KTR: ఆలిని మార్చిన వాళ్లున్నారు.. కానీ, తల్లిని మార్చినవాళ్లు లేరు!
ABN , Publish Date - Dec 10 , 2024 | 03:16 AM
ఆలిని మార్చిన వాళ్లను చూశాంగానీ.. తల్లిని మార్చినవాళ్లను చూడలేదని.. సీఎం రేవంత్‌రెడ్డి తప్ప ఎవరూ ఆ పని చేయలేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
ఆ పని చేసింది రేవంత్‌రెడ్డి మాత్రమే.. ఆమె తెలంగాణ తల్లి కాదు.. కాంగ్రెస్ తల్లి
సమాధానం చెప్పలేని దద్దమ్మలు.. మమ్మల్ని అరెస్టు చేయించారు
ఆశావర్కర్లు తల్లుల్లా కనిపించడం లేదా?
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం
‘అదానీ-రేవంత్ భాయీ భాయీ’ టీషర్టులతో అసెంబ్లీకి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు
అడ్డుకున్న పోలీసులు.. గేటు బయటే అరెస్టు
హైదరాబాద్, మేడ్చల్, దుండిగల్, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): ఆలిని మార్చిన వాళ్లను చూశాంగానీ.. తల్లిని మార్చినవాళ్లను చూడలేదని.. సీఎం రేవంత్‌రెడ్డి తప్ప ఎవరూ ఆ పని చేయలేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహ మార్పుపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 2007లోనే తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో తెలంగాణ తల్లి రూపాన్ని ఉద్యమకారులు రూపొందించారని, దానిని మార్చడానికి రేవంత్‌రెడ్డి ఎవరు అని నిలదీశారు. అసెంబ్లీ సమావేశాల తొలి రోజైన సోమవారం.. ‘అదానీ, రేవంత్ భాయీ భాయీ’ అనే నినాదంతో కూడిన ఫొటోలున్న టీషర్టులు ధరించి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీలోకి రావటానికి ప్రయత్నించారు. అయితే, వారిని పోలీసులు అరెస్టుచేసి తెలంగాణ భవన్‌కు తరలించారు. ఈ సందర్భంగా, కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా, లగచర్ల ప్రజల తరఫున నిరసన తెలిపేందుకు అసెంబ్లీకి వెళ్తున్న తమను ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. రాహుల్, ప్రియాంకతోసహా 100 మంది ఎంపీలు అదానీ, ప్రధాని బొమ్మ వేసుకొని పార్లమెంటు లోపలికి వెళ్లవచ్చు గానీ తెలంగాణలో మాత్రం తమను అసెంబ్లీ లోపలికి అనుమతించకపోవటం ఏమిటన్నారు. పార్లమెంటులో ఒక నీతి, శాసనసభలో మరో నీతి ఎలా ఉంటుందని నిలదీశారు. బీఆర్‌ఎస్ వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము లేని దద్దమ్మలు పోలీసులను అడ్డం పెట్టుకొని..తమను ఉభయ సభల్లోకి అడుగుపెట్టకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. స్పీకర్ ఆదేశాలతో పని లేకుండా ప్రభుత్వంలోని వ్యక్తులు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా తమను అరెస్ట్ చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని తెలిపారు. అసెంబ్లీ సమావేశాల మొదటిరోజే తమను రోడ్డు మీద నిలబెట్టారని అన్నారు. నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన దీక్షా దివస్ లేకుండా డిసెంబర్ 9న తెలంగాణ సాధించుకున్న దీక్షాదివస్ లేదన్నారు.
దిక్కుమాలిన భావజాలం
‘తమ బతుకులు మార్చమని ప్రజలు కోరుకున్నారు. అంతేగానీ, తెలంగాణతల్లిని మార్చమని, టీఎ్‌సను టీజీ చేయమని కోరుకోలేదు. తెలంగాణ తల్లి విగ్రహంలో కిరీటం ఉంటే రాచరికపోకడనా? తల్లిని దేవతలాగా కొలిచే ఈ సమాజంలో పేదరాలిగా తల్లిని చూడాలని ఎవరూ అనుకోరు. తెలంగాణ తల్లిని పేదరాలిగా చూడాలన్న దిక్కుమాలిన భావజాలం ఏమిటో అర్థంకావడం లేదు’ అని కేటీఆర్ విమర్శించారు. ఢిల్లీలో కాంగ్రెస్ అదానీకి వ్యతిరేకంగా కొట్లాడుతుంటే.. తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం అదానీకి అనుచిత లబ్ధి చేకూరుస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి డబ్బు సంచులు పంపిస్తున్న కారణంగానే.. అదానీతో ఆయన వ్యాపార లావాదేవీలపై కాంగ్రెస్ పార్టీ మౌనం వహించిందన్నారు. కాగా, సోమవారం సాయంత్రం మేడ్చల్ జిల్లాలో బీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయాన్ని కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంతకు ముందటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పెట్టిన విగ్రహం తెలంగాణ తల్లి కాదని, కాంగ్రెస్ తల్లి అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అస్తిత్వంపై దాడి జరుగుతున్నదన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా.. 90 నుంచి 100 సీట్లతో కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని, సకల మర్యాదలతో కాంగ్రెస్ తల్లి, రాజీవ్ గాంధీ విగ్రహాలను గాంధీభవన్‌కు పంపుతామన్నారు. రేవంత్ సోదరుల ఆస్తులు అదానీని మించిపోయాయని విమర్శించారు.
పాలకపక్షం కుట్ర పన్నింది
శాసనసభ సమావేశాలు సజావుగా జరగకుండా పాలకపక్షం కుట్ర పన్నిందని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపించారు. శాసనమండలిలో విపక్ష నేత మధుసూధనాచారి, మాజీమంత్రి జగదీశ్‌రెడ్డి సోమవారం తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అసెంబ్లీ బయటే అడ్డగించడం దారుణమని, ఇంతకు ముందెన్నడూ ఇలా జరగలేదన్నారు. ‘అదానీ, రేవంత్‌రెడ్డి ఫొటోతో ఉన్న టీషర్ట్ ధరించి సభకు వెళ్తే తప్పేమిటి? ఏ దుస్తులు వేసుకుని రావాలో స్పీకర్ చెబుతారా? అదానీ, మోదీ ఫొటో ఉన్న టీషర్ట్ ధరించి రాహుల్‌గాంధీ పార్లమెంటులోకి వెళ్తే ఆయనను ఎవరూ అడ్డుకోలేదు. మేం రాహుల్‌గాంధీనే అనుసరించాం. కానీ, ఎందుకు అనుమతించటం లేదు’ అని నిలదీశారు.
దళిత, బీసీ ఆడబిడ్డలపై అరాచకమా?
ఆశావర్కర్ల ఉద్యమంపై కేటీఆర్ ఎక్స్‌లో స్పందిస్తూ.. ‘మాతృమూర్తులపై మగ పోలీసులతో దౌర్జన్యమా? ఆశావర్కర్లు మీకు తల్లుల్లా కనిపించడం లేదా? వారేం పాపం చేశారని నడిరోడ్డుపైకి లాగిపారేస్తున్నారు? దళిత, బహుజన ఆడబిడ్డలపై ఇంతటి అరాచకమా?’ అని ఆవేదన వ్యక్తం చేశారు. హోంశాఖ మంత్రిగా ఉన్న మీకు ఆడవాళ్లంటే అంత చులకనా.. ఇందిరమ్మ రాజ్యమంటే అణచివేతలు, అక్రమ అరెస్టులేనా అంటూ సీఎం రేవంత్‌రెడ్డిని కేటీఆర్ ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీలకు దిక్కులేదు కానీ.. ఏడో గ్యారెంటీగా ఎమర్జెన్సీని అమలు చేస్తున్నారన్నారు.