ఇందిరమ్మ రాజ్యంలో రైతన్నలకు ఉరికొయ్యలే
ABN , Publish Date - Dec 24 , 2024 | 03:39 AM
‘‘అప్పుల తిప్పలుతో ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తే.. కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వం అన్నదాతలను అరిగోస పెడుతోంది. కాంగ్రెస్ పాలనలో అన్నదాతల ఆక్రందనలు వారికి పట్టడంలేదు.
సింగరేణి ప్రైవేటీకరణ యత్నాన్ని వ్యతిరేకిస్తాం: కేటీఆర్
హైదరాబాద్, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ‘‘అప్పుల తిప్పలుతో ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తే.. కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వం అన్నదాతలను అరిగోస పెడుతోంది. కాంగ్రెస్ పాలనలో అన్నదాతల ఆక్రందనలు వారికి పట్టడంలేదు. ఇందిరమ్మ రాజ్యంలో రైతన్నకు ఉరికొయ్యలు, చెరసాలలే దిక్కయ్యాయి’’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రుణమాఫీ కాదు.. రైతుభరోసా రాదని సోమవారం ఎక్స్ వేదికగా ఆయన విమర్శించారు. అధికారంకోసం అడ్డగోలు హామీలిచ్చి.. ఆ తర్వాత అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. క్వింటాలుకు రూ.500 బోనస్ దేవుడెరుగు.. మార్కెట్‌కు వచ్చిన ధాన్యాన్ని కొనే దిక్కులేకుండా పోయిందన్నారు. తెలంగాణలోని ఏరైతూ ధైర్యం కోల్పోవద్దని, కాంగ్రెస్ కుట్రలపై కలిసికట్టుగా ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. అదేవిధంగా వేలమంది కార్మికులకు ఉపాధి కల్పించడంతోపాటు దేశంలో విద్యుత్తు అవసరాలను తీర్చడంలో సింగరేణి సంస్థ మూలస్తంభంగా నిలిచిందన్నారు. ఆ సంస్థ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్మికులు, ఉద్యోగులకు ఎక్స్ వేదికగా కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. కార్మికులపాలిట కల్పవల్లిగా ఉన్న సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటీకరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తే.. బీఆర్‌ఎస్ తరఫున వ్యతిరేకిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు.
పీవీ తెలంగాణలో పుట్టడం గర్వకారణం
ఆర్థిక సంస్కరణలతో భారతదేశ ముఖచిత్రాన్ని మార్చిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తెలంగాణలో పుట్టడం మనందరికి గర్వకారణమని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో పీవీ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గడ్డుకాలంలోప్రధానిగా సేవలందించిన పీవీ.. ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని కాపాడి ఆధునిక భారతానికి బాటలు వేశారని కొనియాడారు.