Share News

KTR: ఈ దొంగ ఏడుపులు దేనికి?

ABN , Publish Date - Oct 03 , 2024 | 04:40 AM

తనను అవమానించేలా పోస్టులు పెట్టారని బీఆర్‌ఎ్‌సపై విమర్శలు చేస్తున్న మంత్రి కొండా సురేఖ.. గతంలో తాను మాట్లాడిన బూతు మాటలు గుర్తు తెచ్చుకోవాలని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

KTR: ఈ దొంగ ఏడుపులు దేనికి?

  • కొండా సురేఖపై కేటీఆర్‌ వ్యాఖ్యలు.. మంత్రి ఆగ్రహం

తనను అవమానించేలా పోస్టులు పెట్టారని బీఆర్‌ఎ్‌సపై విమర్శలు చేస్తున్న మంత్రి కొండా సురేఖ.. గతంలో తాను మాట్లాడిన బూతు మాటలు గుర్తు తెచ్చుకోవాలని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సోషల్‌ మీడియాలో తనపై దుష్ప్రచారం చేయలేదా? అని ప్రశ్నించారు. మంత్రి సురేఖ బుధవారం తనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడానికి ముందు.. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ‘‘ఈ దొంగ ఏడుపులు పెడబొబ్బలు దేనికి? నేను హీరోయిన్ల ఫోన్లు ట్యాప్‌ చేశానని కామెంట్లు చేశారు. ఆమె ఆరోపణలు చేసిన వాళ్లు మహిళలు కాదా? వాళ్ల కుటుంబాల్లో ఇబ్బందులు ఉండవా? అడ్డగోలు ఆరోపణలు చేసినపుడు మా ఇంట్లో ఉన్న మహిళలు బాధపడలేదా?’’ అని ప్రశ్నించారు.


అంతేకాదు.. ‘‘సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడిన బేకార్‌ మాటలన్నీ మీకు పంపిస్తా.. మంత్రులు కొండాసురేఖ, సీతక్క కలిసి ఆయన నోటిని ఫినాయిల్‌, బ్రష్‌తో కడగాలి’’ అని వ్యాఖ్యానించారు. అనంతరం.. కొండా సురేఖ వద్ద మీడియా కేటీఆర్‌ వ్యాఖ్యల గురించి ప్రస్తావించగా.. ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘నా వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియాలో పెట్టిన అసభ్యకర పోస్టుపై.. మనసున్న మనిషిగా హరీశ్‌ స్పందించారు. దాన్ని ఖండిస్తూ ట్వీట్‌ చేశారు. మరి కేటీఆర్‌ ఎందుకు స్పందించలేదు? ఆయన మనిషా.. పశువా?’ అని ధ్వజమెత్తారు.


గతంలో మంత్రి సీతక్క, జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మిపైనా పోస్టులు పెట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనికి సంబంధించి మూడు అకౌంట్లు దుబాయి నుంచి, మరో మూడు అకౌంట్లు ఇక్కడి నుంచి ఆపరేట్‌ అవుతున్నాయన్నారు. దీనిపై సైబర్‌ క్రైమ్‌లో ఫిర్యాదు చేశామని వెల్లడించారు. కాగా.. సురేఖపై బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టు విషయంలో బావ హరీశ్‌ రావుకు ఉన్న సోయి.. ఆయన బావమరిది కేటీఆర్‌కు లేదని టీపీసీసీ చీఫ్‌ మహే్‌షగౌడ్‌ వ్యాఖ్యానించారు. దీనిపై మూడు కేటీఆర్‌ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.

Updated Date - Oct 03 , 2024 | 04:40 AM