Mahesh Kumar Goud,: బీఆర్‌ఎస్ నేతల కబ్జాలను బయటపెడతాం
ABN , Publish Date - Oct 17 , 2024 | 03:17 AM
అధికారంలో ఉన్నప్పుడు బీఆర్‌ఎస్ నేతలు ఎక్కడెక్కడ కబ్జాలు చేశారో బయటకు తీస్తున్నామని, ఆ వివరాలన్నీ త్వరలోనే బయట పెడతామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.
మూసీ మధ్యలో ఉన్న కట్టడాలే తొలగిస్తున్నాం
బీజేపీ, బీఆర్‌ఎస్ నాటకాలను ప్రజలు నమ్మరు
టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్
హైదరాబాద్, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): అధికారంలో ఉన్నప్పుడు బీఆర్‌ఎస్ నేతలు ఎక్కడెక్కడ కబ్జాలు చేశారో బయటకు తీస్తున్నామని, ఆ వివరాలన్నీ త్వరలోనే బయట పెడతామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ విషయంలో ఎవరినీ విడిచిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మూసీతోపాటు చెరువులను పునరుద ్ధరించి హైదరాబాద్‌కు పూర్వవైభవం తీసుకువస్తామని స్పష్టం చేశారు. మూసీ ప్రక్షాళన, హైడ్రాపై బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వారు ఎన్ని నాటకాలు ఆడినా ప్రజలు నమ్మడం లేదని పేర్కొన్నారు.
అబధ్ధపు ప్రచారంతో బీఆర్‌ఎస్ తృప్తి చెందుతుండవచ్చని, కానీ దీర్ఘ కాలంలో ఆ పార్టీ నష్టపోతుందన్నారు. గాంధీభవన్‌లో బుధవారం హైదరాబాద్ జిల్లాలో పార్టీ బలోపేతం, జీహెచ్‌ఎంసీ ఎన్నికల సన్నద్ధతపైన నేతలు, జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వంద శాతం సీట్లను గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. మూసీ ప్రక్షాళన పేరుతో మేము పేదల ఇళ్లు కూల్చడం లేదని, నదీ గర్భంలో ఉన్న కట్టడాలను మాత్రమే తొలగిస్తున్నామని చెప్పారు. మూసీ నది ప్రక్షాళనపై ప్రతిపక్షాల విధానమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు.
హైడ్రా అంశంపైనా తాజా సమీక్షలో చర్చించినట్లు తెలిపారు. కాగా, సమీక్ష సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో కష్టపడ్డ నేతలకు పదవులు ఇస్తున్నామని, రానున్న రోజుల్లో అందరికీ సముచిత స్థానం దొరుకుతుందన్నారు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎంత పెద్దవారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అందరూ పార్టీ లైన్‌లోనే పని చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. బీజేపీ, బీఆర్‌ఎస్ కలిసి కాంగ్రె్‌సను దెబ్బతీయాలని చూస్తున్నాయని, ఆ పార్టీల కుట్రలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ మాట్లాడుతూ పార్టీ నేతలు విభేదాలు పక్కనబెట్టి.. కలిసి పనిచేయాలని సూచించారు.