Share News

Hyderabad: ప్రేమతత్వాన్ని బోధించిన కవి నజ్రుల్‌ ఇస్లాం

ABN , Publish Date - Nov 24 , 2024 | 04:52 AM

‘ద్వేషమే విశ్వగురువై ప్రపంచానికంతా విద్వేషాన్ని ప్రచారం చేస్తున్న ఈ కాలంలో దాన్ని ఎదుర్కొనే ఏకైక ఆయుధం ప్రేమతత్వం మాత్రమే. అది కాజీ నజ్రుల్‌ ఇస్లాం కవిత్వం నిండా ఉంది.

Hyderabad: ప్రేమతత్వాన్ని బోధించిన కవి నజ్రుల్‌ ఇస్లాం

  • ‘విద్రోహి’ పుస్తకావిష్కరణలో వరవరరావు

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): ‘ద్వేషమే విశ్వగురువై ప్రపంచానికంతా విద్వేషాన్ని ప్రచారం చేస్తున్న ఈ కాలంలో దాన్ని ఎదుర్కొనే ఏకైక ఆయుధం ప్రేమతత్వం మాత్రమే. అది కాజీ నజ్రుల్‌ ఇస్లాం కవిత్వం నిండా ఉంది. అందుకే ఆ మహనీయుడి రచనలను ఆశ్రయించాను, అనువదించాను’ అని విరసం నేత వరవరరావు తెలిపారు. తాను ఎరవాడ జైలు గోడల మధ్య ఉరిశిక్ష పడిన ఖైదీలతో కొన్ని ఉర్దూ పదాల గురించి సంభాషిస్తూ, నజ్రుల్‌ కవిత్వాన్ని తెలుగులోకి అనువదించినట్లు చెప్పారు. ప్రఖ్యాత కవి కాజీ నజ్రుల్‌ ఇస్లాం కవిత్వం వరవరారావు తెలుగు అనువాదం ‘విద్రోహి’ పుస్తకావిష్కరణ సభ శనివారం బషీర్‌బాగ్‌ ప్రెస్‌ క్లబ్‌లో హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ నిర్వహించింది. ముంబై నుంచి వరవరరావు వర్చువల్‌గా ఇందులో పాల్గొన్నారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఉపా లాంటి దేశద్రోహ చట్టాలతో దేశమే జైలుగా మారిన ఈ కాలంలో నిశ్శబ్దాన్ని బద్ధలు కొట్టడానికి జైలు గోడలు బద్ధలు కొట్టండంటూ నజ్రుల్‌ కవిత్వాన్ని ఎత్తిపట్టుకున్నాను’ అనివ్యాఖ్యానించారు. నజ్రుల్‌ఇస్లాం కవితలు తెలుగులోకి అంతగా రాలేదని, ఆ లోటును ‘విద్రోహి’ పుస్తకం భర్తీ చేస్తుందని వీక్షణం ఎడిటర్‌ ఎన్‌.వేణుగోపాల్‌ అన్నారు. బ్రిటిషు వలసవాదానికి వ్యతిరేకంగా నజ్రుల్‌ ఇస్లాం సాగించిన పోరాటాన్ని, తర్వాత కాలంలో బంగ్లాదేశ్‌ జాతీయోద్యమంలో ఆయన సాహిత్యం వహించిన పాత్రను వివరించారు. కార్యక్రమంలో ‘విద్రోహి’ కవిత్వానికి లెల్లే సురేశ్‌ బృందం నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. హెచ్‌బీటీ గీత, సుధాకిరణ్‌ తదితరులు ఇందులో పాల్గొన్నారు.

Updated Date - Nov 24 , 2024 | 04:52 AM