Share News

Sridhar Babu: రూ.300 కోట్లతో ‘షూఆల్స్‌’ ప్లాంట్‌!

ABN , Publish Date - Oct 25 , 2024 | 03:44 AM

తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని కొరియా కంపెనీ షూఆల్స్‌ ప్రకటించింది. ఈ కంపెనీ.. మెడికల్‌, స్మార్ట్‌ బూట్ల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది.

Sridhar Babu: రూ.300 కోట్లతో ‘షూఆల్స్‌’ ప్లాంట్‌!

  • 750 ఎకరాల్లో ఏర్పాటు చేస్తాం.. 87 వేల మందికి ఉద్యోగావకాశాలు.. తెలంగాణలో భారీ పెట్టుబడులకు సిద్ధం

  • మంత్రి శ్రీధర్‌బాబుతో భేటీలో షూఆల్స్‌ చైర్మన్‌ లీ

  • 5 వేల ఎకరాలు కేటాయిస్తే స్మార్ట్‌ హెల్త్‌ సిటీ ఏర్పాటు చేస్తామన్న కొరియా బృందం

హైదరాబాద్‌, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని కొరియా కంపెనీ షూఆల్స్‌ ప్రకటించింది. ఈ కంపెనీ.. మెడికల్‌, స్మార్ట్‌ బూట్ల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. 750 ఎకరాలు కేటాయిస్తే రూ.300 కోట్లతో అత్యాధునిక బూట్ల ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పుతామని కంపెనీ చైర్మన్‌ చెవోంగ్‌ లీ ప్రతిపాదించారు. ఆయన నేతృత్వంలోని కొరియన్‌ పారిశ్రామికవేత్తల బృందం గురువారం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో సమావేశమైంది. తాము ఏర్పాటు చేయాలనుకుంటున్న ఫ్యాక్టరీతో 87 వేల మందికి ఉద్యోగావకాశాలు దక్కుతాయని లీ తెలిపారు. అడుగు భాగాన (సోల్‌) మెడికల్‌ చిప్‌ ఉండే బూట్లు, పది వేల అడుగులు వేస్తే గంటకు 25 వాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేసే షూతో పాటు డయాబెటీస్‌, ఆర్థరైటిస్‌ ఉన్న వారికి ఉపశమనం, స్వస్థత కలిగించే పలు రకాల ఉత్పత్తులు తయారు చేస్తామని.. ఇందుకోసం 750 ఎకరాల భూమి అవసరమవుతుందని చెప్పారు.


భారీ కర్మాగారం నెలకొల్పి ఇక్కడి నుంచే దేశీయ అవసరాలతోపాటు అమెరికా సహా ప్రపంచ మార్కెట్లకు బూట్లు సరఫరా చేస్తామని కంపెనీ ప్రతిపాదించినట్లు మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. ప్రపంచ మార్కెట్లకు తెలంగాణ హబ్‌గా మారుతుందన్నారు. అడుగు భాగాన జీపీఎస్‌ ఉండే బూట్ల వల్ల పిల్లలు, వృద్థులు తప్పిపోకుండా ట్రాక్‌ చేయొచ్చని అన్నారు. షూఆల్స్‌ అభ్యర్థనను అత్యంత ప్రాధాన్యమైనదిగా భావించి, నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అమెరికాలోని జాన్‌ హాప్కిన్స్‌ లాంటి ప్రఖ్యాత హాస్పిటళ్లను తీసుకురావడంతో పాటు పరిశోధన కేంద్రాలు, బయో మెడికల్‌ సెంటర్లు, యాన్సిలరీ పరిశ్రమల కోసం 5 వేల ఎకరాలు కేటాయిస్తే ఆసియాలో ఎక్కడా లేని విధంగా స్మార్ట్‌ హెల్త్‌ సిటీని నెలకొల్పే ప్రతిపాదన కూడా కొరియా బృందం చేసిందని శ్రీధర్‌బాబు తెలిపారు. స్మార్ట్‌ హెల్త్‌ సిటీ ఏర్పాటుతో లక్షల సంఖ్యలో ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఏర్పాటు చేసే పక్షంలో ఈ ప్రతిపాదనను పరిశీలిస్తామని మంత్రి తెలిపారు.


  • పెట్టుబడులకు రైన్లాండ్‌ ఆసక్తి: శ్రీధర్‌బాబు

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు జర్మనీలోని రైన్లాండ్‌ రాష్ట్రం ఆసక్తి కనబర్చిందని మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. రైన్లాండ్‌కు చెందిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం ఆ రాష్ట్ర మంత్రి ష్మిట్‌ ఆధ్వర్యంలో శ్రీధర్‌బాబుతో భేటీ అయింది. ఈ సందర్భంగా రసాయనాలు, ఫార్మా, బయోటెక్నాలజీ, వ్యాక్సిన్లు, ప్యాకేజింగ్‌, పౌలీ్ట్ర, వ్యవసాయం, ఆటోమొబైల్స్‌, లాజిస్టిక్స్‌ వంటి విభాగాల్లో భాగస్వాములవడం, పెట్టుబడులు పెట్టే అవకాశాలపై చర్చ జరిగింది. సులభతర వాణిజ్య విధానాలు, తక్షణ అనుమతుల జారీలో తెలంగాణ అగ్రగామిగా ఉందని శ్రీధర్‌బాబు తెలిపారు. లైఫ్‌ సైన్సెస్‌, ఫార్మా పెట్టుబడులకు తెలంగాణ ప్రపంచ స్థాయి గమ్యస్థానంగా నిలుస్తోందని చెప్పారు. హైదరాబాద్‌లో జరిగే బయో ఏషియా-2025 సదస్సుకు రావాలని శ్రీధర్‌బాబు కోరారు. రైన్లాండ్‌, తెలంగాణ రాష్ట్రాలు ఇకపై ‘సిస్టర్‌ స్ట్టేట్‌’ సహకార సంబంధాలు కలిగి ఉండాలని ఇరు పక్షాలు అంగీకరించాయి. రైన్లాండ్‌ను సందర్శించాలని ష్మిట్‌ బృందంమంత్రిని ఆహ్వానించింది.


  • రాయదుర్గంలో టైమ్స్‌ స్క్వేర్‌!

హైదరాబాద్‌ రాయదుర్గం కూడలిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఐకానిక్‌ టైమ్స్‌ స్క్వేర్‌ నిర్మాణానికి సంబంధించిన డిజైన్లను మంత్రి శ్రీధర్‌ బాబు సమీక్షించి పలు సూచనలు చేశారు. దీనిపై పలు సంస్థలు డిజైన్‌ చేసిన నిర్మాణాల ప్రెజెంటేషన్లను గురువారం మంత్రి సమక్షంలో ప్రదర్శించాయి. న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్‌ తరహాలో 24 గంటలూ సందర్శకులను ఆకట్టుకునేలా టీ స్క్వేర్‌ రూపొందించాలని శ్రీధర్‌బాబు చెప్పారు. భారీ ఎలకా్ట్రనిక్‌ డిస్ప్లేలు, డిజిటల్‌ ప్రకటనలతో ఆ ప్రాంతమంతా వెలుగులు విరజిమ్మాలని అభిప్రాయపడ్డారు. వ్యాపారం, వినోదం, పర్యాటకంతో సందర్శకులు ఉల్లాసంగా గడిపేలా ఉండాలని సూచించారు. 24 గంటలూ తెరిచి ఉండేలా యాంఫీ థియేటర్లు, ఓపెన్‌ రెస్టారెంట్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రత్యేక థీమ్‌తో కూడిన షాపింగ్‌ మాల్స్‌ ఉండాలన్నారు.

Updated Date - Oct 25 , 2024 | 03:47 AM