుసుకొని వార్తలు రాయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అన్నారు.

Venkat Reddy: పత్రికలు నిజాలు తెలుసుకొని వార్తలు రాయాలి

  • ప్రజల్లో అపోహలు కల్పించేలా రాయకూడదు

  • మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

హైదరాబాద్‌, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): పత్రికలు నిజ నిజాలు తెలుసుకొని వార్తలు రాయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అన్నారు. ఒకటి, రెండు పార్టీల పత్రికలు పనిగట్టుకొని కాంగ్రెస్‌ ప్రజాప్రభుత్వం, మంత్రులపై అసత్య వార్తలు రాస్తూ శునకానందం పొందుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్రికలు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా ఉండాలి తప్ప ప్రజల్లో అపోహలు కల్పించేలా వార్తలు రాయకూడదని హితవు పలికారు. కొన్ని పత్రికలు పార్టీలను సంతృప్తిపరిచే వార్తలు రాయడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.


ఇటీవల ఓ పత్రిక తాను హెలికాప్టర్‌ అడిగితే అధికారులు వద్దన్నట్టు వార్త రాసిందని, సీఎంకు, మంత్రులకు మధ్య విభేదాలు సృష్టించేలా ఓ పార్టీ పత్రిక వెకిలి రాతలు రాస్తోందని చెప్పారు. ఫోన్‌ ట్యాంపింగ్‌కు పాల్పడ్డ ప్రభాకర్‌ రావును అమెరికాకు పంపిన విషయం, హరీశ్‌ రావు, కేటీఆర్‌ అక్కడకు వెళ్లి భారతదేశంలోకి అడుగుపెట్టొదంటూ ఆయన్ను హెచ్చరించిన విషయాన్ని ఆ పత్రిక రాయాల్సిందని ఎద్దేవా చేశారు. హరీశ్‌రావు పార్టీలో రెండో స్థానం కోసం కేసీఆర్‌ను బ్లాక్‌మెయిల్‌ చేస్తున్న విషయాన్ని ఆ పత్రిక రాస్తే బాగుంటుందని అన్నారు.

Updated Date - Oct 18 , 2024 | 03:37 AM