Lashkar Bonalu: లష్కర్ బోనాలకు సర్వం సిద్ధం.. నేటినుంచి రెండురోజులు ఉత్సవాలు
ABN , Publish Date - Jul 21 , 2024 | 09:10 AM
తెలంగాణ ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే లష్కర్ బోనాలకు ఉజ్జయినీ మహాకాళి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. ఈనెల 21, 22 తేదీల్లో అత్యంత వైభవంగా నిర్వహించే ఉత్సవాలకు ఉత్సవ కమిటీ, అధికార యంత్రాంగం ఏర్పాట్లను పూర్తిచేసింది.
- తెల్లవారుజామున 3.30లకు అమ్మవారికి తొలిబోనం
- ఉదయం 4 గంటల నుంచి భక్తులకు దర్శనం
- ప్రతి 60 అడుగులకు ఓ అత్యవసర ద్వారం
- 1500 మంది పోలీసులతో భద్రత
లష్కర్ బోనాలకు ఉజ్జయినీ మహాకాళి(Ujjain is Mahakali) అమ్మవారి ఆలయం సిద్ధమయింది. ఆదివారం తెల్లవారుజాము 3.30గంటలకే ఆలయ అనువంశిక ధర్మకర్తల కుటుంబ సభ్యులు అమ్మవారికి తొలిబోనం సమర్పిస్తారు. రెండురోజులపాటు జరిగే ఉత్సవాలకు సుమారు 10లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేశారు.
సికింద్రాబాద్: తెలంగాణ ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే లష్కర్ బోనాలకు ఉజ్జయినీ మహాకాళి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. ఈనెల 21, 22 తేదీల్లో అత్యంత వైభవంగా నిర్వహించే ఉత్సవాలకు ఉత్సవ కమిటీ, అధికార యంత్రాంగం ఏర్పాట్లను పూర్తిచేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత జరుగుతున్న తొలిబోనాలు కావడంతో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం లష్కర్ బోనాలను సమర్థవంతంగా, వైభవోపేతంగా నిర్వహించాలన్న కృతనిశ్చయంతో ఉంది. ఈ నేపథ్యంలో ఉజ్జయినీ మహాకాళి(Ujjain is Mahakali) ఆలయంతోపాటు లష్కర్‌లోని అమ్మవారి ఆలయాలను సుందరంగా తీర్చిదిద్దారు.
ఇదికూడా చదవండి: నేడు ఢిల్లీ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి
దేవాదాయశాఖతో పాటు పోలీసు, జీహెచ్‌ఎంసీ, వాటర్‌బోర్డు, విద్యుత్, రెవెన్యూ, రోడ్లుభవనాలు, వైద్య, ఆరోగ్య, సాంస్కృతిక, ఆర్టీసీ తదితర విభాగాల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో ఏర్పాట్లను శనివారం జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి పరిశీలించారు. ఉజ్జయిని మహాకాళి ఆలయంతో పాటు పలు దేవాలయాలకు సంబంధించిన రూట్‌లను పరిశీలించారు. కమిషనర్ మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. శానిటేషన్ మొబైల్ టాయిలెట్లను ఎక్కడికక్కడ అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట జోనల్ కమిషనర్ రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు.
తొలిరోజు జరిగే పూజలు
- ఉదయం 3.30 గంటలకు ఆలయ అనువంశిక ధర్మకర్తల కుటుంబసభ్యులు సురిటీ కామేశ్వర్, సురిటీ రామేశ్వర్ కుటుంబ సమేతంగా శ్రీ ఉజ్జయినీ మహాకాళి అమ్మవారిని దర్శించుకొని తొలి బోనం సమర్పిస్తారు.
- ఉదయం 4 గంటల నుంచి అర్ధరాత్రి వరకు నిరంతరాయంగా అమ్మవారికి బోనాల సమర్పణ, సాదరణ భక్తులకు అనుమతి ఉంటుంది.
- సాయంత్రం 4 గంటల నుంచి తొట్టెల ఊరేగింపులు
- సాయంత్రం 7 గంటల నుంచి ఫలహారం బండ్ల ఊరేగింపు
- రాత్రి 11 గంటలకు జల్ల కడువ రాక..
సోమవారం జరిగే పూజలు
- తెల్లవారుజామున 1.30 గంటలకు శివాజీనగర్‌లోని పీనుగుల మల్లన్న ఆలయం నుంచి పచ్చికుండ రాక..
- 2.30గంటలకు ఆర్పీ రోడ్డులోని చిత్ర దర్గ సమీపం నుంచి వెయ్యి కండ్ల కుండ రాక..
- 4గంటలకు గుమ్మడికాయ తీసుకు వస్తారు.
- 4.30కు బలి కార్యక్రమం
- గంట సేపు ఆలయ శుద్ధి
- ఉదయం 6గంటల నుంచి 7.30వరకు
దర్శనాలు
- 9.30గంటలకు రంగం (భవిష్యవాణి)
- 10 గంటలకు గావు కార్యక్రమం
- 10.30 గంటలకు ఆలయం నుంచి మెట్టుగుడాకు ఘటం బయల్దేరుతుంది.
- 11 గంటలకు అంబారీ యాత్ర
- 11.30 గంటల నుంచి తెల్లవారుజాము వరకు దర్శనాలు
- సాయంత్రం7గంటల నుంచి తెల్లవారు జాము వరకు ఫలహారపు బండ్ల ఊరేగింపు
చలివేంద్రాలు
భక్తుల దాహార్తిని తీర్చడానికి జలమండలి 7 లక్షల వాటర్ ప్యాకెట్లు, 50 వేల వాటర్ బాటిళ్లను ఆలయం చుట్టుపక్కన 5 క్యాంపుల ద్వారా ఏర్పాటు చేస్తున్నారు. ఆలయం వెనుక వస్త్రాల బజార్‌లో, ఆలయం పక్కన, జనరల్ బజార్‌లో, మహాకాళి పోలీస్ స్టేషన్ పక్కన, సుబాష్ రోడ్డు జామియా మసీద్ వద్ద వాటర్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు.
వైద్య శిబిరాలు
అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం రెండు వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. అందులో ఒకటి పోలీస్ స్టేషన్ వద్ద మరొకటి జనరల్ బజార్ వద్ద ఏర్పాటు చేస్తున్నారు. దీనికి తోడు పోలీస్ స్టేషన్ వద్ద అత్యవసర సమయంలో ఉపయోగించడానికి ఓ అంబులెన్స్‌ను సిద్ధం చేశారు.
- జాతరలో 100 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తున్నారు.
ఉజ్జయినీ మహాకాళి ఆలయ చరిత్ర
1813లో బ్రిటీష్ ఇండియా ఆర్మీలో సిపాయిగా పనిచేసే సురిటీ అప్పయ్యకు మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో పోస్టింగ్ ఇచ్చారు. సహచర సిపాయిలతో కలిసి ఉజ్జయిని వెళ్ళిన అప్పయ్య విశ్రాంతి సమయంలో హిందీలో భక్తి పాటలు పాడేవారు. ఈ సమయంలోనే స్థానికుల ద్వారా అష్ఠాదశ శక్తి పీఠాలలో ఒకటైన శ్రీ ఉజ్జయినీ గడ్‌కాళీ (మహాకాళి) అమ్మవారి మహత్యం గురించి తెలుసుకున్నారు. ఆ రోజుల్లో ఆషాఢమాసంలో ఉజ్జయినిలో కలరా వ్యాపించి అనేక మంది చనిపోయారు. దీంతో కలత చెందిన సురిటీ అప్పయ్య ఆ వ్యాధి సోకకుండా ప్రజలను కాపాడితే లష్కర్ (సికింద్రాబాద్)లో అమ్మవారి ఆలయం నిర్మిస్తానని మొక్కుకున్నారు. ఉజ్జయిని నుంచి తిరిగి వచ్చే సమయంలో ఆయన గురిగి (చిన్న మట్టి పాత్ర)లో కుంకుమ రూపంలో అమ్మవారిని సికింద్రాబాద్ తీసుకువచ్చారు. 36 ఇంచుల నారవేప కర్రను తీసుకొచ్చి దానిని రోజూ తొలుస్తూ ఓ రూపాన్ని కల్పించారు. ఆ రూపాన్ని 1815లో ఇప్పడు ఉన్న ఆలయం వద్ద ప్రతిష్ఠించారు. 1815 నుంచి 1864 వరకు కలప విగ్రహానికే నిత్యపూజలు నిర్వహించేవారు. 1864లో అమ్మవారి శిలా విగ్రహాన్ని ప్రతిష్ఠించి నాటి నుంచి నేటి వరకు ఆగమశాస్త్ర ప్రకారం నిత్య పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు.
మాణిక్యాల అమ్మవారు..
1815లో ఆలయ నిర్మాణ సమయంలో నిర్మాణానికి నీరు కోసం సమీపంలో ఓ బావి తవ్వారు. ఆ తవ్వకాల్లో మాణిక్యాల అమ్మవారి విగ్రహం బయటపడింది. ఆ విగ్రహాన్ని మహాకాళి అమ్మవారి విగ్రహం కుడివైపు నెలకొల్పి ప్రతి నిత్యం పూజలు నిర్వహిస్తున్నారు.
జాతర ఏర్పాట్లు ఇలా
- మొత్తం 7 లైన్లు.
- బాటా నుంచి ఒక బోనాల లైన్
- రోచాబజార్ నుంచి ఒక బోనాల క్యూ, ఒక జనరల్ లైన్.
- అంజలి థియేటర్ నుంచి ఒక పాస్ లైన్, ఒక జనరల్ లైన్.
- కంచు బొమ్మ వైపునుంచి ఒక డోనర్ లైన్, బట్టలబజార్ నుంచి సర్వీస్ లైన్. సర్వీస్ లైన్‌లో కేవలం స్వచ్ఛంద సేవకుల రాకపోకలు, ప్రసాదాలను విక్రయ కేంద్రాలకు తరలించడానికి వినియోగిస్తారు.
- క్యూలో ప్రతి 60 అడుగుల దూరంలో ఓ అత్యవసర ద్వారం.
- జోగినులు, శివశక్తులకు మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 4గంటల వరకు బాటా వైపు నుంచి అనుమతి.
- పోలీస్ స్టేషన్ ఆవరణలో అన్ని శాఖల అధికారులతో జాయింట్ కంట్రోల్ రూమ్ ఉంటుంది.
భక్తులకు ఇబ్బందులు కలిగితే ఫిర్యాదు చేయవచ్చు.
- ఉచిత బస్సు పథకం నేపథ్యంలో ఈ ఏడాది 10లక్షలకు పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని అంచనా.
- పదిహేను వందల మంది పోలీసు సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు
- మహిళల భద్రతకు ప్రత్యేక షీటీమ్స్.
- జేబుదొంగలను అదుపులోకి తీసుకోవడానికి క్రైమ్ టీమ్స్ ఏర్పాటు.
ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి
ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News