Share News

KTR: కొడంగల్ రైతులను అడుగుదాం పదా.. రేవంత్‌కు కేటీఆర్ సవాల్

ABN , Publish Date - Aug 16 , 2024 | 03:00 PM

దేశంలోనే అతి పెద్ద మోసం కాంగ్రెస్ సర్కార్ చేసిన రైతు రుణమాఫీ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీరామారావు(KTR) విమర్శించారు.

 KTR: కొడంగల్ రైతులను అడుగుదాం పదా.. రేవంత్‌కు కేటీఆర్ సవాల్

హైదరాబాద్: దేశంలోనే అతి పెద్ద మోసం కాంగ్రెస్ సర్కార్ చేసిన రైతు రుణమాఫీ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీరామారావు(KTR) విమర్శించారు. రుణమాఫీ పేరుతో చేసిన మోసాన్ని కప్పిపుచ్చుకునేందుకు రేవంత్(CM Revanth Reddy) రంకెలు వేస్తున్నారని అన్నారు. తెలంగాణలో అప్పులు తీసుకున్న రైతుల్లో సగం మందికి కూడా రుణమాఫీ కాలేదని తెలిపారు. ఒకేసంతకంతో డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని మాట తప్పారని విమర్శించారు. తొలుత రూ.40 వేల కోట్లతో మాఫీ అంచనాలు వేసి ఇప్పుడు కేవలం రూ. 27 వేల కోట్లకే పరిమితం చేయడం ఏంటని కేటీఆర్ ప్రశ్నించారు. జులై రాగానే లబ్ధిదారుల్లో సగానికిపైగా రైతులకు కోత విధించి మాఫీ అమలు చేశారని అన్నారు.


"31వేల కోట్లు రుణమాఫీ అని కేబినెట్ తీర్మానం చేశారు. అమలులో ఆంక్షలు, కోతలు పెట్టారు. సీఎం అంటే కటింగ్ మాస్టర్ అన్నట్లుగా రేవంత్ పరిస్థితి ఉంది. 60శాతం రైతులకు ఎగ్గొట్టి 40శాతం రుణమాఫీ చేసి వంద శాతం చేశామని చెబుతున్నారు. అంకెలు మార్చి రంకెలు వేస్తున్నారు. కేసీఆర్‌పై ద్వేషం సకల జనులకు మోసం ఇది రేవంత్ విధానం. నిన్నటి వరకు 17, 934 కోట్లు మాత్రమే రుణమాఫీ జరిగింది. 22 లక్షల 37 వేల 840 మందికి మాత్రమే రుణమాఫీ అయింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడూ రుణమాఫీ చేశాం, రైతుబంధు ఇచ్చాం. ఆ రెండు పథకాలకుగానూ మా ప్రభుత్వం రైతుల కోసం రూ.లక్ష కోట్లు వెచ్చించింది. కాంగ్రెస్ ఇచ్చింది కేవలం 17వేల కోట్లే. వానా కాలానికి ఇవ్వాల్సిన రైతు బంధు ఇవ్వలేదు. రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డి పర్యటన సక్సస్ అయింది. రేవంత్ పర్యటన విజయవంతం కాలేదు. ఆ కోపంతోనే రేవంత్ రంకెలు వేస్తున్నట్లు ఉంది" అని కేటీఆర్ పేర్కొన్నారు.


రైతులను అడుగుదాం పదా..

"సీఎం రేవంత్ రెడ్డి భద్రత లేకుండా కొడంగల్ నియోజక వర్గానికి రావాలి. నేనూ వస్తా. ఒక్క ఊర్లో వంద శాతం రుణమాఫీ జరిగిందని రైతులు చెబితే అక్కడే నేను రాజీనామా చేస్తా. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా. దమ్ముంటే నా సవాల్‌ని స్వీకరించు. రుణమాఫీ పూర్తిగా చేయకుండానే సంపూర్ణంగా మాఫీ చేశామని చెప్పడం దిగజారుడుతనం. రైతులను మోసం చేసిన సీఎంపై చీటింగ్ కేసు పెట్టాలి. రేవంత్ మానసిక స్థితిపై నాకు అనుమానం ఉంది.

ఆయనకు ఏదో అయినట్టుంది. ఆయన్ను ఎక్కడైనా చూపించాలని వారి కుటుంబ సభ్యులకు విన్నవిస్తున్నా. రుణమాఫీ, ఆరు గ్యారంటీలు అమలు చేయాలని హరీష్ రావు అన్నారు. రాజీనామా చేయాలని కొందరు సన్నాసులు హరీష్ ఫ్లెక్సీలు పెట్టారు. 8 నెలల్లో 19సార్లు ఢిల్లీకి వెళ్లడం రేవంత్ రికార్డు. కేసీఆర్ పదేళ్ల కాలంలో కూడా 19సార్లు ఢిల్లీకి వెళ్లలేదు. ఒక్క మహబూబ్ నగర్ జిల్లాలోనే ఇంకా లక్షమంది రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. సీఎం జిల్లాలో 41 శాతం, డిప్యూటీ సీఎం జిల్లాలో 30శాతం మాత్రమే రుణమాఫీ జరిగింది. గ్రామాల్లో పర్యటించి వివరాలు సేకరిస్తం. ప్రభుత్వానికి, గవర్నర్ వివరాలు ఇస్తాం. అవసరమైతే కోర్టుకు వెళతాం" అని కేటీఆర్ అన్నారు.

Updated Date - Aug 16 , 2024 | 03:11 PM