Share News

Mahesh Kumar Goud: సురేఖ అంశంపై అధిష్ఠానం వివరణ కోరలేదు

ABN , Publish Date - Oct 12 , 2024 | 03:45 AM

మంత్రివర్గం నుంచి కొండా సురేఖను తప్పిస్తారన్న ప్రచారంలో వాస్తవం లేదని, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ అన్నారు. నాగార్జున కుటుంబంపైన చేసిన వ్యాఖ్యలు ఆమె వెనక్కు తీసుకున్నరోజే ఈ అంశం ముగిసిపోయిందని పేర్కొన్నారు.

Mahesh Kumar Goud: సురేఖ అంశంపై అధిష్ఠానం వివరణ కోరలేదు

  • ఆమెను పదవి నుంచి తప్పిస్తారన్న ప్రచారంలోనూ వాస్తవం లేదు

  • తన వ్యాఖ్యలను ఆమె ఉపసంహరించుకున్నప్పుడే విషయం క్లోజ్‌

  • కేటీఆర్‌ తీరు వల్లే అలా.. అయినా ఆమె అలా మాట్లాడాల్సింది కాదు

  • దీపావళి లోపు రెండో విడత నామినేటెడ్‌ పదవుల భర్తీ

  • ప్రభుత్వం దృష్టి అంతా మూసీ ప్రక్షాళనపైనే: మహేశ్‌కుమార్‌ గౌడ్‌

హైదరాబాద్‌, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): మంత్రివర్గం నుంచి కొండా సురేఖను తప్పిస్తారన్న ప్రచారంలో వాస్తవం లేదని, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ అన్నారు. నాగార్జున కుటుంబంపైన చేసిన వ్యాఖ్యలు ఆమె వెనక్కు తీసుకున్నరోజే ఈ అంశం ముగిసిపోయిందని పేర్కొన్నారు. సురేఖ అంశంపై అధిష్ఠానం కూడా ఏ వివరణా కోరలేదన్నారు. నాగార్జునపై సురేఖ ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేయలేదని, కేటీఆర్‌ తీరు వల్లే అలా మాట్లాడారని చెప్పారు. అయినా కూడా సురేఖ అలా మాట్లాడాల్సింది కాదన్నారు. ఈ అంశంలో నాగార్జున కోర్టును ఆశ్రయించడంపై స్పందిస్తూ కోర్టు ఏమి చెబుతుందో చూద్దామని పేర్కొన్నారు. రెండో విడత నామినేటెడ్‌ పదవుల భర్తీ దీపావళి లోపున చేస్తామని వెల్లడించారు.


నెల రోజుల లోపు టీపీసీసీ కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. గాంధీభవన్‌లో శుక్రవారం మహేశ్‌ కుమార్‌గౌడ్‌ మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. ప్రభుత్వం దృష్టి అంతా ప్రస్తుతం మూసీ ప్రక్షాళనపైనే ఉందన్నారు. మూసీ సుందరీకరణ రెండో అంశమన్నారు. డీపీఆర్‌ అవసరం సుందరీకరణకోసమే కానీ ప్రక్షాళన కోసం కాదని స్పష్టం ఇచ్చారు. పేద ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రక్షాళన చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మూసీ బాధితుల్లో సగం మంది ప్రక్షాళనకు ఒప్పుకొన్నారని వెల్లడించారు. కాగా తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సోషల్‌ మీడియా వేదికగా తమ గొంతును వినిపించామే కానీ.. బీఆర్‌ఎస్‌ వారిలాగా దుర్వినియోగం చేయలేన్నారు. ఆ పార్టీ నేతలు దుబాయి నుంచి సోషల్‌ మీడియా ఖాతాలు తెరిచి వాటి ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారరన్నారని విమర్శించారు.


మంత్రులు సీతక్క, కొండా సురేఖ బలమైన నేతలు కాబట్టే సోషల్‌ మీడియాలో వారిని టార్గెట్‌ చేస్తున్నారన్నారు. సోషల్‌ మీడియా ద్వారా దుష్ప్రచారం చేసిన వారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు వెల్లడించారు. బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీలోకి త్వరలోనే మరి కొన్ని చేరికలు ఉంటాయని వెల్లడించారు. బీసీల పక్షాన మాట్లాడుతున్న ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న.. పార్టీ లైన్‌ తప్పారని అనుకోవడానికి వీల్లేదన్నారు. అయితే బీసీల విషయంలో కాంగ్రెస్‌ పార్టీ సానుకూలంగా ఉందన్నారు. మజ్లి్‌సతో పార్టీతో స్నేహం వేరు.. శాంతి భద్రతల అంశం వేరని మహేశ్‌ కుమార్‌గౌడ్‌ అన్నారు. తప్పు తమవారు చేసినా.. వారు చేసినా చట్ట ప్రకారం చర్యలు ఉంటాయన్నారు. ఫిరోజ్‌ఖాన్‌, ఆయన అనుచరులపై మజ్లిస్‌ నేతల దాడి అంశంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరినట్లు వెల్లడించారు. కాగా దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మహేశ్‌ కుమార్‌గౌడ్‌ శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - Oct 12 , 2024 | 03:45 AM