Mahesh Kumar Goud: తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు తరలిరండి
ABN , Publish Date - Dec 09 , 2024 | 03:53 AM
ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా సోమవారం సచివాలయంలో తలపెట్టిన తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలంటూ టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలకు మహేశ్‌గౌడ్ పిలుపు
బీజేపీ, బీఆర్‌ఎస్ దొందూ దొందే..: మధు యాష్కీ
నేడు గాంధీభవన్‌లో సోనియా జన్మదిన వేడుకలు
హైదరాబాద్/న్యూఢిల్లీ/మన్సూరాబాద్, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా సోమవారం సచివాలయంలో తలపెట్టిన తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలంటూ టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్లతో జూమ్ యాప్ ద్వారా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏడాది కాంగ్రెస్ పాలన పట్ల ప్రజల్లో మంచి స్పందన ఉందని, మెజారిటీ ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు. ఇప్పటివరకు జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభలకు ప్రజలు లక్షలాదిగా తరలివచ్చారన్నారు. అలాగే ఉత్సవాల ముగింపుగా సచివాలయంలో జరగనున్న తెలగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి భారీగా రావాలని కోరారు. తెలంగాణ అమరవీరుల జ్యోతి రూపశిల్పి, తెలంగాణ తల్లి విగ్రహ సహ రూపశిల్పి రమణారెడ్డిని తన నివాసంలో మహేశ్ గౌడ్ సన్మానించారు. తెలంగాణ తల్లి విగ్రహంలో అమరవీరుల పిడికిళ్లను జోడించడం స్ఫూర్తినీయం గా ఉందని కొనియాడారు. బీఆర్‌ఎస్, బీజేపీలు దొందూ దొందేనని.. ఆ పార్టీల నేతలు కాంగ్రెస్ సర్కారుపై అక్కసు వెళ్లగక్కడమే పనిగా పెట్టుకున్నారని టీపీసీసీ ప్రచా ర కమిటీ చైర్మన్ మధు యాష్కీగౌడ్ మండిపడ్డారు.
బీఆర్‌ఎస్ జాతీయ పార్టీ అయ్యుండి మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేయకుండా.. బీజేపీకి మద్దతుగా నిలిచిందని విమర్శించారు. హైదరాబాద్ ఎల్బీనగర్‌లోని సితార గ్రాండ్ హోటల్‌లో రోడ్డు, రవాణా కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రామ్‌రెడ్డి, పార్టీ నేత రాజశేఖర్‌రెడ్డితో కలిసి యాష్కీ మీడియాతో మాట్లాడారు. సరూర్‌నగర్ బీజేపీ సభలో ఆ పార్టీ అధ్యక్షుడు నడ్డా కాంగ్రెస్ సర్కారుపై చేసిన వ్యాఖ్యలను ప్రజలు ఏ మాత్రం విశ్వసించబోరని చెప్పారు. అసలు ఆ సభలో ఫ్లెక్సీలు, ఖాళీ కుర్చీలే తప్పా ప్రజలెక్కడ కనిపించలేదన్నారు. గత 11 ఏళ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఎన్నో హామీలిచ్చి నెరవేర్చలేదని.. అలాంటి బీజేపీని ప్రశ్నించలేని బీఆర్‌ఎస్ నేతలు ఏడాది కాంగ్రెస్ పాలనపై ఆరోపణలు గుప్పించడం సిగ్గుచేటన్నారు. కాగా..ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా సోమవారం గాంధీభవన్‌లో పార్టీ సీనియర్ నేత వి.హన్మంతరావు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించనున్నట్లు టీపీసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇందులో సీఎం రేవంత్‌రెడ్డి, మహేశ్‌గౌడ్‌తో పాటు పార్టీ ముఖ్య నేతలు పాల్గొంటారని వెల్లడించింది. కార్యక్రమంలో భాగంగా మెగా రక్తదాన శిబిరంతో పాటు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి కళ్లద్దాలు అందజేయనున్నట్లు పేర్కొంది.
తెలంగాణ దేశానికే ఆదర్శం: జితేందర్‌రెడ్డి
సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి అన్నారు. ఏడాదిలోనే ఎన్నో హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిందని చెప్పారు. వచ్చే నాలుగేళ్లు ప్రజలకు స్వర్ణయుగమేనని వ్యాఖ్యానించారు. ఆదివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ప్రజాపాలన విజయోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం శరవేగంగా దూసుకుపోతోందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే ఆరు గ్యారెంటీల్లో రెండింటిని అమలు చేశామన్నారు.