Share News

Nagarjuna Sagar: శ్రీశైలం, సాగర్‌ను ఖాళీ చెయ్యొద్దు

ABN , Publish Date - Nov 06 , 2024 | 03:26 AM

శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని తాగు, సాగు నీటి అవసరాలకు మాత్రమే వాడాలని కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) తెలుగు రాష్ట్రాలను కోరింది.

Nagarjuna Sagar: శ్రీశైలం, సాగర్‌ను ఖాళీ చెయ్యొద్దు

  • నీటిని తాగు, సాగుకే వాడండి

  • వానాకాలం దాకా పొదుపు పాటించండి

  • తెలుగు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు లేఖ

  • పోటాపోటీగా నీటి విడుదలపై ఆందోళన

హైదరాబాద్‌, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని తాగు, సాగు నీటి అవసరాలకు మాత్రమే వాడాలని కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) తెలుగు రాష్ట్రాలను కోరింది. 2025 వానాకాలం దాకా రిజర్వాయర్లలో నీటిని పొదుపుగా వాడుకోవాలని, జలవిద్యుత్‌ ఉత్పాదన చివరి ప్రాధాన్యంగా ఉండాలని సూచించింది. కేఆర్‌ఎంబీ సభ్యుడు డాక్టర్‌ ఆర్‌.ఎన్‌.శంకువ ఈ మేరకు తెలుగు రాష్ట్రాల ఈఎన్‌సీలకు వేర్వేరుగా లేఖలు పంపారు. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద అవసరమున్నా లేకున్నా పోతిరెడ్డిపాడు నుంచి ఇరువైపులా జలవిద్యుత్‌ ఉత్పాదనతో నీటిని దిగువకు వదులుతున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. అలాగే, సాగర్‌లో ప్రధాన కేంద్రంతో పాటు కుడి, ఎడమ విద్యుత్‌ కేంద్రాల్లో జల విద్యుత్‌ ఉత్పాదన చేస్తున్నారని తెలిపారు.


ఇలా పోటీ పడి తెలుగు రాష్ట్రాలు నీటి నిల్వలను దిగువకు వదులుతుండడంపై కేఆర్‌ఎంబీ ఆందోళన వ్యక్తం చేసింది. తక్షణమే జలవిద్యుత్‌ ఉత్పాదనను నిలిపివేయాలని, అవసరం లేకుండా ఇతర కాంపోనెంట్ల ద్వారా నీటి తరలింపును ఆపాలని కోరింది. నాగార్జున సాగర్‌, పులిచింతల ప్రాజెక్టుల్లో పూర్తి స్థాయిలో నీటి నిల్వలు ఉండడంతో ఎగువ నుంచి వచ్చిన నీటిని అలాగే దిగువకు వదిలేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ లోనూ పూర్తి స్థాయి నిల్వలు ఉండడంతో ఎగువ నుంచి వచ్చిన నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఇలా నీరు వృథా అవుతున్న నేపథ్యంలో కేఆర్‌ఎంబీ తెలుగు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.

Updated Date - Nov 06 , 2024 | 03:26 AM