Share News

KTR: ఏడాదిలో వందేళ్ల విధ్వంసం!

ABN , Publish Date - Nov 05 , 2024 | 04:27 AM

కాంగ్రెస్‌ ఏడాది పాలనలో తెలంగాణ వందేళ్ల విధ్వంసానికి గురైందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. ఎన్నికల్లో కల్లబొల్లి మాటలు చెప్పి, గద్దెనెక్కిన తర్వాత ప్రజల గొంతు కోశారని ధ్వజమెత్తారు.

KTR: ఏడాదిలో వందేళ్ల విధ్వంసం!

  • రాహుల్‌.. నిరుద్యోగుల వద్దకు వెళ్లగలరా?

  • కాంగ్రెస్‌ వైఫల్యాలు చిత్రగుప్తుడి చిట్టా

  • దోచుకుంటున్న సీఎం, మంత్రులు: కేటీఆర్‌

  • దోచుకుంటున్న సీఎం, మంత్రులు: కేటీఆర్‌

హైదరాబాద్‌, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ఏడాది పాలనలో తెలంగాణ వందేళ్ల విధ్వంసానికి గురైందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. ఎన్నికల్లో కల్లబొల్లి మాటలు చెప్పి, గద్దెనెక్కిన తర్వాత ప్రజల గొంతు కోశారని ధ్వజమెత్తారు. తెలంగాణకు వస్తున్న కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఇక్కడి పరిస్థితులు తెలుసుకోవాలని ఓ ప్రకటనలో సూచించారు. రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఆటోడ్రైవర్లు, చేనేత కార్మికులు, మూసీ, హైడ్రా బాధితులు.. ఇలా సమాజంలో అన్ని వర్గాలను వంచించారని ఆరోపించారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలంటూ ఊదరగొట్టి.. వాటిని అమలు చేయలేక చేతులెత్తేశారని ఎద్దేవా చేశారు. ఏడాదిలో కాంగ్రెస్‌ సర్కారు పాలనా వైఫల్యాలు చిత్రగుప్తుడి చిట్టా అంత ఉన్నాయన్నారు.


కాంగ్రెస్‌ పార్టీ ట్విటర్‌లో మాత్రం పూర్తిగా రుణమాఫీ చేశామంటూ సిగ్గులేకుండా అబద్ధాలను ప్రచారం చేసుకుంటోందని, కనీసం రైతులు పండించిన పంటను కూడా కొనుగోలు చేయలేని దద్దమ్మల్లా తయారయ్యారని దుయ్యబట్టారు. ‘మూసీ, హైడ్రా పేరుతో మీ సీఎం పేద, మధ్య తరగతి ప్రజల పొట్ట కొడుతున్నారు. తెలంగాణలో చిన్నపిల్లాడు పిలిచినా వస్తానంటూ బీరాలు పలికిన మీరు (రాహుల్‌) ఇన్నాళ్లూ ఎక్కడ దాక్కున్నారు? స్వయంగా అశోక్‌నగర్‌కు వచ్చి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలకు నాది భరోసా అన్నావ్‌. ఆ నిరుద్యోగులను మోసం చేస్తున్నందుకు సిగ్గనిపించడం లేదా? ఇప్పుడు ఆటో డ్రైవర్లు, విద్యార్థులు, నిరుద్యోగులు, హైడ్రా బాధితుల వద్దకు వెళ్లే దమ్ముందా?’ అని రాహుల్‌ని నిలదీశారు. సీఎం, మంత్రులు తెలంగాణను అడ్డగోలుగా దోచుకునే కార్యక్రమం పెట్టుకున్నారని, ఎవరి ట్యాక్స్‌ వాళ్లకు కట్టే పరిస్థితి తెచ్చారని కేటీఆర్‌ ఆరోపించారు. సీఎం బహిరంగంగానే ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ వసూలు చేస్తున్నారన్నారు. ఇది చాలదన్నట్లుగా రూ.1.50 లక్షల కోట్లతో మూసీ ప్రాజెక్టును తెరపైకి తెచ్చారని.. ఈ సొమ్ములో ఢిల్లీ వాటా ఎంతో రాహుల్‌ చెప్పాలని నిలదీశారు.

Updated Date - Nov 05 , 2024 | 04:27 AM